జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి..!

Sun,September 9, 2018 01:25 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలో 9.72 లక్షల మంది జనాభా ఉంది. నాలుగు నియోజకవర్గాలుండగా 22 మండలాలున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 6.04 లక్షలు మంది ఓటర్లు ఉన్నట్లు తాజా గణాంకాల ప్రకారం స్పష్టం అవుతుంది. ఈ మేరకు జిల్లాలో ఉన్న ఓటర్లందరికీ ఈవీఎంలలో ఓటు హ క్కు వినియోగించుకునేందుకు అవసరమయ్యే సామగ్రిని అందుబాటులో ఉంచుకునేందుకు సమాచారం సేకరిస్తున్నారు. అధికారులు ముందస్తుగా సేకరించిన సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా 750 ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అవసరం అవుతాయని తెలుస్తోంది. జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ, వ్యవసాయ గిడ్డంగులను ప్రాథమికంగా స్ట్రాంగ్ రూంలుగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటి సమాచారాన్ని జిల్లా యంత్రాంగం 12న ఎన్నికల కమిషన్ మీటింగ్‌లో వెల్లడిస్తారు. వారు ఆమోదిస్తే ఈ ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు అవుతాయి.

మొదలైన ఎన్నికల సందడి..
జిల్లాలో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ రద్దుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులంతా ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ జోరుగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శుక్రవారమే తన ప్రచారానికి తెర లేపారు. ఇలా రాజకీయ సందడి ఓ వైపు మొదలవ్వగా ఎన్నికల ఏర్పాట్లలోనూ జిల్లా యంత్రాంగం సైతం నిమగ్నం అయ్యింది. ఈ మేరకు సిబ్బంది విభజన, ఓటరు జాబితా సవరణ వంటివాటిపై వేగంగా అడుగులు పడుతున్నాయి. మొత్తంగా ఇటు ఏర్పాట్లు, అటు రాజకీయ పార్టీల ప్రచార హోరుతో కొత్త వాతావరణం జిల్లాలో కనిపిస్తుంది.

ఓటరు లిస్టును సరిచూసుకొని,
నమోదు కాని వారి పేర్లను నమోదు చేయాలి..
జిల్లాలోని మున్సిపాలిటీ వార్డుల్లో, గ్రామాల్లో ఓటరు లిస్టు ను సరిచూసుకోవాలని, ఓటర్ల నమోదు కానీ వారిని గుర్తించి నమోదు ప్రక్రియను చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని జనహితలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, డిప్యూటీ తహసీల్దార్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో రానున్న ఈవీఎం, వీవీ ప్యాట్లను పరిక్షించుకోవాలని తెలిపారు. మున్సిపల్ వార్డుల్లో, గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రకారం గుర్తించాలని అన్నారు. ఓటర్‌గా నమోదు కాని వారిని ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. ఏ ఒక్క ఓటర్ల గల్లంతు కాకుండా చూడాలని అన్నారు. తహసీల్దార్‌లు ఎలక్ట్రోరల్‌పై పూర్తి పట్టు సాధించాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ ఆఖరు తేదీ పదికి పది రోజుల ముందు వరవకు క్లెయిమ్స్ ఉంటే పరిష్కరించాలని తెలిపారు.

ఎన్నికల నిర్వహ నిర్ణీత ఫార్మాట్ల ప్రకారం నమోదు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. బూత్‌లెవల్ అధికారి సంబంధిత పోలింగ్ స్టేషన్‌లో 15 రోజుల పాటు అక్కడే ఉండాలని సూచించారు. ప్రభుత్వం నుంచి పారితోషకం పొందే వ్యక్తులను మాత్రమే పోలింగ్ స్టేషన్ సిబ్బందిగా నియమించాలని, ప్రతి పది పోలింగ్ స్టేషన్లకు ఒక సూపర్‌వైజర్ ఉండాలని అన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో బూత్‌లెవల్ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. సమస్యాత్మక, అతిసమస్మాత్మక పోలింగ్ స్టేషన్‌లను గుర్తించి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం మండలాల వారీగా పోలింగ్ స్టేషన్లు, నియోజకవర్గల వారీగా ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, ఎస్పీ శ్వేతరెడ్డి, ట్రైనీ ఐఎఎస్ వెంకటేశ్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజేశ్వర్, దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

133
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles