రైతులకు నష్టం కలిగించొద్దు

Fri,October 18, 2019 01:16 AM

-అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయాలి
-జెడ్పీ చైర్ పర్సన్ సరిత, కలెక్టర్ శశాంక
-అధికారులు పక్కాగా విధులు నిర్వర్తించాలి
-ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహాన్‌రెడ్డి, అబ్రహం
-హరితహోటల్‌లో ధాన్యం కొనుగోళ్లపై అవగాహన

గద్వాల రూరల్: రైతులు నష్టపోకుండాఉండాలంటే అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ సరిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హరిత హోటల్‌లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి 2019-20 సంవత్సరానికి ధాన్యం కొనుగోలుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ శశాంక, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వానాకాలం సీజన్‌లో పంట ఎంత మొత్తంలో జిల్లా మార్కెట్‌కు వస్తుందనే విషయంలో అధికారుల మధ్య సమన్వయం లోపంపై ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సౌకర్యాలు సమకూరుస్తుంటే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించక పోవడం వల్ల రైతులు నష్టపోతారని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ పౌరసరఫరాల ద్వారా ఈ వానాకాలం సీజన్‌లో 1520 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేయగా వ్యవసాయ శాఖ వారు మాత్రం కేవలం 26,951 హెక్టార్లలో వరి సాగుచేయటం జరిగింది కాబట్టి కొనుగోలు కేంద్రాలకు తక్కువ ధాన్యం వస్తుందని చెప్పటం ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు.

జిల్లాలో ఈ సారి కేవలం రెండు కొనుగోలు కేంద్రాలకు మాత్రమే అనుమతులు వచ్చాయని వారికి సరిపడినన్ని బ్యాగులు సమకూర్చడంతో ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఈ సమావేశాన్ని నాలుగైదు రోజుల్లో తిరిగి నిర్వహించి సరైన నివేదికలతో అధికారులు రావాలని అన్నారు. ఈ వానాకాలం సీజన్‌లో ఏ-గ్రేడ్ రకానికి వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1835, సాధారణ రకానికి రూ.1815 మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీకేఎంఆర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురువడం వల్ల దాదాపు 13 టీఏంసీల నీటి నిల్వచేసుకోగలిగామని, రెండు పంటలకు నీరు సరిపోతుందని అన్నారు. అధికారులు సరియైన నివేదిక ఇవ్వకపోవడం వలన యూరియా విషయంలో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తూ నివేదికలు తయారు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ గద్వాల ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి అధికారులు సరైన నివేదికలు తయారుచేసి అందుకు అవసరమైన బ్యాగులు, గోడౌన్‌లు, టార్పలీన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. తుమ్మిళ్లకు నీరు రావడం వల్ల అలంపూర్ నియోజకవర్గంలో కూడ వరిసాగు పెరిగిందని అన్నారు. అయిజలో వరి కొనుగోలు సబ్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ నిరంజన్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష, ఆర్డీవో రాములు, ఎంపీపీలు, డీఏవో గోవిందునాయక్, డీఏస్‌వో చంద్రశేఖర్, మార్కెట్ శాఖ అధికారి పుష్పమ్మ, తాసిల్దార్లు, రైస్‌మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles