రైతు సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్

Wed,September 5, 2018 11:57 PM

బాన్సువాడ రూరల్: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలో తాడ్కోల్ గ్రామంలో రూ. 26లక్షలతో నిర్మించిన సహకార వ్యాపార సముదాయ భవనాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 8వేల చొప్పున రాష్ట్రంలో మొత్తం దాదాపు రూ. 12వేల కోట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతుకూ బీమా సౌకర్యం కల్పించడంతో వారి కుటుంబాల్లో భరోసా కలిగిందన్నారు. బీమా సౌకర్యం ఉన్న రైతులు రాష్ట్రంలో ఇప్పటి వరకు 706 మంది రైతులు మరణించారని వెల్లడించారు. వారిలో 608 మంది వివరాలను ఎల్‌ఐసీ సంస్థకు అందించగా, 471 మంది నామినీల అకౌంట్లో రూ. ఐదు లక్షల చొప్పున జమ చేసినట్లు చెప్పారు. బుడ్మి సహకార సంఘం పరిధిలో తిర్మలాపూర్‌లో ఓపేన్ గోడౌన్ నిర్మాణానికి రూ. 20లక్షలు, ప్లాట్‌ఫాం నిర్మాణానికి రూ. 8లక్షలు మంజూరు చేయనున్నట్ల తెలిపారు. నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తానని, ఎస్సీ వాడలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని మాజీ సర్పంచికి సూచించారు.
కాళేశ్వరం నీటితో రైతుల పాదాలు కడుతాం..
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు మంజీర నదిపై దాదాపు 40 చిన్న చిన్న ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టారని, దీంతో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద లేక వెలవెల పోతున్నాయని మంత్రి అన్నారు. రైతుల సాగు నీటి కష్టాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ బృహత్తరమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నాంది పలికారని అన్నారు. కాళేశ్వరం నీటికి మల్లన్న సాగర్ నుంచి హల్దివాగులోకి మళ్లించి తద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టును నింపి ఉమ్మడి జిల్లాలోని రైతుల పాదాలను కడుకుతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నట్లు చెప్పారు.

96
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles