సమస్యల పరిష్కారానికి ప్రతిశాఖతో సమీక్ష నిర్వహించాలి

Tue,November 12, 2019 02:57 AM

గద్వాల, నమస్తే తెలంగాణ: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు ఏ స్థాయిలో పరిష్కారమయ్యాయో ఇకపై ప్రతి రోజు ఒక తాసిల్దార్‌తో పాటు ప్రతి శనివారం ఒక ప్రభుత్వ శాఖతో సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ శశాంక జేసీ నిరంజన్‌ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి ఫిర్యాదులను జేసీతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఆయా తాసిల్దార్‌లు, ప్రభుత్వ శాఖలకు పంపించడం జరుగుతుందని అన్నారు. సమస్య పరిష్కరించిన వెంటనే అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తాసిల్దార్, ప్రభుత్వ అధికారులపైనే ఉందన్నారు. ఇక నుంచి ప్రతి రోజు ఒక తాసిల్దార్‌తో సమస్యలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అలాగే ప్రతి శనివారం ప్రభుత్వశాఖ అధికారితో సమీక్ష నిర్వహించిన అనంతరం పరిష్కారమైన విషయాలు నివేదిక రూపంలో ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజావాణికి మొత్తం 74 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు ఆయా శాఖల వారీగా మండలాలకు పంపి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కొంత మంది అధికారులు, వారి సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సంబంధిత అధికారులు రైలుకు వచ్చి వెళ్లే వారికి నోటీసులు జారీచేసిన అనంతరం నివేదిక పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఉద్యోగి ప్రధాన కార్యస్థానంలో ఉండి విధులు నిర్వహించాల్సి ఉంటుందని లేని పక్షంలో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు తమకు భద్రత కల్పించాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రజావాణిలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles