న్యాయమే గెలిచింది

Sun,November 17, 2019 12:22 AM

-పార్టీ విప్ ధిక్కరిస్తే వేటు తప్పదు
-ఓటు హక్కు కల్పించి వెన్నుతట్టి గెలిపించాను
-ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం
అలంపూర్, నమస్తే తెలంగాణ : పార్టీ విప్‌ను ధిక్కరించిన వారిపై వేటు తప్పదని, అలంపూర్ మండల ఎంపీటీసీల అనర్హత కేసులో న్యాయమే గెలిచిందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం అలంపూర్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ బీఫారంపై గెలిచినవారు కొందరి మాటలు నమ్మి విప్ ధిక్కరించారన్నారు. అందుకు ప్రతి ఫలంగా కోర్టు వారి ఫిర్యాదును విచారించిందని చెప్పారు. విప్ ధిక్కరించిన వారిపై అనర్హత వేటు వేసిందని, ఈ కేసులో న్యాయమే గెలిచిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో ఎంపీపీగా పని చేసిన అభ్యర్థికి జడ్పీటీసీగా పోటీ చేయడానికి మండల పరిధిలో ఓ గ్రామంలో ఓటు హక్కు కూడా లేకుంటే అధికారులతో మాట్లాడి తాను ఓటు హక్కు ఇప్పించినట్టు ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. జడ్పీటీసీ స్థానం జనరల్‌కు రిజర్వు అయినప్పటికీ పార్టీ ముఖ్య కార్యకర్తల కోరిక మేరకు భీ ఫారం ఇప్పించి వెన్నంటి ప్రచారంలో నిలిచానని, అయినా పార్టీ విప్ కు వ్యతిరేకంగా నడుచుకొని అభాసు పాలయ్యారని పేర్కొన్నారు.

విప్ ధిక్కరించిన వారు ఏ నాయకుడి సపోర్టు తీసుకున్నారో, ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసి సలహాలు తీసుకున్నారో అంతా తనకు తెలుసునన్నారు. అనర్హత వేటు పడిన వారు ఐదేండ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత, అవకాశం కోల్పోయారని చెప్పారు. అలంపూరు నియోజకవర్గంలో వర్గాలకు తావులేదని, తనకు వ్యతిరేకంగా పనిచేసే వారికి మొట్టికాయలు తప్పవని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. పార్టీ వెన్నుపోటు దారులకు తగిన గుణపాఠం జరిగిందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు నారాయణరెడ్డి, జయరాముడు, బుక్కాపురం లక్ష్మన్న, లింగనవాయి ధనుంజయ, నర్సన్‌గౌడు, వెంకట్రామయ్య శెట్టి, అల్లాబక్ష్, కిశోర్, బుక్కాపురం మద్దిలేటి, దేవరాజ్, ర్యాలంపాడు సర్దార్, శీను, షఫీ, సుంకన్న, పోలీస్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles