ప్రతిఒక్కరూ నీటిని సంరక్షించాలి గ్రామాలను సందర్శించిన ఢిల్లీ బృందం

Thu,July 18, 2019 04:01 AM

హన్వాడ: ప్రతిఒక్కరూ నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతలను నిర్మించుకుని భూగర్భజలాలను పెంపొందించాలని ఢిల్లీ బృందం పేర్కొన్నది. బుధవారం మండలంలోని కొనగట్టుపల్లి, పెద్దదర్పల్లి, పల్లెమోనికాలనీ గ్రామాల్లో కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి శ్రీనివాస్‌రావుతోపాటు వారి బృందం గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో నిర్మించుకున్న మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. నీటిని వృథా చేయకుండా ఇంకుడుగుంతలు నిర్మించుకోవడంతో గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. కొనగట్టుపల్లి సమీపంలోని ఆడవిచుట్టూ కందకాన్ని పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. వర్షపునీరు వృథాగా వెళ్లకుండా భూమిలో ఇంకేందుకు కందకాలు తీయడంతో అధికారులు అభినందించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా నల్లాతోపాటు శుద్ధజలం ఇవ్వడంతో వాటిని సందర్శించారు. మండలంలో అన్ని గ్రామాలకు నల్లాతో పాటు నీటి సరఫరా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ పథకం చాలా బాగుందన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నీటిని సంరక్షించేందుకే జలశక్తి అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఇంకుడు గుంతలు, పొలాల్లో కందకాలు తవ్వుకోవాలన్నారు. ఉన్న చెట్లను నరికి వేయడంతో వర్షాలు కురవడంలేదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. చెట్లు ఎక్కువ ఉంటేనే వర్షాలు అనుకున్న స్థాయిలో కురుస్తాయన్నారు. అందుకు ప్రతి వ్యక్తి సహకరించాలన్నారు. వీరివెంట డీఎఫ్‌ఓ గంగిరెడ్డి, జెడ్పీటీసీ విజయనిర్మల, ఎంపీడీవో నటరాజ్, మిషన్ కాకతీయ డీఈవో మనోహర్, మిషన్ భగీరథ ఈఈ వెంకటరమణ, డిప్యూటీ డీఈ దీప, సర్పంచ్‌లు వెంకటమ్మ, మానస, ఎంపీపీ బాల్‌రాజ్, ఎంపీటీసీ చెన్నయ్య, ఏవో కిరణ్‌కుమార్, మిషన్ భగీరథ ఏఈ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles