జూరాలలో జనజాతర

Mon,August 19, 2019 01:04 AM

-ఉమ్మడి జిల్లావాసులను అలరిస్తున్న పర్యాటక ప్రాజెక్ట్
-ఈ ఏడాది అత్యధిక సందర్శకుల సందర్శన
-మూడు రోజుల వరుస సెలవుల్లో 5 లక్షలకు పైగా సందర్శన
-బక్రీద్ మరుసటి రోజూ పెద్దసంఖ్యలో పర్యాటకులు
-పర్యాటకుల ప్రశంసలు పొందిన పోలీసు యంత్రాంగం
-కట్టుదిట్టమైన ఆంక్షలతో సందర్శకులకు సెక్యూరిటీ
ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: ఉమ్మడి జిల్లాలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా జూరాల ప్రాజక్ట్ భాసిల్లుతోంది. పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రియదర్శిని జూరాల ప్రాజక్ట్ మారింది. వరదలు వచ్చే సమయంలో ప్రాజెక్టుకు పర్యాటకుల శోభ అధిక సంఖ్యలో సంతరించుకుంటుంది. ఎగువ నుంచి వరద నీరు మరింత ఉధృతంగా వస్తే ప్రాజక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే సందర్భాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది సందర్శకులు వస్తుంటారు. ప్రాజెక్టులో నీరు ఉన్నా లేకున్నా నిత్యం సందర్శకుల తాకిడి ఉండే పర్యాటక కేంద్రం జూరాల ప్రాజెక్టు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి కూడా ఇక్కడికి సందర్శకులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. స్నేహితులు, కుటుంబాలు, విద్యార్థులు, యువత, వివిధ ఉద్యోగ రంగాలు, పాఠశాలలు ఇలా చాలామంది ఏడాది పొడవునా రిజర్వాయర్ పర్యటనకు వస్తారు. దేశంలో అత్యద్భుతమైన ప్రాజెక్టుగా చెప్పుకునే జూరాల ప్రాజెక్టు వద్ద లభించే చేపల కోసం కూడా ఇక్కడికి సందర్శకులు నిత్యం వస్తుంటారు. ఏడాది పొడవునా ఇక్కడ లభించే చేపలకు పెద్ద మార్కెట్ కూడా ఏర్పడింది.

పెద్ద సంఖ్యలో పర్యాటకులు
ఏడాది పొడవునా జలకళను సంతరించుకునే జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి వచ్చే వరదలప్పుడు నిండుకుండను తలపిస్తుంది. ఆ సమయంలో గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదిలిన సందర్భంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. సాధారణ రోజుల్లోనే సందర్శకులను అలరించే జూరాల ప్రాజెక్టు, గేట్లను ఎత్తిన వేళ ప్రాజక్ట్ సందర్శన అత్యద్భుతమైన అనుభూతిని కల్పిస్తుంది. గేట్ల వచ్చే కృష్ణాజలాలు.. పాల నురుగులు పొంగుతూ ఉగ్రరూపం ప్రదర్శించే కృష్ణవేణి.. ఎంతటి భయానకానైనా ఇట్టే పారద్రోలే చల్లని నీటి తుంపరలు.. పొగమంచును తలపించే నీటి బిందువుల ఆహ్లాదాన్ని తిలకిస్తే తప్ప వర్ణించజాలనిది. ఇంతటి అత్యద్భుతమైన అనుభూతిని తనివితీరా తిలికించాలన్న తపనతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాజక్ట్‌ను సందర్శిస్తారు.

పదేండ్లల్లో చూడని వరద
గడచిన పదేండ్ల కాలంలో ఎన్నడూ చూడని విధం గా వరదనీరు రావడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున పర్యాటకులు జూరాల ప్రాజెక్టును సందర్శించారు. ఎగువ నుంచి వస్తున్న వరదనీరు ఎక్కువ రోజుల పాటు నిలకడగా కొనసాగడమే దీనికి కారణం. ఈసారి హఠాత్తుగా వచ్చిన వరదనీటితో జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూలై 29 రాత్రి నుంచి ప్రాజెక్ట్‌కు వరదనీరు రావడం ప్రారంభం కాగా 30న ప్రాజెక్ట్‌కు అనుసంధానమైన అన్ని ఎత్తిపోతల పథకాలకు నీటిని ఎత్తిపోశారు. కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు నీరు విడుదల చేసి ఇతర జలాశయాలకు నీటిని తరలించారు. నిలకడగా వస్తుందనుకున్న ఎగువ వరద ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి లక్షల క్యూసెక్కులు పెరగడంతో ఆగస్టు 2 రాత్రి నుంచి గేట్లను ఎత్తడం ప్రారంభించారు. పదేళ్ల కాలం నుంచి ఎన్నడూ రాని విధంగా వరదనీరు ఉధృతంగా రావడంతో స్వల్పస్థాయి నుంచి భారీస్థాయి వరకు గేట్లను ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10, 20 స్థాయిల నుంచి ఏకంగా 65 గేట్లు ఎత్తి దాదాపు 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతమంతా కృష్ణమ్మ పరవళ్లతో తొనికిసలాడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనే కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్ట్ జూరాలకు సందర్శకుల తాకిడిని తీసుకొచ్చింది.

సెలవు రోజుల్లో ఆహ్లాదం
వరుస సెలవు దినాలు పర్యాటకులకు తనివితీరని ఆహ్లాదాన్ని తీసుకొచ్చింది. 2న గేట్లు ఎత్తడంతో ప్రారంభమైన సందర్శకుల తాకిడి 3, 4 శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో సందర్శకులు ప్రాజెక్టును వీక్షించారు. తర్వాత రోజుల్లో 40, 50, 60కి పైగా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో 10, 11, 12, 13 తేదీల్లో పెద్దఎత్తున పర్యాటకులు ప్రాజెక్ట్‌ను సందర్శించారు. వరుస సెలవుల్లో నిత్యం లక్షకు మించి సందర్శకులు ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. రోజూ దాదాపు 50, 60 వేల వాహనాలు పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిచాయి. రెండో శనివారం, ఆదివారం, బక్రీద్ పర్వదినాల్లో మూడురోజుల్లో 5 లక్షల మంది సందర్శకులు ప్రాజెక్ట్‌ను సందర్శించినట్లు అధికార వర్గాలు అంచనా వేశారు. బక్రీద్ మరుసటి రోజైన మంగళవారం సైతం పెద్ద సంఖ్యలో ముస్లిం కుటుంబాలు ప్రాజెక్ట్‌ను సందర్శించాయి. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు కుల, మత, బీద, ధన తేడాలు లేకుండా అన్నివర్గాల ప్రజలను అలరిస్తుంది జూరాల ప్రాజెక్ట్.

పకడ్బందీగా పోలీసుల చర్యలు
లక్షల సంఖ్యలో సందర్శకులు ఒక్కసారిగా ప్రాజెక్టుకు వస్తుండగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. ప్రాజెక్ట్‌కు కిలోమీటర్ల పొడవునా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్‌లో కూరుకపోయి పర్యాటకులకు ప్రత్యక్ష నరకం చూపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రాజెక్ట్ వద్ద ప్రత్యేక ఆంక్షలు విధించారు, ఆత్మకూరు సర్కిల్ పరిధిలో వందల మంది పోలీసులు ప్రాజెక్ట్ వద్ద విధులు నిర్వర్తించి నిత్యం ట్రాఫిక్‌ను నియంత్రించారు. అదేవిధంగా ప్రమాదకర స్థలాలకు సందర్శకులను అనుమతించకుండా ప్రాజెక్ట్ పొడవునా గట్టి బందోబస్తు చేపట్టారు. లక్షల క్యూసెక్కుల నీరు ప్రమాదకర స్థాయిలో దిగువకు పోతున్న క్రమంలో ఒక్కరిని కూడా జలాల వద్దకు అనుమతించకుండా భద్రతను పాటించారు. ప్రతిసారి చిన్న చిన్న పొరపాట్లతో ప్రాజెక్ట్ పరిసరాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటన కోకొళ్లలు. ఈ ఏడాది జిల్లా ఉన్నతాధికారుల సూచనలు, ఆదేశాలతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పతిష్ట చర్యలు తీసుకోవడతో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా పోయింది.

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
ఉమ్మడి జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ జూరాల ప్రాజక్ట్‌ది ప్రత్యేకమైన స్థానం. ఏడాది పొడవునా ఇక్కడ సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. నిత్యం వేల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రాజెక్ట్ ఎడమ విభాగంలో పెద్ద పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నా ఇంతవరకు సాధ్యపడలేదు. గత పాలకులు ఎన్నో ప్రగల్భాలు పలికి ప్రాజెక్టు పర్యాటక కేంద్రం అభివృద్ధిని తుంగలో తొక్కారు. స్వరాష్ట్రంలో వచ్చిన అవకాశంతోనైనా ఉమ్మడి జిల్లాకే తలమానికంలా నిలిచే జూరాల ప్రాజెక్టుకు ప్రధాన పర్యాటక శోభ సంతరించుకుంటుందని జిల్లావాసులు, సందర్శకులు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఎన్నికైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పర్యాటక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం జిల్లావాసులకు మరింత విశ్వాసం, బలాన్ని చేకూరుస్తుంది.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles