జూరాల చూపు.. ఆల్మట్టి వైపు

Sat,July 13, 2019 04:27 AM

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ బిరబిరా ఆల్మట్టికి తరలివస్తున్నది. రోజుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం ఎప్పటికప్పుడు పెరుగుతున్నది. మొత్తం 129.72 టీఎంసీల సామర్థ్యానికిగాను, 73.78 టీఎంసీల నిల్వకు చేరింది. ఆ వెంటనే ఉన్న నారాయణపురా పూర్తి నీటినిలువ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20.3 టీఎంసీలున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు నిండిన వెంటనే జూరాల జలాశయానికి నీరు విడుదల చేసే అవకాశమున్నది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే పది రోజుల్లో జూరాలకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉన్నది. జూరాలకు నీరొస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి.

-మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ
మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పాలమూరు వాసులు ఆల్మట్టి వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో సుమారు 6 టీఎంసీలతో కళకళలాడిన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. కనీసం డ్యాం దిగువన ఉన్న ఆయకట్టుకు కూడా నీటిని అందించలేని దీన స్థితికి జూరాల ప్రాజెక్టు చేరుకున్నది. ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు ఎగువ నుంచి ఎప్పుడు వరద వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ఆధారంగా సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆశలు చిగుర్తిస్తున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టుకు మూడు రోజుల నుంచి లక్ష క్యూసెక్కుల చొప్పున నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. ఇదే వరద మరో 8 రోజుల పాటు కొనసాగితే జూరాలకు తగినంత ఇన్‌ఫ్లో వస్తుందని ఇంజినీర్లు అంచనావేస్తున్నారు.

ఆశాజనకంగా.. ఆల్మట్టి..
కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న మొదటి ప్రాజెక్టు ఆల్మట్టి నిండితే కానీ దిగువనకు నీటి విడుదలపై ఆశలుండవు.129.72 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టులో ఈ నెల 1వ తేదీ నాటికి ఉన్న నీటి సామర్థ్యం కేవలం 21.7 టీఎంసీలు మాత్రమే. అంటే సుమారు 110 టీఎంసీల నీరు వచ్చి చేరితే తప్ప ఆల్మట్టి నుంచి దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో క్రమంగా ఆల్మట్టిపై ఆశలు పెరిగాయి. ఈ నెల జులై 10 నాటికి 54.48 టీఎంసీలకు చేరుకోగా.. 11న 64.03 టీఎంసీలకు, శుక్రవారం నాటికి ఆల్మట్టి జలాశయంలో 73.78 టీఎంసీలకు చేరుకున్నది. 10 రోజుల్లో సుమారు 52 టీఎంసీల వరద వచ్చి చేరింది. జూరాల ప్రాజెక్టునకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు నిండితేనే జూరాలకు వరద నీరు వస్తుంది. గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి జూరాల నీటి మట్టం 5.7 టీఎంసీలు. కాగా ప్రస్తుత నీటి మట్టం మాత్రం కేవలం 1.92 టీఎంసీలు మాత్రమే. ఆల్మట్టికి ప్రస్తుతం వస్తున్న వరద ఇలాగే కొనసాగితే దాదాపు 8 రోజుల్లో ఆల్మట్టి ప్రాజెక్టు నిండిపోవడంతోపాటు దిగువన ఉన్న నారాయణపురా రిజర్వాయర్ సైతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. నారాయణపూర్ పూర్తి నీటినిలువ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20.3 టీఎంసీలున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు నిండిన వెంటనే నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది.

గత ఏడాది ఇదే సమయానికి జూరాలలో 5.7 టీఎంసీల సామర్థ్యం..
గత ఏడాది ఇదే సమయానికి జూరాలలో 5.7 టీఎంసీల నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతం జూరాలలో 1.92 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే గత ఏడాదితో జూరాలలో ఉన్న నీటి నిల్వతో పోలిస్తే ప్రస్తుతం 3.78 టీఎంసీల నీటి కొరత కనిపిస్తున్నది. గత ఏడాది జులై 17వ తేదీ నాటికి పైనుంచి ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో అధికారులు జూరాలలో 19 గేట్లు ఎత్తారు. మరుసటి రోజే విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని దిగువనకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 9.66 టీఎంసీలు కాగా.. డెడ్ స్టోరేజీ కెపాసిటీ 3.707 టీఎంసీలు. అయితే ప్రస్తుతం కేవలం 1.92 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండటంతో కాలువలకు నీటిని విడుదల చేసే పరిస్థితి కూడా లేదు. కేవలం మిషన్ భగీరథ పథకానికి మాత్రమే జూరాల డెడ్ స్టోరేజీ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకోగలుగుతున్నారు. మహారాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టిలోకి వరద ఇలాగే కొనసాగితే 8 రోజుల్లో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు పూర్తి నిండుతాయని జూరాల ప్రాజెక్టు ఈఈ హెచ్.టి. శ్రీధర్ నమస్తే తెలంగాణకు తెలిపారు. అక్కడి నుంచి జూరాలకు భారీగా ఇన్‌ఫ్లో వస్తుందని వివరించారు.

సీఎం కేసీఆర్ చొరవ వల్లే కనీసం తాగునీరు
ఈ ఏడాది మే నెలలో తీవ్ర తాగునీటి ఎద్దటి నెలకొని జూరాలలో నీటి నిల్వ పూర్తిగా అడుగంటింది. పరిస్థితిని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే కర్ణాటక సీఎం కుమారస్వామితో మాట్లాడారు. పాలమూరు తాగునీటి అవసరాల కోసం జూరాల ప్రాజెక్టుకు కనీసం 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. స్పందించిన కర్ణాటక సీఎం వెంటనే ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ కర్నాటకతో దౌత్యం నెరపడం వల్ల ఎగువనుంచి 2.5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేశారు. అయితే ఆల్మట్టి నుంచి నారాయణపూర్, గూగల్ బ్యారేజీలను దాటుకుని, నదీ పొడవున గోతులను నింపుకుంటూ జూరాలకు వచ్చే వరకు సుమారు 0.730 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. కానీ ఆ నీటితో వేసవిలో జూరాల, రామన్‌పాడుపై తాగునీటికి ఆధారపడిన పథకాల సమస్య తీరింది.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles