జూరాల గేట్ల మూసివేత

Thu,August 22, 2019 12:37 AM

-ఎగువ నుంచి తగ్గిన వరద
-తుంగభద్రకు ఇన్‌ఫ్లో 32,963 క్యూసెక్కులు
-10 గేట్ల ద్వారా దిగువకు 32,483 క్యూసెక్కులు

అమ్రాబాద్ రూరల్ : ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు నెమ్మదించాయి. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు నీటి ప్రవాహం తగ్గుతోంది. ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. ఫలితంగా జూరాల ప్రాజెక్టు నుంచి మంగళవారం రాత్రి వరద కాస్త పెరగడంతో శ్రీశైలం డ్యామ్ ఒక క్రస్టు గెటును ఎత్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచి మరింత వరద పెరగడంతో అధికారులు మరో గేటును 10 అడుగులకు ఎత్తి సాగర్‌కు నీటిని సాయంత్రం 3 గంటల సమయానికి లక్షా 70 వేల క్యూసెక్కులను వదిలారు. అనంతరం వరద తగ్గడంతో సాయంత్రం 4 గంటలకు ఒక గేటు ద్వారా నీటిని దిగువకు వదిలిన అధికారులు సాయంత్రం 5:20 గంటలకు ఒక గేటును కూడా అధికారులు మూసి వేశారు. జూరాల పంప్‌హౌజ్ ద్వారా 24,322 క్యూసెక్కులు కాగా, శ్రీశైలం డ్యామ్ వైపు 55,207 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా అంతే క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 72,266 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు, 268.725 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నది.

ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో బుధవారం నాటికి 884.80 అడుగులు కాగా 214.3637 టీఎంసీల నీరు ఉన్నది. అలాగే సుంకేసుల ప్రాజెక్టుకు సోమవారం కొద్దిగా తగ్గించి 30,855 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతలకు 2400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు 30,000 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 2026 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ముచ్చుమరి ప్రాజెక్టు నీళ్లు వదలడం లేదు. శ్రీశైలం టీఎస్ ఎడమ పవర్ హౌజ్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 42,384 క్యూసెక్కులు, శ్రీశైలం కుడిగట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పవర్ హౌజ్ ద్వారా 29,882 క్యూసెకుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి అవుట్ ఫ్లో ద్వారా 1,06,692 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపు దిగువకు వదులుతున్నారు. పదమూడు రోజులుగా ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగతున్నదని, ఒక యూనిట్ ద్వారా 150 మెగావాట్ల చొప్పున మొత్తం 2700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అమ్రాబాద్ మండల పరిధిలోని ఈగలపెంటలోని తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని తెలిపారు.

జూరాలకు నిలకడగా వరద
అయిజ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతుండటంతో జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లను అధికారులు మూసివేశారు. బుధవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 35,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 31,322 క్యూసెక్కులుగా నమోదైంది. 318.516 మీటర్ల నీటి సామర్థ్యానికి గానూ 318.40 మీ టర్ల నీటిని నిల్వ చేశారు. 9.657 టీఎంసీల నీటి మట్టానికి గాఊ 9.418 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ప్రవా హం వస్తుండటంతో కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాల్వకు 888 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,190 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 850 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా 2,250 క్యూసెక్కులు, భీమా లిప్టు -1కు 1300 క్యూసెక్కులు, భీమా లిప్టు -2 ద్వారా 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిప్టు ద్వారా 630 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కృష్ణానది వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 45,064 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 5,991 క్యూసెక్కులు నమోదైంది. 129.72 టీఎంసీల నీటి సామర్థ్యానికి గానూ 124.56 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపుర ప్రాజెక్టుకు 25,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 13,618 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదు కాగా, 37.64 టీఎంసీల సామర్థ్యం కలిగిన నారాయణపురలో ప్రస్తుతం 36.15 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు.

తుంగభద్రకు స్థిరంగా వరద
అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద స్థిరంగా వస్తోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుతోంది. బుధవారం తుంగభద్ర జలాశయానికి 32,963 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 10 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 32,483 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో ఒక మోస్తారులో కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద వచ్చి చేరుతోంది. 100.855 టీఎంసీల నీటి నిల్వకు గానూ ప్రస్తుతం 100.855 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1633 అడుగుల పూర్తిస్థాయిలో నిల్వ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆర్డీఎస్ ఆనకట్టకు నిలకడగా వరద
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి విడుదల అవుతున్న వరద నీరు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నిలకడగా కొనసాగుతోంది. టీబీ డ్యాం నుంచి విడుదలైన వరద అదే స్థాయిలో ఆనకట్టపై ప్రవహిస్తోంది. బుధవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 32,483 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆనకట్టపై 37,482 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఈఈ రామయ్య తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకీ చేరుతోందని ఆయన పేర్కొన్నారు.

ఆర్డీఎస్ ఆయకట్టుకు 565 క్యూసెక్కులు విడుదల
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 565 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు వరద నీటిని పొలాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సుంకేసులకు కొనసాగుతున్న వరద
రాజోళి : సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం ఎగువ నుంచి సుంకేసులకు 26 వేలు ఇన్‌ఫ్లో రాగా, 22,500 ఔట్ ఫ్లో కొనసాగింది. ఈ నీటి విడుదలకు అధికారులు 5 గేట్లను తెరచి నీటిని శ్రీశైలంకు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles