జూరాలకు రికార్డ్‌స్థాయిలో వరద

Mon,August 12, 2019 02:49 AM

జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జూరాల ప్రాజెక్ట్‌కు రికార్డుస్థాయిలో వరద కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 62 గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 8,52,272 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 8,69,000,అవుట్ ఫ్లో 8,57,488 క్యూసెక్కులు నమోదైంది. భారీస్థాయిలో వరద తరలివస్తుండటంతో జూరాల ప్రాజెక్ట్‌ను అధికారులు నీటినిల్వను చాలావరకు తగ్గించి వచ్చిన నీటిని వచ్చినట్లుగా గేట్ల ద్వారా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్ధాయి సామర్థ్యం 318.516మీటర్ల ఎత్తులో 9.657 టీఎంసీలుండగా ప్రస్తుతం 316.13 మీటర్ల ఎత్తులో 5.379 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేస్తున్నారు. వరద ప్రవాహాన్ని తట్టుకునేందుకు ప్రాజెక్ట్‌లో సాధ్యమైనంతగా నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. నారాయణపుర నుంచి వచ్చే కృష్ణా నీటికి భీమా నీరు తోవడవంతో ప్రాజెక్ట్‌కు ఈ స్థాయిలో వరద నీరు పోటెత్తింది.

కుడి కాల్వ ద్వారా 536 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 750 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 750క్యూసెక్కులు నీటిని అధికారులు కాల్వల్లోకి విడుదల చేస్తున్నారు. నదిలో భారీ అలలతో కూడిన వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆ ప్రవాహన్ని తట్టుకోలేక విద్యుదుత్పత్తికి నీటి విడుదలను ఆపివేసి పవర్ జనరేషన్‌ను నిలిపివేశారు. వీటితోపాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో రెండు మోటార్లను ప్రారంభించి 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1 ద్వారా 1300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 6,53,309క్యూసెక్కులు ఉండగా అదేస్ధాయిలో నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలుండగా ప్రాజెక్ట్ అధికారులు నదిలో 110.78టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా నదిలోకి విడుదల చేస్తున్నారు. నారాయణపుర ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 6,00,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 6,11,260 క్యూసెక్కులు నమోదైంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64టీఎంసీల నీటినిల్వ ఉండగా ప్రాజెక్ట్‌లో 26.14 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేసుకొని వచ్చిన నీటిని వచ్చినట్లుగా నదిలోకి విడుదల చేస్తున్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles