కొత్త కొత్తగా ..

Fri,July 5, 2019 03:43 AM

నారాయణపేట, నమస్తేతెలంగాణ ప్రతినిధి : కొత్త జిల్లా.. కొత్త జెడ్పీ.. నూతన ఉత్సాహం.. పార్టీ శ్రేణులు, అధికారుల సమక్షంలో నూతన జెడ్పీ పాలక మండలి శుక్రవారం కొలువుదీరనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి తదితర ప్రముఖుల సమక్షంలో జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్‌పర్సన్, జెడ్పీటీసీ సభ్యులు బాధ్యతలను స్వీకరించనున్నారు. నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లా మొదటి జెడ్పీ చైర్‌పర్సన్‌గా పీఠాన్ని అధిరోహించాలని పలువురు ఆశావాహులు ఆశించిన్న ప్పటికీ ఆ అవకాశం వనజకు దక్కింది. జిల్లాలోని మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలలో మక్తల్, క్రిష్ణ, ఊట్కూరు స్థానాలను బీసీలకు కేటాయించారు. మొదటి నుంచి ఈ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన జెడ్పీటీసీలకే జెడ్పీ చైర్మన్ పీఠం దక్కనుందని ప్రచారం కొనసాగింది. ఆ ప్రచారం మేరకు జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు పలువురు జెడ్పీటీసీలు విశ్వప్రయత్నాలు చేసిన్నప్పటికీ నారాయణపేట జిల్లాకు మొదటి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యే అవకాశం మక్తల్ జెడ్పీటీసీగా గెలుపొందిన వనజను వరించింది. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ అదిష్టాన వర్గం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, శ్రేయోభి లాషుల సమక్షంలో వనజ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈమెతో పాటు వైస్ చైర్మన్‌గా మరికల్ జెడ్పీటీసీ గౌని సురేఖా, మిగిలిన తొమ్మిది మంది జెడ్పీటీసీలు బాధ్యతలను స్వీకరించబోతున్నారు.

ఏర్పాట్లు పూర్తి
జిల్లా కేంద్రంలోని పశు సంవర్ధకశాఖ కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని తాత్కాలిక జెడ్పీ కార్యా లయంగా అధికారులు ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి అధికారులు, సిబ్బంది కార్యాలయంలో అవసరమైన వసతులు, సౌక ర్యాలను కల్పించారు. ప్రమాణస్వీకారం అనంతరం సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

జెడ్పీ సీఈవోగా కాళిందినికి పూర్తిస్థాయి బాధ్యతలు
నారాయణపేట జిల్లాగా ఏర్పాటు కావడం జెడ్పీ విభజన జరిగిన నేపథ్యంలో పాలనకు ఆటంకాలు కలుగకుండా నాగర్‌కర్నూలు జిల్లాలో రూరల్ డెవలప్ మెంట్ అసిస్టెంట్ పీడీగా బాధ్యతలను నిర్వహిస్తున్న కాళిందినిని నారాయణపేట జెడ్పీకి తాత్కాలిక సీఈవో నుంచి పూర్తిస్థాయి జెడ్పీ సీఈవోగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఏవోగా సిద్ధి రామప్ప బాధ్యతలు తీసుకున్నారు.

జెడ్పీలో పార్టీల బలాబలాలు
జెడ్పీలో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ స్థానాలను దక్కించుకుంది. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ తొమ్మిది స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ మద్దూర్‌లోనూ, బీజేపీ ధన్వాడలోనూ ఒక్కొక్క స్థానాన్ని దక్కించుకో గలిగాయి. దీనితో జెడ్పీలో ప్రతిపక్షాల పాత్ర నామ మాత్రమే కానుంది. ఎంపీపీల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. టీఆర్‌ఎస్ ఎనిమిది స్థానాలను దక్కించు కోగా బీజేపీ ధన్వాడ, మాగనూర్‌లలో గెలుపొందింది. కాంగ్రెస్ మద్దూర్ మండల స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఎటుచూసినా అధికార టీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీలో పూర్తిస్థాయి ఆదిక్యతలో ఉండగా ప్రతిపక్షాల పాత్ర అంతంత మాత్రమే కానుంది.

హాజరుకానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు
నేడు ఉదయం 11 గంటలకు నిర్వహించే నారాయణ పేట జెడ్పీచైర్‌పర్సన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్పైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ జిల్లా ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్. రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడి, పట్నం నరేందర్‌రెడ్డి, టీఎస్‌టీపీసీ చైర్మన్ దేవరి మల్లప్ప, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరిత హాజరు కానున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ జెడ్పీ పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారాలు చేయించనున్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles