పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Thu,October 17, 2019 01:26 AM

-గద్వాల జెడ్పీ చైర్ పర్సన్ సరిత
-అలంపూర్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటా
-ప్రజా ప్రతినిధుల కృషి అమోఘం : కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
-నది ఆవలి గ్రామాలకు విద్యుత్ సరఫరా లైన్ ప్రారంభం

అలంపూర్, నమస్తే తెలంగాణ : ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ పల్లెలు, పట్టణాలు అభివృద్ధి దిశగా ముందుకు నడుపుతున్నారని, అదేవిధంగా అలంపూర్ కూడా అభివృద్ధి దిశగా ముందుకు పోతుందని జెడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య అన్నారు. బుధవారం అలంపూర్ మండల పరిధిలోని నది ఆవలి మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా ప్రారంభించే కార్యక్రమానికి అలంపూరు ఎమ్మెల్యే అబ్రహం, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌లతో కలిసి సరిత హాజరయ్యారు. విద్యుత్ శాఖ అధికారుల సమక్షంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పలువురు టీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు. ముందుగా ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే లు, జెడ్పీ చైర్‌పర్సన్ సరితను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ నది ఆవలి గ్రామాలను అలంపూరు మండల కేంద్రానికి రవాణా మార్గం సుగమం చేసేందుకు గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వంతెనకు శంకుస్థాపన జరుగగా, టీఆర్‌ఎస్ పార్టీ హయాంలో పనులు పూర్తి అయ్యాయన్నారు. విద్యుత్ శాఖాధికారులు త్వరిత గతిన పనులు పూర్తిచేశామన్నారు.

అదేవిధంగా నది ఆవలి గ్రామాలకు సైతం నేడు 24 గంటల విద్యుత్ ఇవ్వగలిగారన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ గతంలో ఇరు రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు ఉండేవి కావని, ప్రస్తుత సీఎంలు కేసీఆర్, జగన్‌ల మధ్య సఖ్యత నెలకొందన్నారు. మావైపు నుంచి ఏదైన సహయం కావలసి వస్తే తప్పకుండా అందిస్తామన్నారు. విద్యుత్ ఎస్‌ఈ చక్రపాణి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల కృషి ఫలితంగానే నది వంతెనపై పనులు త్వరితగతిన చేయగలిగామన్నారు. రూ.22 లక్షల ఖర్చుతో సుమారు కిలో మీటరు పొడవున వంతెనపై కేబుల్ వేయడం జరిగిందన్నారు. ఇక మీదట ఆయా గ్రామాలకు 24 గంటల విద్యుత్ అందుతుందన్నారు. అంతకు ముందు జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులు బొకేలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశపోగు రాజు, సర్పంచులు కుబ్రా సర్దార్, రమణమ్మ, శ్రీనివాసులు, అనితా, వసుంధర, డీఈ మోహన్, ఏఈ నరసింహాచారి, గోవర్దన్, టీఆర్‌ఎస్ నాయకులు నారాయణరెడ్డి, మహేశ్‌గౌడ్, సుదర్శన్‌గౌడ్, జాన్, మోహన్‌రెడ్డి, జయరాముడు, నర్సన్‌గౌడ్, వెంకట్రామయ్యశెట్టి, అల్లాబకాష్, రమణ పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles