సర్కారు మనదే.. అభివృద్ధి మనదే

Sun,July 14, 2019 01:01 AM

వడ్డేపల్లి: మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు. మహిళలకు, రైతులకు, విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మండల కేంద్రంలోని శాంతినగర్‌లో శనివారం మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు నాయకత్వంలో భవాని ఫంక్షన్‌హాల్ నందు ఆత్మీయ ఆశీర్వాదసభ కార్యక్రమం జరిగింది. వందలాది కార్యకర్తలతో శాంతినగర్ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ కారుజోరును ఎవరూ ఆపలేరని, మరో 25 ఏళ్లు సర్కారు మనదేనన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసే ప్రజలు తమను ఎన్నికల్లో ఆశీర్వదించారని, అదే ప్రేమతో మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

వడ్డేపల్లి గడ్డ టీఆర్‌ఎస్‌కు కంచుకోట: ఎమ్మెల్యే అబ్రహం
వడ్డేపల్లి మండలం టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటని, ప్రజలకు చేరువగా ఉండే వడ్డేపల్లి శ్రీనివాసులు పాలనలో మండలం సుభిక్షంగా ఉందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. రైతులకు, ఆడబిడ్డలకు, చిన్నారులకు, యువకులకు అండగా నిలిచిన కేసీఆర్ ఋణం తీర్చుకోవాలంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

టీఆర్‌ఎస్ కుటుంబంలో చేరండి: లింగంపల్లి కిషన్‌రావు
జిల్లా సభ్యత్వాల నమోదు ఇన్‌చార్జ్ లింగంపల్లి కిషన్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో ఫించన్లు పెరిగాయని, రైతులకు సాగునీరు, పెట్టుబడికి డబ్బులు, బీమా అందజేయడం జరుగుతుందన్నారు. కేసీఆర్‌లా ఎవరూ ప్రజల కష్టాలు తీర్చలేదని, పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వాలు తీసుకొని టీఆర్‌ఎస్ కుటుంబంలో చేరాలని ఆయన నాయకులు, కార్యకర్తలను కోరారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో జరిగిన అభివృద్ధి ఇతర పార్టీల వారికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. రూ.840 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్, శాంతినగర్‌లో డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, కసూర్భా ఇంటర్ కళాశాల, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, ఇంటింటికీ తాగునీటి కుళాయిలు రైతుబంధు, బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్ కే చెందుతుందని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని శ్రీనివాస్ కోరారు. వైస్ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ఇతర పార్టీల వారు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మరాదని కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు కూడా లేవని టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రజలకు అన్ని వేళలా అండగా ఉండి ఆదుకుంటున్న వడ్డేపల్లి శ్రీనివాసులు నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు.

అనంతరం పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛందంగా నమోదు చేసుకోవడానికి మహిళలు ఉత్సాహం చూపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రాముడు, సహకార సంఘ అధ్యక్షుడు సోమన్న, సర్పంచ్ అంజి, లక్ష్మిరెడ్డి, మాజీ సర్పంచ్ నాగమ్మ, రమేష్‌చౌదరి, మధుసూధన్‌రెడ్డి, వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు: కిషన్‌రావు
అలంపూర్, నమస్తే తెలంగాణ : గ్రామ స్థాయిలో కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలుగా ఉంటూ పార్టీ బలోపేతానికి దోహదపడతారని ఆగ్రోస్ చైర్మన్, సభ్యత్వాల జిల్లా ఇన్‌చార్జి లింగంపల్లి కిషన్‌రావు అన్నారు. అలంపూరు మున్సిపాలిటీలోని ఇమాంపురంలో టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదులో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంతో కలిసి శనివారం పాల్గొన్నారు. బస్తీలో ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు అమలుచేసి, రైతాంగానికి పెద్దపీట వేశారన్నారు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు అభిమానిస్తున్నారన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులనే ప్రజలు గద్దెనెక్కిస్తూన్నారన్నారు. జిల్లాలో లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదవుతున్నాయని, అందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి రెండు లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు. అంతకు ముందు వారికి గ్రామస్తులు, పార్టీ నాయకులు శేఖర్‌రెడ్డి, సిద్ధయ్య, మాజీ సర్పంచ్ వెంకటస్వామి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు నారాయణరెడ్డి, వెంకట్రామయ్యశెట్టి, కిశోర్, మహేష్‌గౌడ్, ఫయాజ్, అల్లాబకాష్ పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles