ఉండవెల్లి : ప్రభుత్వం గ్రామపంచాయతీలకు మంజూరుచేసిన నిధులను సద్వినియోగించుకోవాలని ట్రైనీ కలెక్టర్ శ్రీహర్ష సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండలంలోని తక్కశిల, శేరుపల్లి, పుల్లూరు గ్రామాల్లో ఇన్చార్జి ఎంపీడీవో శ్రీహర్ష పర్యటించారు. ఈ సందర్బంగా తక్కశిల గ్రామసభలో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. అందులో భాగంగా ప్రతి జీపీకి విధిగా వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, శ్మాశన వాటికకు స్థలం, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంత ఉండేవిధంగా చూడాలన్నారు. ప్రతి జీపీ వారు ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి రోజు వారీగా పంచాయతీ సిబ్బందితో గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారుచేయలన్నారు. అనంతరం శేరుపల్లి గ్రామంలో ప్రతి కాలనీని సందర్శించి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. పుల్లూరు గ్రామంలో వైకుంఠధామ నిర్మాణ పనులకు శ్రీహర్ష, సర్పంచ్ నారాయణమ్మతో కలిసి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బీసమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు మద్దమ్మ, నరేందర్‌నాయుడు, నారాయణమ్మ, ఉపసర్పంచ్ ఆనంద్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శులు కవిత, శ్రీనివాసులు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.