ఆషాఢం.. ఆధ్యాత్మికం

Thu,July 4, 2019 05:42 AM

- బోనాలతో పల్లెల్లో సందడి
- ఏకాదశి, గురుపౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు
- గోరింటాకుతో మురిసే అతివలు
- ఆఫర్లతో ముంచెత్తుతున్న వ్యాపారులు

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: హైందవ సాంప్రదాయంలో ఆషాఢమాసానికి ప్రత్యేక స్థానముంది. ఈ మాసంలో తొలకరి జల్లులతో నేలతల్లి పులకరించి, అన్నదాత లోగిళ్లలో కోటి ఆశల కాంతులు నింపుతుంది. హరితవర్ణం పులుముకున్న ప్రకృతి, ప్రతి మదినీ రంజింపజేస్తుంది. ఆషాఢమాసం శుభకార్యాలకు అనువైనది కాకపోయినా ఆధ్యాత్మికంగా ఎన్నో విశేషాలను కలిగి ఉంది. ఈ నెల 3వ తేదీ బుధవారం నుంచి ఆషాఢమాసం ప్రారంభమైంది. పూర్వషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి నెలనే ఆషాఢమాసంగా పిలుస్తారు. దీనిని శూన్యమాసం అని కూడా అంటారు. ఆషాఢంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఈ నెలలోనే గురుపౌర్ణమి వస్తాయి. ఆషాఢశుద్ధ విధియ రోజున పూరీజగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరగుతుంది. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకొంటారు. ఈ ఏకాదశితోనే పండగలు ప్రారంభమవుతాయి.

ఊరూర బోనాల సంబురం
ఆషాఢ మాసంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతరలు కనుల పండువగా జరగుతాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పల్లె, పట్నం తేడా లేకుండా మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. డప్పుచప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య సాగే బోనాల ఊరేగింపులతో ఊరూవాడా ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంటుంది. వర్షాకాలంలో వచ్చే రుగ్మతల నుంచి తమను రక్షించాలనీ, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలను పూజిస్తారు. బతుకమ్మ పండగ తర్వాత మహిళలు అంత ప్రాధాన్యమిచ్చే మరో పండగ బోనాలు. కులాలకతీతంగా జరిగే బోనాల జాతర, సమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలా నిలుస్తుంది.

నవ దంపతులకు ఎడబాటు
కొత్తకోడలు ఆషాఢమాసంలో అత్తముఖం చూడకూడదనే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ మాసంలో గర్భధారణ అయితే ప్రసవం మండు వేసవిలో జరుగుతుందనీ, అది తల్లీబిడ్డలకు శ్రేయస్కరం కాదనే శాస్త్రీయ ధృక్పథంలోంచే ఈ నిబంధన పుట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా కొత్తకోడళ్లు పుట్టింటికి వెళ్లడమనే సంప్రదాయం కొనసాగుతోంది. అదేవిధంగా వ్యవసాయ పనులకు అవరోధం కలిగించొద్దనే సదుద్దేశంతో కొత్త జంటలకు ఈ ధర్మబద్ధ నిషేదాన్ని విధించారని అనుభవజ్ఞులు చెబుతుంటారు.

గోరింట పూసిందీ..
ఆషాఢంలో మహిళల చేతులు, పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మెట్టింటి నుంచి పుట్టిల్లు చేరే నవ వధువు సౌభాగ్యం కోసం తోటి ముత్తయిదువులతో కలిసి గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం. దీంతో ఇంటింటా పండగ వాతావరణం అలుముకుంటుంది. గోరింటాకు పెట్టుకున్న యువతుల చేతులు మందారంలా పండితే మంచి మొగుడు వస్తాడనీ, గన్నేరులా పండితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పాతకాలం అవ్వలు ఆటపట్టిస్తుంటారు. ఒకప్పుడు ఇళ్లచుట్టూ, పెరట్లో పెద్ద సంఖ్యలో మైదాకు చెట్లు ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మహిళలంతా రెడీమేడ్ గోరింటాకు కోన్లవైపు మొగ్గుచూపుతున్నారు.

ఆషాఢం ఆఫర్లు
ఆషాఢ మాసం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. కానీ శూన్యమాసం కావడంతో ఆభరణాలు, వస్త్ర్తాలకు పెద్దగా గిరాకీ ఉండదు. దీంతో వ్యాపారులు మగువలను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు. వస్ర్తాల నుంచి నగల మార్కెట్లో ప్రత్యేక ధరలతో, బహుమతులతో అలంకారప్రియులను ఆకట్టుకుంటుంటారు వ్యాపారులు. దీంతో ఈ మాసంలో పలు రకాల వస్తువుల విక్రయాలు విరివిగానే సాగుతాయని చెప్పాలి. తూకాల్లో చీరల విక్రయాలు, ఒకటి కొంటే మరోటి ఉచితంలాంటి ఆఫర్లు, లక్కీడ్రాలో వాహనాల బహుమతులు ఆకర్షించడం ఒక విశేషం. కాగా వినియోగదారుడు జేబుకు చిల్లు పడకుండా చూసుకునే తరుణం కూడా ఇదే.

ఆషాఢం వెనుక ఆరోగ్యం
ఆషాఢ మాసం వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఈదురుగాలులతో చినుకులు పడతాయి. ఈ పుల్ల చినుకులు కాలువలు, నదులు, బావుల్లో కలిస్తే మలినమౌతాయి. ఆ నీరు తాగితే అనారోగ్యం ఏర్పడుతుంది. అందుకే ఈ మాసంలో నీళ్లు కాచి వడబోసి తాగాలని చెబుతారు. అలాగే పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు. చైత్ర వైశాఖ మాసాల్లో వ్యవసాయ పనులు ఉండవు. అప్పుడే వివాహాది శుభ ముహూర్తాలుంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువతులు తల్లిగారింట్లో ఉండే సంప్రదాయం ఉంది. కష్టపడి వ్యవసాయ పనులు చేయాల్సిన యువకులు అత్తగారింట్లో ఉంటే పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు కాబట్టి అమ్మాయిలు సహితం తల్లి గారింట్లో ఉంటూ మైదాకు ధరించి ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు. కొత్త నీరు తాగితే చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి వంటి రోగాలు రావడమే కాకుండా మహిళలు గర్భం దాల్చడానికి సరైన మాసం కాదని ఓ నమ్మకం.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles