మత్స్యకారుల సంక్షేమానికి కృషి

Fri,August 23, 2019 02:53 AM

గద్వాల, నమస్తే తెలంగాణ: జిల్లాలో మత్స్య సంపద పెంచడంతో పాటు మత్య్సకారులకు చేయూత నివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలు వదులుతున్నట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రం సమీపంలోని జములమ్మ ఆలయం వద్ద ఉన్న రిజర్వాయర్‌లో ఎమ్మెల్యే చేప పిల్లల సీడ్‌ను గురువారం వదిలారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. చేపలు వదిలిన అనంతరం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు చేపలను విదేశాలకు ఎగుమతి చేసి విదేశీ కరెన్సీ సంపాదించాలనే లక్ష్యంతో ఉచిత చేప పిల్లలను చెరువుల్లో వదలడం జరుగుతుందన్నారు. జిల్లా మొత్తంగా ఉన్న 125 చెరువుల్లో ఈ సంవత్సరం నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీ పై వదులుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో 4.80లక్షల చేప పిల్లలు వదిలామన్నారు. జిల్లాలో మత్ప్యకారుల అభివృద్ధికి ఇప్పటికే టీవీఎస్ మోపెడ్ వాహనాలు, ఆటోలు ఇతర వాహానాలు సబ్సిడీపై ప్రభుత్వం అందించిందని తెలిపారు. జిల్లా నుంచి చేపలే కాకుండా రొయ్యలు సైతం పెంచి ఇతర దేశాలకు సరఫరా చేసే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

మత్య్సకారులు ప్రభుత్వం ఇస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయాలని సూచించారు. రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మిగిలిన రాష్ర్టాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నదులు, సముద్రాల శాతం తక్కువగా ఉన్న ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుని చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. అన్ని చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి చేప పిల్లలు పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. అనంతరం ఎంపీపీలు జములమ్మ రిజర్వాయర్‌లో బోట్‌పై షికారు చేశారు. ఎమ్మెల్యే వెంట చేపలు వదిలిన వారిలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సరోజమ్మ, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, రాజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్, మాజీ జెడ్పీ చైర్మన్ భాస్కర్, జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షుడు చెన్నయ్య, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్, టీఆర్‌ఎస్ నేతలు సంజీవులు, రమేష్‌నాయుడు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles