అన్ని రూట్లలో ఆర్టీసీ పరుగులు

Sat,October 19, 2019 01:55 AM

-జిల్లా వ్యాప్తంగా 103 బస్సు సర్వీసులు
-76 ఆర్టీసీ, 20 హైర్, 7 ప్రైవేట్ బస్సులు
-బస్సుల్లో ప్రయాణికులకు టిక్కెట్లు అందజేత
-యథావిధిగా ప్రజల ప్రయాణం

గద్వాలటౌన్ : జిల్లాలో ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు సమ్మె కొనసాగుతున్నప్పటికీ, అధికారులు ముందస్తు ప్రణాళిక చేపట్టడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణం చేస్తున్నారు. సమ్మె ప్రభావం ఏ మాత్రం ప్రజలపై పడకుండా అధికారులు తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 14రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నా, తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 103 బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తున్నారు.జిల్లాలో కార్మికుల సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా అన్ని శాఖల అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతూ వారి వారి గమ్య స్థానాలకు ఆర్టీసీ చేర్చుతోంది. అన్ని రూట్లలో పగలు, రాత్రి వేళల్లో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పాయి.

జిల్లా వ్యాప్తంగా బస్సులు
జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లల్లో ఆర్టీసీ తన సేవలను కొనసాగించింది. అందుకనుగుణంగా ఆర్టీసీ 76 బస్సులు, హైర్ 20 బస్సులు, 7ప్రైవేట్ బస్సులను అన్ని రూట్లకు నడిపిస్తున్నారు. అలంపూర్ స్టేజీ నుంచి జోగులాంబ ఆలయం వరకు ఏర్పాటు చేసింది.

ఫుల్‌గా ప్రయాణికులు
ఆర్టీసీ సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉండడంతో రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో బస్సుల న్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్యను పెంచుతోంది.

బందును విజయవంతం చేయండి
డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా శుక్రవారం కార్మికులు జిల్లా కేంద్రం గద్వాలలోని కృష్ణవేణి చౌరస్తాలో నిరసన తెలిపారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తం గా చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కార్మికులు కోరారు. బంద్‌కు బీ జేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఎల్‌ఎఫ్, టీజేఎస్, సీఎంఎం, సీపీఐలతో పాటు ఉపాధ్యాయ, ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతును తెలిపాయి. అనంతరం సమ్మెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో కార్మికులు సుధాకర్, బీవీరెడ్డి, ప్రసాద్, మారుతి, పరమేశ్వరయ్య, ఉసేనప్ప, భాస్కర్‌రెడ్డిలతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles