సంగమం.. మరింత ఉధృతం

Tue,August 13, 2019 12:54 AM

మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కృష్ణా, తుంగభద్రలు సంగమమయ్యాయి. సుంకేసుల నుంచి మధ్యాహ్నం విడుదల చేసిన 2.08 లక్షల క్యూసెక్కుల వరద అలంపూర్ సమీపంలో కృష్ణానది బ్యాక్ వాటర్‌లో సంగమమైంది. ఏటా తుంగభద్ర నది నీటిపై భారీగా ఆధారపడే శ్రీశైలం ప్రాజెక్టు ఈసారి కేవలం కృష్ణానది వరదతోనే నిండింది. అయితే సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో సుంకేసుల బ్యారేజ్ నుంచి వదిలిన సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద అలంపూర్ సమీపంలోని శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో చేరడంతో రెండు నదుల సంగమమైంది. కృష్ణా, తుంగభద్రల సంగమం తర్వాత ఆ ప్రాంతంలో మహా సముద్రాన్ని తలపిస్తోంది. క్రమంగా ఈ సంగమం ప్రభావం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతున్నది. సోమవారం సాయంత్రం నాటికి కృష్ణమ్మ స్థిరంగా ప్రవహిస్తోంది. కృష్ణానది వరద ప్రభావంతో గత 13 రోజుల క్రితం ఎక్కడో పాతాళంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండగా మారింది.

ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీటిని సాగర్ దిశగా విడుదల చేస్తున్నారు. మరోవైపు గంటగంటకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్లను 42 అడుగుల మేర ఎత్తడంతో పాటు కరెంటు ఉత్పత్తి కలిపి మొత్తం 8.20 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద సోమవారం రాత్రి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది. ఒక వైపు జూరాల నుంచి కృష్ణమ్మ స్థిరంగా భారీ ప్రవాహంతో వస్తోంటే.. మరోవైపు తుంగభద్ర బిరబిరా పరుగులు పెడుతూ శ్రీశైలం వచ్చింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 10 గేట్లను ఎత్తి వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కృష్ణ, ఇటు తుంగభద్ర ద్వారా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో రెండు నదుల పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల అధికార యంత్రాంగం వరద పరిస్థితిపై 24 గంటలపాటు అప్రమత్తంగా పనిచేస్తోంది.

దశాబ్దం కిందటి పరిస్థితులు వచ్చినా..
కృష్ణా, తుంగభద్ర నదులకు వస్తున్న వరద 2009 అక్టోబర్‌లో వచ్చిన వరదను గుర్తుకు తెస్తున్నది. అప్పట్లో తుంగభద్రలో సుమారు 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగింది. దాని ప్రభావం వల్ల ఏపీలోని మంత్రాలయం, కర్నూలు పట్టణాలు సహా గద్వాల డివిజన్ పరిధిలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాయచూరు నుంచి మంత్రాయలం వెళ్లే మాధవరం బ్రిడ్జి, తెలంగాణ ఏపీని కలిపే అయిజ మండలం పులికల్ బ్రిడ్జి నదిలో కొట్టుకుపోయాయి. 3 రాష్ర్టాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఇక కృష్ణానదికి వచ్చిన సుమారు 12 లక్షల వరద వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక గ్రామాలు తల్లడిల్లాయి.

ఈ నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదులు భీకరంగా ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమ త్తమైంది. అయితే తుంగభద్రకు సుమారు 2 లక్షలు, కృష్ణానదికి నిలకడగా 8 లక్షల వరద వస్తున్నది. రెండు నదుల నుంచి వస్తున్న వరదను కలిపినా 10 లక్షల క్యూసెక్కులుగా ఉండ నుంది. అంతకు మించి వరద వచ్చినా ఇబ్బందులేమీ ఉండవని నిపుణులు అంటున్నారు. 2009లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సుమారు 26 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైందని... కాబట్టి భయపడేంత పరిస్థితి ఉండబోదంటున్నారు.

తొలగిన ఇబ్బందులు
ఆదివారం నాడు ఉగ్రరూపంతో ప్రవహించిన కృష్ణమ్మ సోమవారం నాడు కాస్త శాంతించింది. భీమా, కృష్ణా నది సంగమమైన తర్వాత నారాయణపేట జిల్లాలోని వాసు నగర్‌లో, హిందూపూర్ గ్రామాలు ఆదివారం వరద భారిన పడ్డాయి. ఇక్కడి వారిని కున్సి సమీపంలో పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వరద క్రమంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరిస్థితి అదుపులోకి వస్తున్నది.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles