ఉప్పోంగిన కృష్ణామ్మ

Mon,August 12, 2019 02:53 AM


- జూరాల న్రుంచి శ్రీశైలానికి భారీ వరద
- తుంగభద్ర నుంచి మరో రెండు లక్షలకు పైగా రానున్న వరద
- అధికారుల అప్రమత్తత

మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ /అమ్రాబాద్ రూరల్: శ్రీశైలం నిండుకుండలా ఉంది. పై నుంచి ఇంకా వరద పోటెత్తుతుంది. శుక్రవారం జలాశయం గేట్లెత్తినప్పటి నుంచి కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతుంది. శని, ఆదివారాలు మొత్తం పది గేట్లు ఎత్తడంతో కృష్ణా జలాలు పాలనురుగులు కక్కుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. నాగార్జునసాగర్‌ను నింపేందుకు శరవేగంతో సాగిపోతున్నాయి. జూరాల నుంచి ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీశైలం నుంచి పది గేట్లను 33 అడుగుల మేర ఎత్తి సుమారు ఆరు లక్షల80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడివైపున విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 29,160 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

కృష్ణానది వరదతోనే..
శ్రీశైలం జలాశయానికి జూలై 31 నుంచి కృష్ణా వరద నీరు వస్తోంది. తుంగభద్ర వరద నీటిని శనివారమే కిందికి వదులుతున్నారు. సోమవారం అర్ధరాత్రి నాటికి తుంగభద్ర ప్రవాహం శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉంది. ఒక్క కృష్ణా నీటితోనే శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. గతేడాది 583 టీఎంసీల వరద నీరు రాగా అందులో కృష్ణా నుంచి 407 టీఎంసీలు, తుంగభద్ర నుంచి 176 టీఎంసీలు ఇచ్చింది. 2005-06 నుంచి పరిశీలిస్తే రెండు నదుల నుంచి వరద నీరు వచ్చిన తర్వాతే వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2008లో 1712 టీఎంసీల వరద వచ్చినప్పటికీ అప్పుడు కూడా తుంగభద్ర, కృష్ణానది వరద కలవడం వల్ల డ్యాం నిండింది. అయితే ఈసారి కేవలం కృష్ణానది నుంచి వచ్చిన వరదతోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండడం విశేషం.

ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతుండడంతో వరుసగా మూడోరోజు నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. శుక్రవారం 6 గేట్లు ఎత్తగా శని, ఆదివారాలు పది గేట్లకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న తరుణంలో గేట్ల నుంచి నీటిని వదిలే సామర్థ్యం పెంచారు. 10 గేట్లను 33 అడుగుల మేర ఎత్తి దిగువనకు సుమారు 7 లక్షల క్యూసెక్కులను కిందికి పంపిస్తున్నారు. ప్రవాహం భారీగా పెరగడంతో గేట్లను మరింత ఎత్తుకు లేపే అవకాశం ఉంది. అల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి శ్రీశైలానికి వరద పోటెత్తుతున్నందున సోమవారం వరకు మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం జూరాల నుంచి 8.6 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ఇదే ప్రవాహం కొనసాగితే మిగిలిన రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఆదివారం రాత్రికి శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 67 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు వదులుతున్నారు. హంద్రీనీవాకు 2363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 28వేల క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles