ప్రజల్లోకి అభ్యర్థులు..!

Sat,September 8, 2018 01:07 AM

- ప్రచారం షురూ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి
- ప్రజల్లో కలియ తిరుగుతున్న పోచారం శ్రీనివాస రెడ్డి
- ఎన్నికల ప్రచార కసరత్తును ప్రారంభించిన మిగతా నేతలు
- 24 గంటల్లోనే రంగంలోకి దిగిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు
- సీఎం కేసీఆర్ నిర్ణయంపై వాడవాడలో స్పందన
మతిమాలిన ఆరోపణలతో విపక్షాలు సృష్టిస్తోన్న రాజకీయ గందరగోళం, అభివృద్ధి ఆటంకాల నుంచి రాష్ర్టాన్ని రక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. రాజకీయ వ్యూహ నిర్మాణంతో తనదైన శైలిలో స్పందించిన గులాబీ దళపతి అసెంబ్లీని ఏకవ్యాఖ్య తీర్మానంతో రద్దు చేసి ఆ వెంటనే రాజకీయ నిర్ణయాన్ని సైతం చకచకా పూర్తి చేశారు. తెలంగాణ భవన్ సాక్షిగా ఎన్నికలకు శంఖారావాన్ని పూరించారు. అంతేకాక, గంటల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులను 105 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా పేర్లు వెల్లడించారు. తన పదునైన వ్యూహాలతో అభ్యర్థుల్నీ ప్రకటించి, ప్రతిపక్షాలను తమ దరిదాపుల్లో లేకుండా చేశారు. అసెంబ్లీ రద్దు చేయబడిన 24 గంటలు కూడా గడవకముందే అధినేత బాటలోనే జిల్లాకు చెందిన సీనియర్ నేతలంతా కార్యరంగంలోకి దిగారు. రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఏకంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తుండగా... ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఏకంగా ప్రచారానికి తెర లేపారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైతం భారీ వ్యూహాలతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
-కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ఎన్నికల సమరానికి రంగం సిద్ధం కావడంతో కామారెడ్డి జిల్లాలోనూ గులాబీ శ్రేణులంతా యుద్ధానికి సంసిద్ధమయ్యారు. తొలి ఎన్నికల సభతో హుస్నాబాద్ నుంచి గులాబీ దళపతి కేసీఆర్ శంఖారావాన్ని పూరించగా అధినేత బాటలో జిల్లా నేతలు సైతం నడుస్తున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్‌లకే సీట్లు ఖరారు చేయడంతో శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. ఆయా చోట్ల ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు. అభివృద్ధికి ఆకర్షితులపై కారెక్కిన నేతలంతా అభ్యర్థుల గెలుపునకు పాటుపడేందుకు సిద్ధం అయ్యారు. 105 మందితో టీఆర్‌ఎస్ అధినేత అభ్యర్థులను ప్రకటించడమే తరువాయి జిల్లాకు చెందిన సిట్టింగ్‌లకు స్థానాలు ఖరారు కావడంతో కార్యకర్తలంతా పటాకులు పేల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం నాలుగు నియోజకవర్గాల్లో గ్రామ గ్రామన గులాబీ సంబురం ఓ వైపు కొనసాగుతుండగా... టీఆర్‌ఎస్ అభ్యర్థులంతా సమరానికి సన్నద్ధమై బరిలో దిగి ప్రచార పర్వానికి సిద్ధం అయ్యారు.

శంఖారావం పూరించిన ఏనుగు...
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు వెల్లడించడంతో జిల్లాల్లో ఉత్కంఠ వీడింది. గురువారం సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం రాజకీయంగా కీలకమైన నిర్ణయం వెల్లడించడంతో ఎన్నికలకు పొద్దు పొడిచింది. సంచలన నిర్ణయాలతో టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సమర శంఖారావాన్ని పూరించడంతో ప్రతిపక్ష పార్టీలన్ని కకావికలం అవుతున్నాయి. అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేసి... అన్ని రాజకీయ పార్టీలు వీస్తూ పోయేలా గులాబీ అధినేత తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. మోగిన ఎన్నికల నగారాకు అభ్యర్థులు సైతం సిద్ధం అవుతున్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రచారానికి తొలి అడుగు వేసిన అభ్యర్థిగా ఏనుగు ప్రత్యేకతను చాటుకున్నారు. తనకు ఇష్టదైవమైన రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలోని శ్రీకాలభైరవ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన ఆయన వేద పండితుల ఆశీర్వచనలు స్వీకరించారు. అక్కడి నుంచి ప్రజల మధ్యకు వెళ్లి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించిన విజయాలను వివరించారు. ప్రజలతో మమేకమై రాష్ట్రంలో జరుగుతోన్న రాజకీయ పరిస్థితులను, కాంగ్రెస్ పార్టీ కుటిల నీతిని ఎండగట్టారు.

కలియదిరిగిన మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి...
రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం అసెంబ్లీ రద్దు అనంతరం నేరుగా తన నియోజకవర్గానికి చేరుకున్నారు. తన నియోజకవర్గంలో శుక్రవారం రోజు కలియదిరిగిన పోచారం ప్రజలతో ముఖాముఖి అయ్యారు. వారి సాధకబాధకలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. పేదలకు గూడును అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న చోట్ల డబుల్ బెడ్ రూంలను అర్హులకు అందజేశారు. గురువారం రోజంతా చరిత్రాత్మకమైన అసెంబ్లీ రద్దు వంటి నిర్ణయాల్లో భాగస్వామైన మంత్రి పోచారం శుక్రవారం రోజంతా తన ప్రత్యక్ష కార్యాచరణను ప్రజల మధ్యే ఉండేలా జాగ్రత్త వహించారు. అసెంబ్లీ రద్దు అనంతరం తన నియోజకవర్గంలోకి వచ్చిన పోచారం శ్రీనివాస రెడ్డికి పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి సీటు ఖరారు కావడంపై నేతలంతా బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు.

కార్యాచరణకు సిద్ధం అవుతోన్న గంప, షిండే...
మరోవైపు జుక్కల్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, గంప గోవర్ధన్‌లు సైతం తమ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. అధినేత సూచించిన విధంగా తమ ప్రచార పర్వానికి పటిష్టవంతంగా ప్రణాళికలు రచిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గంప గోవర్ధన్ ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మండల స్థాయిలో వివిధ పార్టీల నుంచి నాయకులను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్నారు. తనకు తిరుగులేని శక్తిగా పరిస్థితులను మార్చుకున్న గంప గోవర్ధన్ ఇక అధినేత ఆదేశాల ప్రకారం ఈ నాలుగేళ్లలో సాధించిన ప్రగతిని నివేదించేందుకు సిద్ధం అయ్యారు. హన్మంత్ షిండే సైతం జుక్కల్ నియోజకవర్గంలో తాను సాధించిన ప్రగతిని నివేదించేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే భారీ నీటిపారుదల ప్రాజెక్టు మంజూరుతో స్థానిక రైతు లోకంలో గుర్తింపు తెచ్చుకున్న షిండే ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రతిపక్ష పార్టీలు జంకుతున్నాయి...
ఒకే రోజు అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు ఎన్నికలకు శంఖారావం పూరించడం, అదే రోజు 105 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆరే. ఎన్నికలు అనగానే ప్రతిపక్ష పార్టీలు కిలో మీటర్ దూరం పారిపోతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు మాటలు మాత్రం గొప్పగా మాట్లాడి ఎన్నికలు అనగానే జంకుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటుగా ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కష్టపడే మాకు, మా పార్టీకి గెలుపు ఖాయం. మాకు ఎలాంటి భయం లేదు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు పైగానే గెలుపును సొంతం చేసుకుంటాం.
- పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రి

ప్రజల ముందుకు ప్రగతి నివేదన...
తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రకెక్కిన టీఆర్‌ఎస్ పార్టీ నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఇప్పటి వరకు అధినేత కేసీఆర్ సారథ్యంలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకువెళ్తాము. ప్రగతి నివేదనతోనే ప్రజల మనుసులు గెలుస్తాము. ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొందుతామన్న నమ్మకం మాకుంది. ప్రతిపక్ష పార్టీలు మాకు కను చూపు మేరలో కూడా కనిపించకుండా కొట్టుకుపోవడం ఖాయం.
- ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles