భారీ మెజార్టీని బహుమతిగా ఇద్దాం!

Tue,September 11, 2018 01:29 AM

-మన గెలుపు సీఎం కేసీఆర్‌ను ఆకర్షించాలి
-కార్యకర్తల సమావేశంలో గంప గోవర్ధన్
-టీఆర్‌ఎస్ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
-సరిహద్దు గ్రామం నుంచి జిల్లాకేంద్రం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ
కామారెడ్డి నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే మనల్ని గెలిపిస్తాయి.. భారీ మెజార్టీని ఆయనకు బహుమతిగా ఇద్దాం.. అందుకోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాల్సిన అవసరం ఉంది.. అని టీఆర్‌ఎస్ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి గంప గోవర్ధన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం గంప గోవర్ధన్ సోమవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జిల్లా సరిహద్దుల్లోని బస్వాపూర్ నుంచి జిలాకేంద్రం వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి పురవీధుల్లోనూ ఈ ర్యాలీ హోరు కొనసాగింది. అనంతరం నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో గంప ఉద్వేగంగా ప్రసంగించారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలను కోరారు.

ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కామారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్ధి గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు నుంచి బైక్ ర్యాలీగా కామారెడ్డికి చేరుకొని పట్టణంలో ప్రధాన వీధుల గుండార్యాలీ కొనసాగించారు. అనంతరం పార్శి కల్యాణమండపంలో నియోజక వర్గ స్థ్ధాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించడం తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు జీవితాంతం ఋణపడి ఉంటానన్నారు. ప్రతి పల్లె నుంచి కార్యకర్తలు తరలి రావడం తాను జీవితంలో మరిచి పోలేనని సంతోషం వ్యక్తం చేశారు. మలి విడుత తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2001 నుంచి 14 ఏళ్లపాటు కేసీఆర్ ఎన్నో ఒడిదుగుకులు ఎదుర్కొన్నారని, పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి 2014లో రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ వీరుడని కొనియాడారు. రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీకి పాలించే సత్తా లేదని ఆంధ్రా నాయకుల అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. అనతి కాలంలో రాష్ర్టాన్ని అభివృద్ధిబాట పట్టించి విమర్శనలు తిప్పికొట్టారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు నాయకులు, కార్యకర్తలు గర్వపడాలని అన్నారు.

కామారెడ్డి నియోజక వర్గంలోని నాలుగున్నర సంవత్సరాల్లో రూ. 858 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా ఏక కాలంలో 105 ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించిన ఖలేజా ఉన్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ప్రతీ కార్యకర్త ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. చిన్న పొరపాటు, నిర్లక్ష్యానికి తావీయకుండా ఇతర పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తనకు మరోసారి అవకాశం వచ్చిందని, భారీ మెజారిటీతో పార్టీని గెలిపించుకొని కేసీఆర్‌కు బహుమతిగా అందజేయాలని అన్నారు. చారిత్రాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించేందుకు కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులు 99 శాతం అధిగమించామని, కామారెడ్డి ప్రాంతానికి వచ్చే ఏడాది కాళేశ్వరం నీరు వస్తుందని స్పష్టం చేశారు. యువతీ యువకులందరూ ఓటరు లిస్టులో పేరును నమోదు చేసుకొని విలువైన ఓటు హక్కుతో అభివృద్ధి నిరోధకులకు సమాధానం ఇవ్వాలని కోరారు. అనంతరం టీఆర్‌ఎస్ యూత్ విభాగంతో పాటు పలువురు నాయకులు గోవర్ధన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గోపీగౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మ, జడ్పీటీసీలు నంద రమేశ్, మధుసూదన్‌రావు, గ్యార లక్ష్మి, ఎంపీపీ మంగమ్మ, సుదర్శన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మసూద్ అలీ, ఆత్మకమిటీ చైర్మన్ బలవంత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్ గౌడ్, నాయకులు రాజన్న, భూంరెడ్డి, నర్సారెడ్డి, ఇంద్రాసేనా రెడ్డి, లకా్ష్మరెడ్డి, ముస్తాక్ హుస్సేన్, పిప్పిరి ఆంజనేయులు, కుంచాల శేఖర్, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, యాద నాగేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles