రోటా వైరస్‌పై అవగాహన కల్పించాలి

Sun,August 25, 2019 12:41 AM

గద్వాల టౌన్: రోటా వైరస్ ప్రమాదకరమైనదని, ఇందుకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేంద్రకుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో రోటా వైరస్‌పై ఆశ లకు, ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోటా వైరస్ అనేది ఒక సూక్ష్మక్రిమి అని, దీని ద్వారా పిల్లలకు అనేక రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. వ్యాధి సోకడం ద్వారా నీళ్లవిరేచనాలు, జ్వరం, వాంతులు, కడుపునొప్పి రావడంతో పాటు మరణం సంభవించే అవకాశం కూడా ఉందన్నారు. కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రమైన పరిసరాల కారణంగా, ఒకరి ద్వారా మరొకరికి వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. వీటన్నింటిని నివారించేందుకు వచ్చే నెల 7న రోటా వైరస్ నివారణ టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి..
కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో వైద్య సిబ్బందికి సూచించారు. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శనివారం కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 26నుంచి వచ్చే నెల12 వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాల్లో డీపీఎంవో మల్లికార్జున్, ప్రేమ్‌సాగర్, డాక్టర్ ఇర్షాద్, మధుసూదన్‌రెడ్డి, నర్సింహులు, వరలక్ష్మి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles