నవ్విపోదురుగాక నాకేంటి..!

Wed,September 12, 2018 01:11 AM

-కాంగ్రెస్, టీడీపీ పొత్తులపై మండి పడుతున్న ప్రజలు
-తెలంగాణ వ్యతిరేక పార్టీతో పొత్తేంటని ప్రశ్నిస్తున్న మేధావులు
-వర్గపోరుకు తోడు ఆశావాహులపై వేలాడుతున్న పొత్తుల కత్తి
-కామారెడ్డి కాంగ్రెస్ నాయకుల్లో మొదలైన గుబులు
-నాయకుల్లేక దయనీయ పరిస్థితుల్లో విలవిల్లాడుతున్న తెలుగుదేశం పార్టీ
-నాలుగు నియోజకవర్గాల్లో హస్తం పార్టీలో అంతర్గత కుమ్ములాట
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కామారెడ్డి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లో ప్రచారాన్ని మొదలు పెట్టింది. హుస్నాబాద్ బహిరంగ సభతో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు సైతం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గెలుపే లక్ష్యంగా 105 మంది అభ్యర్థులను మొదటి దఫాలోనే ప్రకటించి సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రచార పర్వంలో సాటి లేకుండా దూసుకుపోతోంది. గులాబీ పార్టీ మినహా రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కనీసం తమ అభ్యర్థులను ప్రకటించుకునే స్థితిలో లేకపోవడం ప్రజల్లో నవ్వుల పాలు జేస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్న హస్తం పార్టీ ఏకంగా తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రపడిన టీడీపీతో పొత్తులకు సిద్ధం అవుతుండడం ఇరు పార్టీల్లోనూ అసంతృప్తిని రగిలిస్తోంది. మరోవైపు ఇటు తెలంగాణ వాదులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్ర ఆకాంక్షను వ్యతిరేకిస్తూ, నూతన రాష్ట్రంలో అడుగడుగునా పేచీలకు దిగుతున్న చంద్రబాబు అండ్‌కోతో జతకట్టడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని హస్తం పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం విశేషం.

అధికార దాహమే ప్రధాన ఎజెండాగా టీ డీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, వారి నియంతృత్వ విధానాలను పారద్రోలడం, ఢిల్లీ పెత్తనాన్ని తగ్గించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని ఆనాడు ఎన్.టి.రామారావు స్థాపించారు. నేడు అదే పార్టీకి సారథిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయడు ఏకంగా పార్టీ ఉద్దేశాలను తుంగలోకి తొక్కి తమ పార్టీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో దోస్తి కట్టేందుకు సిద్ధం కావడం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నమోదు అవుతుంది. నవ్విపోదురు గాక నాకేంటి అన్నట్లు ఇరుపార్టీలు వ్యవహరిస్తున్న తీరుతో సొంత పార్టీల్లోనే అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్నాయి. బాహాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించలేక పోతున్నప్పటికీ హస్తం పార్టీకి చెందిన కొంత మంది ఆశావాహులైతే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ తీరును దుయ్యబడుతున్నారు. ప్రజా బలం సొంతం చేసుకుంటూ రోజురోజుకూ ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులంతా దూసుకుపోతున్నారు. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ నేతలు త్వరగా టికెట్ తెచ్చుకునే పనిలో ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో నలుగురైదుగురు అభ్యర్థులు సీటు కోసం పోటాపోటీగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ దశలో తెలుగుదేశం పార్టీతో పొత్తుల వ్యవహరం కాస్తా కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకత్వానికి నిద్ర పట్టనివ్వడం లేదు. పొ త్తుల అంశం ఎటు తిరిగి ఎవరి సీటుకు ఎసరు తెస్తుందోనన్న భయంతో హస్తం నేతలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

జిల్లాలో కోలుకోలేని స్థితిలో టీడీపీ...
తెలంగాణ ఉద్యమ దశలోనే కామారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచు పెట్టుకపోయింది. కింది స్థాయి క్యాడర్ మినహా బలమైన నాయకత్వం లేదు. 2014కు ముందు వరకు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ, ఆంధ్ర ప్రజలను మోసం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరుతో జిల్లా ప్రజలంతా పచ్చ పార్టీని పాతాళానికి చేర్చారు. పచ్చ పార్టీ అనుసరించిన విధానాలను బండకేసి కొట్టిన నేతలంతా ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కారెక్కారు. దీంతో కామారెడ్డి జిల్లావ్యాప్తంగా సైకిల్ పార్టీ తుస్సుమంది. పార్టీ కార్యాలయం మినహా ఎక్కడా పది మంది పట్టుమని నాయక గణం లేదంటే అతిశయోక్తి కాదు. నాడు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కలిసి రాని తెలుగుదేశం పార్టీ సాధించిన రాష్ట్రంలోనూ అదే రకమైన కుట్రలకు దిగుతుంది. నీళ్లు, ఆస్తుల పంపకాలు, హైకోర్టు విభజన వంటి అంశాల్లో ద్వంద్వ వైఖరితో తెలంగాణకు శత్రువుగా మారింది. ఇవన్నీ తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీతో జత కట్టేందుకు ప్రయత్నాలు చేయడంపై ప్రజలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి అన్నట్లుగా వీరి వ్యవహరం దాపురించిందని ప్రజలంతా కోడై కూస్తున్నారు.

అంతా గందరగోళం...
జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్నాయి. ఇందులో ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఆశావాహులున్నారు. వీరంతా ఎవరికి వారే టికెట్ తమకే వస్తుందన్న నమ్మకంతో తెర వెనుక ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు గ్రౌండ్ లెవెల్‌లో తమ క్యాడర్‌ను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్ష పార్టీల ఊహకు అందకుండా ప్రచార పర్వంలో జెట్ వేగంతో ముందుకెళ్లొంది. అభివృద్ధే ఎజెండాగా మార్చుకుని ప్రజల్లో కలియ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇలా విజయవకాశాలు పెంచుకుంటున్న నేతలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురేసి అభ్యర్థులు ఎవరికి వారే ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటుండటంతో సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు. ఒకే పార్టీ నుంచి ఎంత మంది ప్రచారాలు నిర్వహిస్తారంటూ హస్తం తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles