బేరసారాలు

Sun,October 20, 2019 04:46 AM

-మద్యం దుకాణాల కోసం కొత్త ఎత్తులు
-సిండికేట్ల గుడ్‌విల్ పాచిక
-లక్కున్నోళ్లు పుణ్యక్షేత్రాలకు
-పరేషాన్‌లో డబ్బులు కోల్పోయిన వాళ్లు
మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : మద్యం దుకాణాలు దక్కితే చాలు రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశపడ్డవారందరి కోరిక నెరవేరలేదు. మద్యం టెండర్లలో కొందరికి మోదం, ఇంకొందరికి ఖేదం తప్పలేదు. ఈ నేపథ్యంలో గుడ్‌విల్ ఇచ్చి దుకాణాలు దక్కించుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల బినామీలకు కాస్తో కూస్తో ఆశ చూపి దుకాణాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలు చోట్ల బినామీలు జాక్‌పాట్ కొట్టినట్లుగా పరిస్థితి అర్థం అవుతున్నది.

అదృష్టవంతులు..
పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.65లక్షలు, గ్రామీణ ప్రాంతా ల్లో రూ.55లక్షలు, డిమాండ్ తక్కువ ఉన్న చోట రూ. 50 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించి మద్యం వ్యాపారం చేయాల్సి ఉంటుంది. రెండేండ్లకు కలిపి లైసెన్స్ ఫీజుగానే రూ. 1.30 కోట్లు చెల్లించాలి. అంతకు ముందే నాన్ రిఫండబుల్ డిపాజిట్ ఫీజు రూ. 2లక్షలు చెల్లించి దరఖాస్తుకు ఖర్చు అయ్యింది. వీటికి తోడు ముఖ్యమైన కూడలిలో దుకాణం కోసం అడ్వాన్స్‌గా రూ. 2లక్షల నుంచి రూ.5 లక్షలు, నెలనెలా వేలాది రూపాయల అద్దె, వర్కర్ల వేతనాలు, మిగతా ఖర్చులు.. ఇలా చూస్తే అమ్మో ఇంత ఖర్చా అని నోరెళ్లబెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ రూ.కోటికి పైగా ఖర్చు చేసి ధైర్యంగా ఎందుకు రంగంలోకి దిగుతున్నారు..అంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం ఉంటుంది కాబట్టే అనే సమాధానం వస్తున్నది. లేకుంటే ఒక్క షాపు కోసం మహబూబ్‌నగర్ పట్టణంలో ఓ వ్యాపారి 28 దరఖాస్తులు వేశాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మిడ్జిల్ మండలంలో ఒకే దుకాణానికి 63 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో స్థానికులు సిండికేట్‌గా ఏర్పడి 10 మంది ఓ గ్రూపు, 8 మంది మరో గ్రూపుగా అదే సంఖ్యలో దరఖాస్తులు వేశారు. ఈ దుకాణం కోసం అటు నల్గొండ, ఇటు రంగారెడ్డి జిల్లాల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా ప్రయత్నించారు. చివరకు ఈ దుకాణం తలకొండపల్లికి చెందిన వ్యక్తికి దక్కింది. ఇక జడ్చర్లలో విచిత్రమైన పరిస్థితి కనిపించింది.

ఇక్కడ 14 దుకాణాలు ఉంటే స్థానికులకు ఒక్క దుకాణం కూడా రా లేదు. తిమ్మాజీపేట, మహబూబ్ నగర్, తలకొండపల్లి, భూత్‌పూర్ తదితర ప్రాంతాలకుచెం చెందిన వారికి అదృష్టం దక్కింది. హన్వాడ మండల కేంద్రంలో ఉన్న వైన్ షాపుకు కూడా పోటీ బాగా ఉండింది. మండలానికి చెందిన రెండు సిండికేట్లు వేర్వేరుగా 10 దరఖాస్తులు వేసినా రిక్తహస్తమే ఎదురైంది. దేవరకద్రలోనూ రెండు దుకాణాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. 17 చొప్పున దరఖాస్తులు రాగా.. ఓ నేత సొంతంగా వివిధ పేర్లపై 8 దరఖాస్తులు చేశాడు. అన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఇక్కడ ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి దుకాణం దక్కింది. మూసాపేటలో ఓ పార్టీ నేత 3 దరఖాస్తులు వేస్తే చివరకి ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. అడ్డాకుల మండల దుకాణం కోసం 46 మంది పోటీ పడ్డారు. వడ్డేపల్లికి చెందిన వ్యక్తికి ద క్కింది. ఇక్కడ కూడా సిండికేట్‌గా ఏర్పడి అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ సిం గిల్ టెండర్ వేసిన వ్యక్తికే అవకాశం దక్కింది. అదృష్టవంతులు అందలం ఎక్కితే దురదృష్టవంతులు మాత్రం నష్టపోయారు.

స్థానిక బలం అవసరం..
ఈ సారి మద్యం టెండర్లలో సింహభాగం స్థానికేతరులకే అవకాశం వచ్చింది. అప్పటికే మద్యం వ్యాపారాల్లో అనుభవం, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లు వారి దుకాణాలు సొంతంగా నడుపుకునే అవకాశం ఉంది. అయితే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చిన వారి పరిస్థితి అలా కనిపించడం లేదు. స్థానికంగా పట్టున్న వారి అండతో దుకాణాలు నడుపుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అవసరమైతే స్థానిక లీడర్లకు షేర్ ఇచ్చి భాగస్వాములను చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నిత్యం వివిధ ఆటుపోట్లతో ఉన్న దందా కావడంతో స్థానిక పలుకుబడి ఉంటే ఎలాంటి ఆటంకాలు ఉండవనే భావన దుకాణం దక్కించుకున్న స్థానికేతరుల్లో కనిపిస్తోంది. దమ్మున్నోళ్లు ఓకే కానీ... ధైర్యం లేని వాళ్లు లోకల్ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గుడ్‌విల్ ఎర..
జడ్చర్ల, బాదేపల్లిలో కలిపి 10 దుకాణాలున్నాయి. వీటికోసం పట్టణానికి చెందిన అనేక మంది ప్రయత్నాలు చేశారు. కానీ స్థానికులకు ఒక్క షాపు కూడా దక్కలేదు. అంత ఇతర మండలాలు, వేరే ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు, కొత్తవారికి అవకాశం దక్కాయి. అయితే, ఇప్పటికే వ్యాపారంలో ఉన్న పలువురు సిండికేట్‌గా మారి గుడ్‌విల్ ఎర వేసి దుకాణాలను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వారి బినామీలకు దుకాణాలు దక్కాయి. బినామీలకు నెలనెలా కొంత ముట్టచెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకుని దుకాణాలను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల బినామీలకు షేర్ ఇచ్చి భాగస్వాములను చేసుకుంటున్నారు.

పుణ్య క్షేత్రాలకు పయనం..
దేవుడా లక్కీ డిప్‌లో నాకు మద్యం షాపు వస్తే నీ కొండకు వచ్చి మొక్కు తీర్చుకుంటా అని ఒకరు... తల నీలాలు సమర్పించుకుంటా అని మరొకరు.. నిలువుదోపిడి ఇస్తా అని ఇంకొకరు.. ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో దేవుడిపై భారం వేసిన వారు ఇప్పుడు తమ కోరికలు తీరిన క్రమంలో మొక్కులు చెల్లించుకునేందుకు పుణ్యక్షేత్రాలకు పయనమయ్యారు. దేవుడి దయ వల్లే తమకు అదృష్టం వచ్చిందని.. అందుకే మొక్కు తీర్చుకునేందుకు వెళ్తున్నామని చెబుతున్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles