సిలబస్ మార్చడం అభినందనీయం

Fri,July 5, 2019 03:39 AM

మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం): దాదాపు 20 యేండ్ల తర్వాత వైద్యవిద్య(ఎంబీబీఎస్) సిలబస్‌ను భారతీయ వైద్యమండలి మార్పులు చేయడం, రోగుల పట్ల మరింత అనుబంధాన్ని ఏర్పరిచే విధంగా సిలబస్‌ను రూపొందించడం చాలా ఆభినందనీయమని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజారత్నం అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఎదిరలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన రెవిజ్డ్ బేసిక్ కోర్స్‌పై మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని వీసీ రాజారత్నం ముఖ్య ఆతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 50 మంది వైద్య కళాశాల బోధన సిబ్బందికి మూడు రోజులలో శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పెరుగుతున్న రోగులు, రోగాలపై కొత్తగా ఆధ్యయనాలు, పరిశోధనలు చేయడంతో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. కాలనుగుణంగా వచ్చే మార్పులు, మారుతున్న సామాజిక పరిస్థితులు, రోగుల పట్ల మరింత అనుబంధాన్ని రూపొందించారన్నారు. వైద్య విద్యార్థులకు పుస్తక విజ్ఞానమే కాకుండా వాస్తవిక జ్ఞానంతో పాటు రోగులు వారి బంధువుల యొక్క ఆశలు, ఆందోళన వారి భయాలను తీర్చేవిధంగా, పూర్తిగా నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి సిలబస్‌ను రూపొందించటం అత్యంత అవసరం, హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యకళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నూతన సిలబస్ ఈ విద్యా సంవత్సరం 2019-20 నుంచే ప్రారంభమవుతుందని, గతంలో మాదిరిగా కాకుండా కొత్త సిలబస్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే వైద్యవిద్యార్థులు దవాఖానాలో ప్రాక్టికల్‌గా రోగులను పరిశీలించి తమ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారని అన్నారు. జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ మాట్లాడుతూ ఈ నూతన సిలబస్‌లో వైద్య అధ్యాపకులందరూ ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వైద్య విద్యార్థులకు మరింత మెరుగైన వాస్తవాధారిత విద్యాభోధన చేయగలరని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునందిని, కోఆర్డినేటర్ డాక్టర్ రషీద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles