అన్ని గ్రామాల్లో కాల్‌సెంటర్ ఏర్పాటు చేస్తాం

Tue,July 16, 2019 04:55 AM

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలందించాలని మహబూబ్‌నగర్ జిల్లా స్పెషల్ కలెక్టర్ క్రాంతి సూచించారు. సోమవారం జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్పెషల్ కలెక్టర్ క్రాంతి హాజరై వివిధ శాఖాధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం మా భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఇబ్బందులు ఎదురైనా, ఎవరైనా లంచం అడిగినా బాధితులు నేరుగా కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఇందుకు అన్ని గ్రామాల్లో కాల్‌సెంటర్ నంబర్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కాల్‌సెంటర్‌కు దాదాపు 80 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. అనంతరం స్పెషల్ కలెక్టర్ క్రాంతితో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీపీ లక్ష్మీ, తాసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌రెడ్డి, వివిధశాఖల ఉద్యోగులు, సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కలసికట్టుగా ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు సేవలు అందిస్తామంటూ ప్రతిజ్ఞ చేసి ప్రమాణపత్రాలపై సంతకాలు చేశారు.
లంచం ఇవ్వొద్దు
మిడ్జిల్ : ప్రభుత్వ శాఖలో అధికారులు అవినీతికి పాల్పపడకుండా, నిజాయితీగా పని చేయాలని అడిషనల్ జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖ అధికారులు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యలకుగాను, ఏదైనా ప్రభుత్వ పథకాలకు గాను ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీనం:28542-241165 ఫొన్ చేయాలని క్రాంతి సూచించారు. అవినీతికి పాల్పపడకుండా బాధ్యతగా విధులు నిర్వహిస్తామని ప్రత్ఞిజ చేయించారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీ కాంతమ్మ, జెడ్పీటీసీ శశిరేఖ, తాసిల్దార్ రాంచంద్రయ్య, ఎంపీడీవో, సర్పంచ్ రాధికరెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు ఉన్నారు.

అవీనితీ రహిత సమాజం కోసం కృషి చేద్దాం.
అవినితీకి పాల్పడితే 08542-241165 ఫోన్ చేయండి
రాజాపూర్ : ప్రజలకు సేవలందించేందుకు ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజాప్రతి నిధులు అవినితీ రహిత సమాజం కోసం కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారిణి క్రాంతి అన్నారు. సోమవారం రాజాపూర్, బాలానగర్ మండల కేంద్రాల్లో రెవెన్యూ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో అవినీతికి పాల్పడకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తామని ప్రమాణం చేయించారు. అవినితీ రూపుమాపేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించకపోయినా, లంచం అడిగినా టోల్‌ఫ్రీనం. 08542-241165 కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు మోహన్‌నాయక్, కల్యాణి, ఎంపీపీలు సుశీల, కలమ, ఎంపీడీవో కుసుమమాధురి, తాసిల్దార్లు నర్సింగ్‌రావు, వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారులు నరేందర్, ప్రశాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు మహిపాల్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles