కొత్త పంచాయతీల్లో నూతన రేషన్ దుకాణాలు..!

Thu,September 6, 2018 01:07 AM

-ఏర్పాటు చేయనున్న పౌరసరఫరాల శాఖ
-ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జిల్లా అధికారులు
-తండాలు, శివారు పల్లెలకు త్వరలోనే ప్రయోజనం
-రేషన్ సరకుల కోసం తప్పనున్న నడక యాతన

ప్రతినెలా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే సరకులను పొందడం కొన్ని ప్రాంతాల వారికి ఇబ్బందిగా మారింది. గ్రామ పంచాయతీలో ఒకటికి రెండు చౌక ధరల దుకాణాలు ఉన్నప్పటికీ తండాలు, శివారు పల్లెల్లో అక్కడక్కడా రేషన్ షాపుల ఏర్పాటు గగనమైంది. సాంకేతిక కారణాలతో దుకాణాల విస్తృతి ఇన్ని రోజుల పాటు నిలిచి పోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త పంచాయతీ రాజ్ చట్టం- 2018 ప్రకారం నూతన గ్రామ పంచాయతీల్లో కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో రెండు వందలకు పైగా పంచాయతీలు కొత్తగా ఉనికిలోకి వచ్చాయి. వీటిలో కొంత మేర రేషన్ దుకాణాలు ఇప్పటికే పని చేస్తున్నాయి. తండాలు, మారుమూల పల్లెల్లో రేషన్ దుకాణాలు లేవు. ఇప్పుడిక్కడ కొత్తగా చౌకధరల దుకాణాలు సైతం త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఇది వరకు 323 గ్రామ పంచాయతీలుండగా ఆగష్టు 2 నుంచి 214 కొత్త పంచాయతీలు ఉనికిలోకి వచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 526 గ్రామ పంచాయతీలున్నాయి. కొత్త పంచాయతీల్లో కూడా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నా... వాటిని తెచ్చుకోవడానికి మారు మూల గ్రామాలు, తండాల ప్రజలు నానా అవస్థ పడుతున్నారు. గ్రామ పంచాయతీకి తమ గ్రామాలు దూరంగా ఉండటంతో కిలో మీటర్లు దూరం నడుచుకొంటూ వెళ్లి బియ్యం, కిరోసిన్ తదితర రేషన్ సరకులు తెచ్చుకుంటున్నారు. నడవడానికి శక్తి లేని వృద్ధులు, ఆరోగ్యం సరిగా లేనివారు ఆటోకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. 20 కిలోల బియ్యానికి రూ.20 ఖర్చు అయితే, ఆటోకు రానుపోను రూ.50కి పైగా అవుతోందని పేదలు ఆవేదన వ్యక్తం చేసున్నారు. జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉండటంతో చాలా మంది ప్రతి నెలా రేషన్ బియ్యం తీసుకోడానికి ఉత్సా చూపుతున్నారు. ఇందులో రూపాయికి కిలో బియ్యంపై ఆధారపడి జీవిస్తున్న వారూ లేకపోలేదు. ఈ తరుణంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో కూడా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయనుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

అధికారుల మల్లగుల్లాలు...


జిల్లాలో 500 జనాభా గల తండాలు, శివారు గ్రామాలను పంచాయతీలుగా మార్చిన విషయం తెలిసిందే. ఆయా పంచాయతీల్లో చాలా వరకు రేషన్ దుకాణాలు అందుబాటులో లేవు. కార్డుదారులు పాత గ్రామ పంచాయతీ వద్దకే వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కొత్త పంచాయతీల్లో సైతం రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఆయా పంచాయతీల్లో జనాభా, కుటుంబాలు, రేషన్ కార్డు లబ్ధిదారుల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక వేళ పాత గ్రామ పంచాయతీలో ఒకటికి మించి చౌక ధరల దుకాణాలు ఉంటే వాటిలో ఒక దానిని కొత్త పంచాయతీకి తరలించడమా... లేక కార్డుల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా ఏర్పాటు చేయడమా అన్నది పరిశీలిస్తున్నారు. దీంతో పాటు పాత గ్రామ పంచాయతీకి కొత్త పంచాయతీకి ఉన్న దూర భారం కూడా లెక్కిస్తున్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో ఆయా పంచాయతీల్లో చౌక ధరల దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ బియ్యం, ఇతర రేషన్ సరకుల కోసం ఆయా గ్రామాలు, తండాల ప్రజలు పడిన ఇబ్బందులకు నూతన పంచాయతీల ఏర్పాటుతో పరిష్కారం లభించనుంది. 20కిలోల బియ్యం కోసం రూ.100 ఖర్చు పెట్టుకుని పోవాల్సిన అవసరం ఇకపై ఉండబోదని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

అధ్యయనం చేస్తున్నాం..


జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము. కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటుకు మాత్రం ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. కాకపోతే ఇప్పటి వరకు పాత గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ ఉన్న చౌక ధరల దుకాణాలను కొత్త గ్రామాలకు తరలించాలనే ఆలోచన ఉంది. ఇందుకోసం జనాభా, రేషన్ కార్డులు, గ్రామాల మధ్య దూరాన్ని అధ్యయనం చేస్తున్నాము. మొదట దఫాలో పాత గ్రామ పంచాయతీల్లో ఉన్న దుకాణాల్లో కొన్నింటిని కొత్త పంచాయతీలకు తరలించే అవకాశం ఉంది.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles