చెంచుల హక్కులను కాపాడుకోవాలి

Thu,August 22, 2019 12:34 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా : మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న చెంచుల హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెంచుల పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాంకిషన్ అన్నారు. బుధవారం స్థానిక టీఎన్‌జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చెంచుల జీవన విధానం ఇప్పటికీ మార్పు రావడం లేదని, వారికి ప్రభుత్వ పథకాలను నేరుగా అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం దేశంలో ఏ జాతికి లేనంత రిజర్వేషన్ చెంచులకు మాత్రమే ఉందని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి అభివృద్ధికి పాటుపడటం లేదని పేర్కొన్నారు. వారి హక్కులను కాపాడుకోవడానికి కనీస వసతి, వ్యవసాయానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లలో చెంచులకు ప్రత్యేక కోటా కేటాయించి ప్రతి చెంచు పెంటలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించాలని పేర్కొన్నారు.

వారు సాగు చేస్తున్న పోరు భూములను గుర్తించి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. చెంచులు అడవులలో ఉండకుండా జనావాసాలకు రావాలంటే వారి అభివృద్ధికి మార్గాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని పేర్కొన్నారు. చెంచు సలహాదారుల కమిటీ సభ్యులు బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను ఇవ్వాలని ఆనాడే రాజ్యాంగంలో పొందుపర్చారని పేర్కొన్నారు. దేశంలో ఏ కులానికి లేనంత ప్రత్యేక నిధులను చెంచులకు కేటాయించాలని, అమలుకు నోచుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెంచుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు పెంటయ్య, కార్యవర్గ సభ్యులు ఖాదరయ్య, ఆంజనేయులు, నర్సిములు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles