-కలెక్టర్ల వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్
గద్వాల,నమస్తేతెలంగాణ: వచ్చే ఏడాది జనవరి 1 తారీకు వరకు 18 ఏండ్ల వయస్సు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.1జనవరి 2020 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి యువకులు ఎలక్టోర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవచ్చని స్పెషల్ సమ్మరి రివిజన్ 2020 ముసాయిదా ప్రక్రియ డిసెంబర్ 16 వరకు పూర్తి చేయాలని ఆయన సూచించారు. నజరీ నక్ష తయారుకు సంబంధించి బూత్ లెవల్ అధికారులకు మోబైల్ యాప్ ఇవ్వడం జరిగిందని అందులో ఇంటి నెంబర్, ఏఫిక్ నెంబర్‌తో సరిపోయేలా చేసి పోలింగ్ స్టేషన్ల వారీగా నజరీ నక్ష రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఫారం-6 నుంచి 8వరకు వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయడమే కాకుండా మరణించిన, డబుల్ ఓటు కలిగి ఉన్న వాటిని పరిశీలన చేసి తొలగించాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ఓటర్ వెరిఫికేషన్ పక్రియ కొనసాగుతుందని మరి కొన్ని రోజుల్లో పూర్తి అవుతుందని చెప్పారు. నజరీ నక్ష ఫారం-6నుంచి 8వరకు ప్రతి రోజు మండలాల వారీగా నివేదిక తెప్పించుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రతి రోజు ఎన్ని ఓటర్ వెరిఫికేషన్ జరిగాయి, నజరీ నక్ష ఎంత వరకు పూర్తి అయింది ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, వచ్చిన ఫారంలు ఎంత వరకు పరిశీలన పూర్తి అయ్యాయి అనే నివేదికను తెప్పించుకోవడం జరుగుతుందని సకాలంలో ముసాయిదా జాబితాను పబ్లిష్ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జేసీ నిరంజన్,ఆర్డీవో రాములు తాసిల్దార్లు పాల్గొన్నారు.