చారిత్రక కట్టడానికివారసత్వ గుర్తింపు...

Mon,September 10, 2018 01:15 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కామారెడ్డి పెద్ద చెరువుగా స్థానికంగా పిలువబడుతోన్న ఈ తటాకానికి ఘనమైన చరిత్రే ఉంది. 1897లో ఆరో అసఫ్ జాహీ కాలంలో దోమకొండ సంస్థానానికి సంబంధీకులు రాజ మల్లారెడ్డి బహదూర్ దేశాయ్ ఈ చెరువును నిర్మించారు. ఇందుకు సంబంధించిన నాటి చారిత్రక రాతి శిలాఫలకం నేటికీ ఉర్ధూ, తెలుగు భాషల్లో అలుగు పారే ప్రాంతంలోనే దర్శనం ఇస్తుంది. కామారెడ్డి జిల్లాలోనే నిర్మితమైన చారిత్రక ప్రాజెక్టు నిజాంసాగర్ కన్నా ముందే ఈ చెరువును ఈ ప్రాంతంలో నిర్మించారంటే ఈ పెద్ద చెరువుకున్న విశిష్టతను ఊహించుకోవచ్చు. 18వ శతాబ్ది చివరి అంకంలో ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా విరాసిల్లింది. నాడు అడవుల్లో కురిసిన వాన నీళ్లు వృథాగా వాగులు, వంకల్లో కలిసి దిగువకు పోయేది.

కామారెడ్డి చుట్టూత నిర్మితమైన పలు గ్రామాల్లో నివసించే ప్రజలకు సాగుకు, తాగుకు నీళ్ల ఇబ్బందులు ఎదురవ్వగా పరిస్థితిని గమనించిన నాటి నిజాం పాలకులు తటాకం తవ్వేందుకు నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రవాహ మార్గాన్ని అంచనా వేసి దానికి అడ్డంగా విశాలమైన ప్రాంతంలో భారీ ఆనకట్టతో పెద్ద చెరువును నిర్మించారు. 1897లోనే కామారెడ్డి పెద్ద చెరువుకు మూడు తాములతో నిజాం పాలకులు అద్భుతంగా నిర్మించారు. ఒక్కోటి ఒక్కో మార్గంలో ఆయా ప్రాంతాలకు సులువుగా నీళ్లు వదులుకునేందుకు వీలుగా ఈ వెసులుబాటును కల్పించారు. పైగా, ట్యాంక్ బండ్ లెవెల్‌ను 519.40 మీటర్ల స్థాయిలో నిర్ణయించారు. 516.82 మీటర్ల నీటి మట్టానికి అలుగు పారే విధంగా రాతితో కూడిన నిర్మాణాన్ని కట్టకు చివరను అలుగును నిర్మించారు. నాడు నిర్మించిన భారీ అలుగు నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందంటే అతిశయోక్తి కాదు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ పథకంతో ఈ పెద్ద చెరువుకు ప్రాణం పోసినట్లు అయ్యింది. గత పాలకులు దశాబ్ధాల పాటు నిర్లక్ష్యం చేయడం మూలంగా కొంత మేర కాలువలు కబ్జాలకు గురయ్యాయి. మరోవైపు మరికొంత ఆయకట్టు తగ్గిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చెరువు పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే మిషన్ కాకతీయ రెండో దశలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా దృష్టి సారించి రూ.8.96 కోట్లు నిధులు కేటాయించారు. పనులు ముమ్మరంగా జరగడంతో పాటు కట్ట పనులు వేగవంతంగా దూసుకుపోతున్నాయి. అలుగుకు, తూములకు మరమ్మతులు చేశారు. కాలువలన్నీ ఆధునికీకరణకు నోచుకుంటున్నాయి. నాటి చారిత్రక వైభవంతో కామారెడ్డి పెద్ద చెరువు వెలుగొందుతోంది. సుమారుగా 121 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెరువు ఇప్పుడేకంగా హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ కింద కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) నుంచి విశిష్ట గుర్తింపును సాధించడం గమనార్హం.

రాష్ట్రంలో రెండు జలాశయాలకు కేంద్ర జల సంఘం వారసత్వ కట్టడాలుగా ప్రకటించడం పట్ల రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఇంజనీరు ఇన్ చీఫ్ నాగేందర్ రావులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలోని సదర్ మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువులకు దక్కిన గౌరవం పట్ల ఇరువురు ఆనందం వెలిబుచ్చారు. రాష్ట్రంలో వేలాది చెరువులను కాపాడేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకు వచ్చినట్లుగా మంత్రి చెప్పారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి కట్టడాలు వందల సంఖ్యలో ఉన్నాయని ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేందర్ రావు వెల్లడించారు. వీటన్నింటిని గుర్తించి వాటిని తగు రీతిలో పరిరక్షిస్తామని వారు తెలిపారు. తూములు, ఆనకట్టలు వందల సంఖ్యలో ఉన్నాయని వాటి చారిత్రక సమాచారాన్ని, ఫొటోలను, శిలాఫలకాలను, శాసన ఆధారాలను అందించాలని ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రకటనలో తెలిపారు.

పెద్ద చెరువు విశేషాలివీ...
-నిర్మాణం: 1897(ఆరో నిజాం కాలంలో)
-ఆయకట్టు: 858 ఎకరాలు
-పరివాహక ప్రాంతం: గోదావరి బేసిన్, మానేరు సబ్ బేసిన్‌లో కలదు.
-విశిష్టత: నిజాంసాగర్ ప్రాజెక్టు కన్నా ముందే నిర్మితమైన చెరువు ఇదీ.
-ప్రయోజనం పొందే గ్రామాలు: కామారెడ్డి, సారంపల్లి, క్యాసంపల్లి, ఉగ్రవాయి గ్రామాలకు జల సంపదను అందించేది. ప్రస్తుతం కామారెడ్డి పట్టణానికి మాత్రమే తాగు నీటికి ప్రధాన వనరుగా మారింది. మత్స్యకారులకు జీవనోపాధికి కేంద్రమైంది.
-వరద: గరిష్టంగా 8860 క్యూసెక్కులు
-ఆనకట్ట పొడవు: 1800 మీటర్లు
-చెరువు విస్తీర్ణం: 3.05 చదరపు కిలో మీటర్లు
-చెరువు సామర్థ్యం: 171.50 ఎమ్‌సీఎప్‌టీ
-ఫుల్ ట్యాంక్ లెవెల్: 516.82 మీటర్లు
-గరిష్ట నీటి సామర్థ్యం(ఎమ్‌డబ్ల్యూఎల్): 517.65 మీటర్లు
రూ.9కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు
కామారెడ్డి పెద్ద చెరువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపుగా శతాబ్ధం పై చిలుకు చరిత్ర ఈ చెరువు సొంతం. ఇప్పటికీ వందల ఏళ్ల నుంచి ప్రజలకు సాగుకు, తాగు నీళ్ల అవసరాలను తీరుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషితో పెద్ద చెరువు నేడు వెలుగులోకి వచ్చింది. గతంలో చెరువులన్నీ పూడికతో నిండిపోయినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా దాదాపుగా రూ.9కోట్లుతో అభివృద్ధి పనులు చేయిస్తున్నాము. అద్భుతమైన రీతిలో ట్యాంగ్ బండ్ నిర్మాణం జరుగుతుంది. పెద్ద చెరువు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా కామారెడ్డి ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. చారిత్రక కట్టడాన్ని మరింత పకడ్బంధీగా పరిరక్షించేందుకు ప్రయత్నిస్తాము. నేటి తరానికి శతాబ్ధాల నాటి చెరువు ప్రాముఖ్యతను చాటి చెబుతాము.
- గంప గోవర్ధన్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే

129
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles