కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత

Sat,July 20, 2019 06:05 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పురుగులున్న కలుషితాహారం తిని సుమారు 48 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు ఇస్తున్న స్నాక్స్‌లో తెల్లటి బియ్యం పురుగులు వస్తున్నప్పటికీ విద్యార్థినులు కడుపుమంటతో అలాగే తినేశారు. తాము తింటున్న ఆహారం అన్నింటిలోనూ పురుగులు వస్తున్న విషయాన్ని వంట వారికి చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోయారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి చేరుకోవడంతో ఈ వార్త దావానంలా పాకింది. దీంతో స్పందించిన అధికారులు విద్యార్థినులకు వైద్య చికిత్స నిమిత్తం పెంట్లవెల్లి పీహెచ్‌సీ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్‌బీఎస్‌కే డాక్టర్లు వినోద్‌కుమార్, మౌనికతో పాటు వైద్య సిబ్బంది రాంమోహన్, నూర్జాహన్, సుజాతలకు అక్కడికి చేరుకొని వైద్య సేవలందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మాత్రలు, సిరప్‌లు అందించారు. ప్రస్తుతం విద్యార్థినులకు ప్రాణాపాయం ఏమీలేదని పెంట్లవెల్లి పీహెచ్‌సీ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ఇదిలా ఉండగా కేజీబీవీ ప్రత్యేక అధికారిణి కవిత శుక్రవారం ఉదయం నుంచి సెలవుపై వెళ్తూ ఇన్‌చార్జిగా జ్యోతికి బాధ్యతలను అప్పగించారని అధికారులు తెలిపారు.

కేజీబీవీని సందర్శించిన అధికారులు, నాయకులు
కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, మండల తాసిల్దార్ వీరభద్రప్ప, సింగవట్నం రెవెన్యూ దర్బార్‌లో నుంచి నేరుగా అక్కడకు చేరుకున్నారు. ఆ తరువాత డీఈవో గోవిందరాజులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్‌దాస్ వచ్చారు.

ఆర్డీవో హనుమా నాయక్ విద్యార్థినులు తీసుకున్న ఆహారం గురించి పూర్తి స్థాయిలో విద్యార్థినుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో ప్రతి వంటకంలో పురుగులు రావడం, మరుగుదొడ్లు చాలకపోవడం, విద్యార్థినులు అధికంగా ఉండటం, నీటి వినియోగం సరిగా లేకపోవడం వంటి సమస్యలున్నాయని ఆర్డీవోకు వివరించారు. ఇన్‌చార్జి ప్రత్యేకాధికారిణి జ్యోతితో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు జాబితాను తెప్పించి పరిశీలించారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడానికి కారణాలు, వారికి ఎదురవుతున్న సమస్యలు, అందుకు బాధ్యులపై చర్యలకు కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఆర్డీవో విలేకరులకు తెలిపారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల సూచనల మేరకు మండల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు అక్కడికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles