జలపుష్ప విలాసం

Wed,August 21, 2019 12:50 AM

-చెరువుల్లో వేసేందుకు కోటీ 26 లక్షల చేప పిల్లలు సిద్ధం
-ఈ నెల 22నుంచి విడుదల ప్రారంభం
-రిజర్వాయర్లు నిండటంతో ముమ్మరం
-గతేడాది కోటీ 28లక్షలు పంపిణీ
-160 చెరువులు,7 రిజర్వాయర్లలో విడుదల
జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం మత్స్య విప్లవం నెలకొల్పడంతో రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. మూడేండ్లుగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో మత్స్యకారులు లాభాలబాట పట్టారు. జిల్లాలోని రిజర్వాయర్లు నిండుతుంటంతో మత్సశాఖ అధికారులు చేప పిల్లల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న నుంచి జిల్లాలోని అన్ని చెరువుల్లో కోటీ 26 లక్షల చేప పిల్లలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం గతేడాది జిల్లాలో కోటి 28 లక్షల చేప విత్తనాలను జలశయాల్లో విడుదల చేయడంతో ఈ చేపలు పెరిగి పెద్దవై దాదాపు 10 కోట్ల సంపదను సృష్టించాయి. దీంతో మత్సకారులకు ఉపాధి లభించి వలసలు వెళ్లకుండా కృల వృత్తిని కొనసాగిస్తున్నారు.

మత్స్యకార వృత్తికి ప్రభుత్వం జీవం పోసింది. సరైన సౌకర్యాలు లేక చెరువుల్లో నీళ్లు లేక రోజు రోజుకూ కనుమరుగవుతున్న మత్స్య వృత్తికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. చేపల పెంపకానికి కావాల్సిన చెరువులను మిషన్‌ కాకతీయ ద్వారా మరమ్మతులు చేపట్టి వేసవిలో కూడా నీరు నిల్వ ఉండేలా చేశారు. అనంతరం ప్రభుత్వమే మత్స్య సంపదను సృష్టించడానికి చేప విత్తనాలను చెరువుల్లో, రిజర్వాయర్లలో విడుదల చేసింది. వీటితో పాటు మత్స్యకారులకు వేటకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం, శిక్షణల ద్వారా నైపుణ్యాభివృద్ధి కల్పించడం వలన మత్ప్యకార వృత్తి అభివృద్ధి పథంలో నడుస్తోంది. వ్యక్తిగతంగా, సభ్యుల గ్రూపులకు, సహకార సంఘాలకు, జిల్లా సంఘాలకు వివిధ రాయితీల ద్వారా పథకాన్ని అమలు పరుస్తుండటంతో అనుకున్న ఫలితాలను సాధించగలుగుతున్నారు. ఈ అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది కూడా జలశయాల్లో చేప విత్తనాలు విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లను చేపడుతున్నారు.

ఈ ఏడాది కోటీ 26 లక్షల చేపలు విడుదల
జిల్లాలోని అన్ని జలాశయాల్లో ఈ ఏడాది కూడా ప్రభుత్వమే చేప విత్తనాలను విడుదల చేయనుంది. 80 ఎంఎం నుంచి 100 ఎంఎం సైజుల గల 54 లక్షల పెద్ద చేపలను 7 రిజర్వాయర్లలో విడుదల చేయనున్నారు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం సైజుల గల 72 లక్షలు చిన్న చేపలను చెరువులు, కుంటల్లో విడుదల చేయనున్నారు. మొత్తం ఈ ఏడాది కోటి 26 లక్షల చేప విత్తనాలను జలశయాల్లో విడుదల చేసేందుకు జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. కొర్రమీను, బంగారుతీగ, బొచ్చె, రౌట, వాలుగ రకాల చేపలను చెరువులు, కుంటల్లో విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అన్ని జలాశయాల్లో నీరు నిండుకున్న వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిచనున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈ నెల చివరి వారంలో చేప విత్తనాల విడుదలను ప్రారంభించే అవకాశం ఉంది.

22న చేపల విడుదలకు ఏర్పాట్లు
ఈ నెల 22 నుంచి అన్ని జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు మత్స శాఖ అధికారులు అన్ని చేపట్టారు. మొదటి రోజు జమ్మిచేడు దగ్గరి జములమ్మ రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేయనున్నారు. జిల్లాలోని జెడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలను ముఖ్య అతిథులగా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రతి ఏడాది అనవాయితీగా వస్తున్న ప్రకారమే ఈసారి కూడా మొదటగా జములమ్మ రిజర్వాయర్లోనే చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టనున్నారు. జిల్లాలోని మత్సకారులందరికీ సకల సదుపాయాలను అందించడంతో రోజురోజుకూ చేపల వేటను చేపట్టే మత్స్యకారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

గతేడాది కోటి 28 లక్షల చేప విత్తనాలు విడుదల
చేపల ఉత్పత్తిని పెంచడం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు మంచి ఫలితాలు అందిస్తున్నాయి. జిల్లాలో 38 సొసైటీలలో 3,500 మంది మత్సకారులు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. వీరందరి కోసం ప్రభుత్వం గతేడాది కృష్ణానదిలో, 34 డిపార్ట్‌మెంటల్‌ ట్యాంక్‌ల్లో, 7 రిజర్వాయర్లల్లో, 150 గ్రామ పంచాయతీ ట్యాంక్‌లలో కోటి 28 లక్షల చేప విత్తనాలను అధికారులు వదిలారు. అన్ని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వీటి ద్వారా దాదాపు 1500 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. చేప విత్తనాలు వదిలిన అన్ని జలాశయాల్లో దాదాపు చేపలన్నీ ఒకటి నుంచి రెండు కిలోల బరువు వరకు పెరిగాయి. హోల్‌ సేల్‌గా ఒక కిలో చేపలు రూ.60 పలకడంతో దాదాపుగా రూ.10 కోట్ల వరకు మత్స్యకారులు ఆదాయాన్ని గడించారు. ఈ ఏడాది కోటీ 26 లక్షల చేప పిల్లలను 35 డిపార్ట్‌మెంటల్‌ చెరువుల్లో, 125 గ్రామ పంచాయితీ చెరువుల్లో, 7 రిజర్వాయర్లలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

22న చేప పిల్లల విడుదల
ఈ ఏడాది చేప విత్తనాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేపట్టాము. గతేడాది జలాశయాల్లో విడుదల చేసిన చేప విత్తనాలు మత్సకారులకు మంచి లాభాలను అందించాయి. ఈ నెల 22 నుంచి అన్ని జలాశయాల్లో కోటీ 26 లక్షల చేప విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందుకు కావాల్పిన చేప విత్తనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలోని 160 జలాశయాల్లో 7 రిజర్వాయర్లలో చేప విత్తనాలను విడుదల చేయనున్నాం. జములమ్మ రిజర్వాయర్‌లో చేప విత్తనాలను మొదటగా విడుదల చేయనున్నాం. చేపల వృత్తిని కొనసాగించేందకు ప్రభుత్వం మత్స్యకారులకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తుంది. సబ్సిడీ ద్వారా కావాల్సిన పనిముట్లను కూడా అందజేస్తున్నాం.
- టీ రూపేందర్‌ సింగ్‌, మత్స్యశాఖజిల్లా అధికారి

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles