వ్యాధుల పట్ల నిర్లక్ష్యం తగదు

Fri,October 18, 2019 01:13 AM

గద్వాల టౌన్ : మీజిల్స్, రుబెల్లా వ్యాధుల నియంత్రణకు వైద్యాధికారితో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వ్యాధుల పట్ల నిర్లక్ష్యం సరికాదని జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో రాజేంద్రకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మీజిల్స్, రుబెల్లా వ్యాధులపై డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్ డాక్టర్ ప్రగత్‌తో కలసి జిల్లాలోని వైద్యాధికారులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరంతో పాటు దద్దుర్లు వస్తే వారిని వ్యాధి సోకిన అనుమానితులుగా భావించి చికిత్స చేయాలని సూచించారు.

మిజిల్స్, రుబెల్లా వ్యాధులు అరికట్టాలంటే ప్రతి ఆరోగ్య కార్యకర్త బుధవారం, శనివారం వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వ్యాధులపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. ప్రతి పిల్లవాడికి ఎంఆర్ వ్యాక్సిన్‌ను రెండు డోసులు తప్పనిసరిగా వేయాలన్నారు. పోషకాహర లోపం ఉన్న పిల్లలకు వ్యాధులు ఎక్కువగా సోకే ఆస్కారం ఉంది కాబట్టి పోష్టికాహరంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 2023నాటికి వ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ శశికళ, వైద్యాధికారులు మాలకొండయ్య, కాంత, నర్సింహులు, మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణ, బుగ్గప్ప, మల్లికార్జున్, నర్సింహులు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles