సెల్లు కబుర్లొద్దు

Thu,July 18, 2019 04:02 AM

నారాయణపేట నమస్తే తెలంగాణ ప్రతినిధి: సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు గాను ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేకించి సెల్‌ఫోన్లతో సెల్లు కబుర్లను పూర్తిగా నిషేధించి విద్యావ్యవస్థ గాడి తప్పకుండా ముందుకు సాగేలా రాష్ట్ర విద్యాశాఖ మరోమారు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు పాఠశాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యే విధంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేసేలా చర్యలు తీసుకోబోతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సత్ఫలితాలను ఇవ్వగలదన్న ఆశాభావాన్ని పలువురు విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమాలతో బడిబయట ఉన్న వారితోపాటు బడిఈడు గల పిల్లలందరినీ ఆయా పాఠశాలల్లో చేర్పించారు. ఇటీవల టీఆర్‌టీ ద్వారా నూతన ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది.

పూర్తిస్థ్థాయిలో సెల్‌ఫోన్లు నిషేధం
సెల్‌ఫోన్ల రాక సంసారాల్లో చిచ్చులు రేగడమే కాదు. రేపటి భావి భారత పౌరులైన విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తూనే మరోవైపు సెల్‌ఫోన్లలో మాట్లాడుతుండడంతో విద్యార్థులు ఏకాగ్రత దెబ్బతినడం, ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు సరిగా అర్థం చేసుకోకపోవడంతోపాటు విద్యార్థులు సైతం తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్లు తెచ్చుకొని పక్కదోవ పడుతున్నటుగా అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితుల నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తరగతి గదుల్లో సెల్‌ఫోన్లను వాడరాదని ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లలో సొల్లు కబుర్లను మానక పోవడం, విద్యార్థులు సైతం ఒకరిని చూసి మరొకరిని పాఠశాలలకు సెల్‌ఫోన్లు తీసుకొస్తుండడంతో విద్యా వ్యవస్థ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తరగతి గదుల్లోకి విద్యార్థులు, ఉపాధ్యాయులే కాదు ప్రధానోపాధ్యాయులు సైతం సెల్‌ఫోన్లను తీసుకురావొద్దని మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

వందశాతం హాజరయ్యేందుకు చర్యలు
విద్యార్థులు పాఠశాలలకు వందశాతం హాజరయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఇందుకోసం ఆగస్టు మాసాన్ని వందశాతం హాజరు మాసంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేయబోతుంది. ఇందుకోసం మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. సర్కారు బడులలో చేరిన విద్యార్థులు కుటుంబ పరిస్థితులు తదితర కారణాలతో హాజరుశాతం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా విద్యార్థులు ఆశించిన స్థాయిలో పాఠ్యాంశాలపై పట్టు సాధించలేక పోతున్నారని రాష్ట్ర విద్యాశాఖ గుర్తించింది. ఈ మేరకు బడులలో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా విద్యార్థులు హాజరు కావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. మరోవైపు విద్యాశాఖ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది సహా య సహకారాలతో ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. హాజరుశాతం పెరిగితే తప్పనిసరిగా విద్యార్థులు చదువులో రాణిస్తారన్న నమ్మకంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోబోతుంది.

ఉపాధ్యాయులకు డ్రస్ కోడ్
ఇప్పటికే విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందజేస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయులకు సైతం డ్రస్‌కోడ్‌ను అమలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. న్యాయవాదులు, వైద్యులు, పోలీసులకు ప్రత్యేక గుర్తింపు డ్రస్ కోడ్ ఉన్నట్లుగానే ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచే విధంగా డ్రస్ కోడ్‌ను అమలు చేసే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. మరోవైపు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టకుండా ఉండేందుకు ఈ డ్రస్‌కోడ్ ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తూ అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకొని అమలు చేయనున్నారు.

విద్యార్థులతో కమిటీలు
పాఠశాలల్లోని విద్యార్థులందరిని కొన్ని గ్రూపులుగా విభజించి కమిటీలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో మొక్కలు నాటి సంరక్షించేందుకు ఒక కమిటీ, పారిశుద్ధ్యం కోసం మరో కమిటీ, క్రీడలు, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన కమిటీలతోపాటు మరికొన్ని కమిటీలను ఏర్పాటు చేసే విషయంపై విద్యాశాఖ అధికారులు నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటిని అమలు చేయడం వల్ల విద్యార్థులు విద్యారంగంలో రాణించడమే కాకుండా సామాజిక దృక్ఫథాన్ని సైతం ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుందన్న నమ్మకంతో ప్రభుత్వం ఈ కమిటీలను పాఠశాలల వారీగా ఏర్పాటు చేయనుంది.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles