సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద

Tue,August 13, 2019 12:55 AM

రాజోళి : రాజోళి వద్దనున్న సుంకేసుల జలాశయానికి పది నెలల తర్వాత భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయానికి కొత్త కళ సంతరించుకుంది. కర్ణాటలో కురుస్తున్న భారీ వర్షాలు, అక్కడి ప్రాజెక్టులు నిండిన అనంతరం నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో బ్యారేజీకి కొత్త్త నీరు వచ్చి చేరుతోంది. ఎడారిలా మారిన తుంగ భద్రకు సోమవారం వచ్చిన నీటితో కొత్త ఊపిరినిచ్చింది. మండలంలోని నదీ పరివాహక గ్రామాల్లో కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శని ఆదివారాల్లోనే కర్ణాటకలోని టీబీ డ్యాం నుండి నీటిని దిగువకు విడుదల చేయగా.. సోమవారం సుంకేసులకు వరద నీరు వచ్చి చేరింది. ముందుగా మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామంలోకి వరద నీరు చేరి అక్కడి నుంచి చిన్న ధన్వాడ, తుమ్మిళ్ల గ్రామాలను దాటుకొని 11 గంటల సమయంలో సుంకేసుల బ్యారేజీకి చేరుకుంది.

ఎగువ నుంచి మధ్యాహ్నం సమయానికి 1లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా.. 25 గేట్లను తెరచి, 1 లక్షా 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువలకు విడుదల చేశారు. సాయంత్రం సమయానికి ఈ ఇన్‌ఫ్లో 2 లక్షల 15 వేలకు చేరగా, 26 గేట్ల ద్వారా 2లక్షల 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వచ్చిన క్రమంలో ఆర్డీవో రాములు పరిస్థితిని సమీక్షించారు. నది పరివాహక గ్రామాల్లో అధికారులను అప్రమత్తం చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు గమనిస్తూ, తమకు సమాచారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచామని, పోలీసులతో చర్చించి రక్షణ చర్యలకు ముందుగానే ఏర్పాట్లు చేశామన్నారు. పరిస్థితి చేయిదాటలేదని, ప్రజలు భయబ్రాంతులకు గురి కావద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ సీఐ రాజు, తాసిల్దార్ పాండు నాయక్, వడ్డేపల్లి తాసిల్దార్ వెంకటరమణ, డిప్యూటీ తాసిల్దార్ రమణ, వడ్డేపల్లి ఎస్‌ఐ మహేందర్ పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles