టీబీ డ్యాంకు పోటెత్తిన వరద

Tue,August 13, 2019 12:54 AM

అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద భారీగానే చేరుతోంది. కర్ణాటకలోని ఎగువన కురు స్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం రాత్రి టీబీ డ్యాంకు లక్ష క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, 33 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా లక్షా 15 వేల 133 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 1633.00 పూర్తి స్థాయి అడుగుల నీటి సామర్థ్యం కలిగిన టీబీలో ప్రస్తుతం 1629.92 అడుగుల నీటి మట్టం ఉంది. 100.86 టీఎంసీల నీటి నిల్వ కలిగిన టీబీలో ప్రస్తుతం 90 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తుంగభద్ర బోర్డు సెక్షన్ అధికారి విశ్వనాథ వెల్లడించారు. ఎగువన వానలు కురుస్తుండటంతో డ్యాంకు వరద భారీగా కొనసాగుతుండటంతో 33 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

తెలంగాణ నేలను ముద్దాడిన తుంగభద్రమ్మ
కర్ణాటకలోని టీబీ డ్యామ్ నుంచి గేట్లు తీసుకుని బయటకు వచ్చిన తుంగభద్రమ్మ తెలంగాణ నేలను ముద్దాడింది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలకు టీబీ డ్యాంకు వరద పోటు పెరగడంతో శనివారం సాయంత్రం టీబీ బోర్డు అధికారులు వరద నీటిని స్పిల్ వే గేట్ల ద్వారా తుంగభద్ర నదికి విడుదల చేశారు. ఆర్డీఎస్ ఆనకట్టపై ఎనిమిది అడుగుల మేర ప్రవహిస్తున్నట్లు ఆర్డీఎస్ ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్ తెలిపారు.

జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, పులికల్ గ్రామ సమీపంలో నాగల్‌దిన్నె వంతెన దగ్గర తుంగభద్ర నదికి జలకళ సంతరించుకున్నది. గత రెండు రోజులుగా తుంగభద్ర జలాశయం నుంచి వరద నీరు ఆర్డీఎస్ ఆనకట్టకు నీరు చేరుకుని ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న తుంగభద్ర నదిలోకి చేరుతోంది. మంత్రాలయం మీదుగా అయిజ మండలం, పులికల్ సమీపంలో ఉన్న నాగల్‌దిన్నెకు వరద ప్రవాహం చేరుకుంటున్నది. తుంగభద్ర నదికి వరద నీటి రాకతో పరివాహక ప్రాంత వాసు లతోపాటు మూడు రాష్ర్టాల ప్రయాణికులకు పుట్టి ప్రయాణం తప్పడంలేదు. తుంగభద్ర నది వరద వచ్చిందని ఒక వైపు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరొకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles