సాగుకు సై

Wed,August 21, 2019 12:48 AM

-కృష్ణమ్మ రాకతో సంబురం
-అన్ని జలాశయాలు కళకళ
-అన్నదాతల ముఖాల్లో ఆనందం
మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాలు పెద్దగా కురువపోయినా.. అన్నదాతను కృష్ణమ్మ ఆదుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదికి భారీగా వరద వచ్చింది. గత 10 రోజులుగా జిల్లాలో కృష్ణా నదిపై ఆధారపడిన అన్ని ప్రాజెక్టులను, రిజర్వాయర్లను నింపుతూ వస్తున్నారు. జూరాల నుంచి కల్వకుర్తి వరకు అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదులకు వచ్చిన భారీ వరదలతో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులపై ఆధారపడిన అన్నదాతలు సంతోషంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈహించిన దానికంటే ఎక్కువగా నదులు పొంగి పొర్లడంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, ఆర్డీఎస్‌, తుమ్మిళ్ల పరిధిలోని రైతాంగం సాగు సంబరంగా ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో లోటు వర్షపాతం నమోదైనా.. వరద జలాలు అన్నదాతను ఆదుకున్నా యి. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 రోజు లు ఆలస్యంగానే జూరాలకు వరద వచ్చినా... ప్రాజెక్టుల కడుపు నిండేలా ఇన్‌ఫ్లో ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిండుగా రిజర్వాయర్లు...
ఉమ్మడి జిల్లాలో గ్రావిటీపై ఆధారపడి సాగునీటిని అందించే ఏకైక ప్రాజెక్టు జూరాల. జూరాల కుడి కాలువ పరిధిలో 37,700 ఎకరాలు, ఎడమ కాలువ పరిధిలో 64,500 ఎకరాల ఆయకట్టు ఉంది. జూరాల పరిధిలో మొత్తం 1,02,200 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మంగళవారం జూరాల కుడి కాలువకు 718, ఎడమ కాలువకు 1190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రామన్‌పాడుకు నీటిని అదనంగా అందించే సమాంతర కాలువకు 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల కుడి కాలువ పరిధిలో గద్వాల మండలం జమ్మిచేడు వద్ద ఉన్న జమ్ములమ్మ రిజర్వాయర్‌, ఎడమ కాలువ పరిధిలోని రామన్‌పాడు రిజర్వాయర్‌, వీపనగండ్ల మండలంలో ఉన్న గోపల్‌ దిన్నె రిజర్వాయర్‌ పూర్తి నీటి నిల్వతో కళకళలాడుతున్నాయి.

నెట్టెంపాడు కళకళ..
నెట్టెంపాడు కింద గద్వాల, అలంపూరు నియోజకవర్గాల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ర్యాలంపాడు రిజర్వాయర్‌- 4.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.8టీఎంసీల సామర్థ్యంతో ఉంది. ఇక గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం 1 టీఎంసీ కాగా.. ప్రస్తుతం 0.7 టీఎంసీల స్థాయిలో ఉంచారు. నెట్టెంపాడుకు మంగళవారం 2250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్‌ నుంచి 100కు పైగా గొలుసుకట్టు చెరువులకు నిరంతరాయంగా నీటిని విడుదల చేస్తున్నారు. రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

భీమా ప్రాజెక్టు పరిధిలోనూ..
భీమా-1 లిఫ్టుకు ముమ్మరంగా ఎత్తిపోతల కొనసాగుతున్నది. భీమా-1వ లిఫ్టుకు మంగళవారం నాడు 1300 క్యూసెక్కులను తరలిస్తున్నారు. దీని పరిధిలో 1.11 లక్షల ఆయకట్టుకు ప్రస్తుతం నీటిని అందిస్తున్నారు. భూత్పూర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 1.36 టీఎంసీలు, సంగంబండ రిజర్వాయర్‌ 3.317 టీఎంసీలు కాగా, ప్రస్తుతం రెండు రిజర్వాయర్లను సైతం వరద జలాలతో నింపుతున్నారు. భీమా-2 ఎత్తిపోతలకు 1500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సంగంబండ రిజర్వాయర్‌ 1.543, భూత్పూర్‌ రిజర్వాయర్‌ 0.885 టీఎంసీల సామర్థ్యానికి చేరుకున్నాయి. వాటి పరిధిలోని కాలువలకు నీటి విడుదల నిరంతరాయంగా కొనసాగుతున్నది. భీమా-2 పరిధిలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 62167 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.

ఆర్డీఎస్‌, తుమ్మిళ్ల ఆయకట్టుకు..
ఎప్పుడూ సాగునీటిని అందించడంలో విఫలమయ్యే ఆర్డీఎస్‌ పరిధిలో ఈసారి మాత్రం పుష్కలంగా నీటి విడుదల ప్రారంభమైంది. ఆర్డీఎస్‌ హెడ్‌ వర్క్స్‌ వద్ద తగినంత నీటి లభ్యత ఉండటంతో కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు సుంకేసుల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1.22 టీఎంసీలు కాగా... ప్రస్తుతం పూర్తిగా నిండి కళకళలాడుతున్నది. దీంతో బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా ఉన్న తుమ్మిళ్ల నుంచి (ఆయకట్టు 55500ఎకరాలు) నీటి పంపింగ్‌ చేస్తూ ఆర్డీఎస్‌ ప్రధాన కాలువకు నీటిని వదులుతున్నారు. ఇన్నాళ్లు ప్రశ్నార్థకంగా ఉన్న 87448 ఎకరాల ఆర్డీఎస్‌ ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతున్నది. దీని పరిధిలో పత్తి, మిరపతో పాటు వరి నాట్లు సాగుతున్నాయి.

కోయిల్‌సాగర్‌కు కొనసాగుతున్న పంపింగ్‌
జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్‌సాగర్‌కు నీటి ఎత్తిపోతల కొనసాగుతున్నది. 2.276 టీఎంసీలు సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం తీలేరు నుంచి పంపింగ్‌ సాగుతున్నది. మొత్తం 32 అడుగుల నీటి మట్టంకు గాను ప్రస్తుతం 17.5 అడుగులకు చేరుకుంది. నీటి విడుదల త్వరలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తాగునీటి పథకాలకు నీటి విడుదల మాత్రం కొనసాగుతున్నది. 52 వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

ఎంజీకేఎల్‌ఐ ద్వారా 4 లక్షల ఎకరాలకు..
ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌పై ఆధారపడిన ఏకైక ప్రాజెక్టు ఎంజీకేఎల్‌ఐ. ఈ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని తరలించారు. ప్రస్తుతం గుడిపల్లి గట్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల సాగుతున్నది. వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి, గణపురం బ్రాంచ్‌ కెనాళ్లకు సైతం నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.60 అడుగులకు చేరుకుంది. ఎంజీకేఎల్‌ఐకు నీటి కొరత లేదు. ప్రస్తుతం 2400 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు.

పొలాల బాట పట్టిన అన్నదాతలు..
ప్రాజెక్టులలోకి వస్తున్న నీటిని చూసి రైతులు సంబరపడుతున్నారు. ఎప్పుడెప్పుడు కృష్ణాజలాలు వస్తాయా... అని ఆశగా ఎదురుచూసిన రైతులు అన్ని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడంతో పొలాల బాట పట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్నదాతలు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న అన్నదాతలు ప్రస్తుతం పొలాల వద్ద వ్యవసాయం పనుల్లో నిమగ్నమయ్యారు.

ఎంజీకేఎల్‌ఐ నీటితో రెండు పంటలు..
నాకు బుద్ధారం గండి చెక్‌ డ్యాం వద్ద మూడు ఎకరాల తరి పొలం ఉంది. నీళ్లు లేక సాగు చేయక పొలం బీడు ఉండేది. తెలంగాణ సర్కార్‌ వచ్చాక మూడు సంవత్సరాల నుంచి ఎంజీకేఎల్‌ఐ నీటితో చెక్‌ డ్యాం నిండి అలుగు పారుతుంది. డ్యాం వద్ద మోటరు బిగించి పొలంలో వరి పంట సాగు చేసుకుంటున్నాను. ఆలస్యంగా తూకం పోసుకొని ఉంచాను. ఎంజీకేఎల్‌ఐ నీళ్లతో రెండు పంటలు పండిస్తున్నాము. మంత్రి నిరంజన్‌రెడ్డి కష్ట పడి నీళ్లు తెచ్చి ఇక్కడి రైతులను ఆదుకున్నాడు. ఆయనకు రుణపడి ఉంటాం.
- కృష్ణయ్యగౌడ్‌, రైతు, బుద్ధారం, గోపాల్‌పేట మండలం

ఏటి నీళ్లు రాకుంటే కష్టముండే..
వర్షాలు పడనిదానికి ఏటి నీళ్లు రాకుంటే చాన కష్టముండే. నాకు బుద్ధారం గండి డ్యాం వద్ద అర ఎకరా పొలం ఉంది. డ్యాంకు నీళ్లు రావడం చానా సంతోషంగా ఉంది. ఏటా ఏటి నీళ్లతోనే రెండు కార్లు వరి పంట పండించుకుంటున్నాను. కేసీఆర్‌ సర్కారు వచ్చినాకే ఏటా నీళ్లు చూస్తున్నాం. పుష్కలంగా పంటలు పం డించుకొని ఆనందంగా ఉన్నాం. సాయం చేసి న సర్కారును మరిచిపోము. గతంలో ఏ సర్కారు రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. ఎంజీ కేఎల్‌ఐ నీళ్లు వస్తే చేపలు కూడా పుష్కలంగా దొరుకుతాయి.
- శేఖర్‌గౌడ్‌, బుద్దారం, రైతు, గోపాల్‌పేట మండలం

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles