రేపటి నుంచి 5 జిల్లా పరిషత్‌లు

Thu,July 4, 2019 05:41 AM

- సిబ్బంది విభజన పూర్తి చేసిన అధికారులు
- కార్యాలయాలను సిద్ధం చేసిన యంత్రాంగం
- అన్ని చోట్ల ప్రభుత్వ భవనాల్లోనే జెడ్పీలు
- నోడల్ జెడ్పీ నుంచి అన్ని జెడ్పీలకు ఉద్యోగుల విభజన
- ప్రమాణ స్వీకారాలకు రంగం సిద్ధం
- జెడ్పీ సీఈవో, ఏవోల నియామకాల జీవో విడుదల చేయనున్న సర్కారు

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : గతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ రేపటి నుంచి ఐదు జిల్లా పరిషత్‌లుగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయి కొత్త జెడ్పీ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు సైతం ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న పాలకవర్గం గడువు నేటితో ముగిసి పోవడంతో రేపటి నుంచి కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఉమ్మడి జిల్లా పరిషత్ మహబూబ్ నగర్ నోడల్ జిల్లా పరిషత్‌గా ఉండి ఉద్యోగులు, ఫర్నీచర్ విభజన చేపట్టింది. ఇప్పటికే అన్ని కొత్త జెడ్పీలకు కార్యాలయాలను ప్రభుత్వం కేటాయించింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఇప్పడు ఉన్న కార్యాలయంలోనే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడిన జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలులో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలను కేటాయించారు. కొత్తగా జిల్లా పరిషత్ కార్యాల యాలు నిర్మించే వరకు ఇక్కడే జెడ్పీలు కొనసాగుతాయి. రేపు ఉమ్మడి జిల్లాలోని 5 జిల్లా పరిషత్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగుతాయి.

కార్యాలయాలు సిద్ధం
ఉమ్మడి జిల్లాలోని కొత్తగా ఏర్పడిన 4 జిల్లా పరిషత్‌లకు కార్యాలయాలను సిద్ధం చేశారు. కార్యాలయాలకు నోడల్ జెడ్పీ నుంచి ఫర్నీచర్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్ జెడ్పీలో ఉన్న ఫర్నీచర్‌ను జిల్లాల వారీగా విభజించి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా ఫర్నీచర్ కాలం చెల్లినది కావడంతో పనికివచ్చే వాటిని మాత్రమే పంపిం చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీరువాలు, టేబుళ్లు, చైర్లు ఇలా విభజించి ఫర్నీచర్‌ను పంపించనున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయాల్లో అవసరమైన మేర కొత్త ఫర్నీచర్ కూడా కొనుగోలు చేసేందుకు యంత్రాంగం సిద్ధం అవుతోంది.

సిబ్బంది విభజన
ప్రస్తుతం నోడల్ జెడ్పీ కార్యాలయంలో 61 మంది సిబ్బంది ఉన్నారు. సూపరింటెండెంట్లు, సీనియర్ అసి స్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినేట్లు, డ్రైవర్ పోస్టుల్లో ఈ 61 మంది సిబ్బంది పని చేస్తున్నారు. నోడల్ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా ఉన్న మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వీరందరినీ స్థానికత ఆధారంగా ఆర్డర్ టు సర్వ్ ప్రకారం వివిధ జెడ్పీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా రేపు ఆయా జిల్లా పరిషత్‌లలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఇక జెడ్పీ సీఈవోలు, ఏవోలను కేటాయించేందుకు గానూ ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. ఇవాళ జీవో విడుదల అయ్యే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌కు ముగ్గురు సూపరింటెండెంట్లు, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఐదుగురు అటెండర్లను కేటాయించారు. జోగుళాంబ గద్వాల, నారాయణపేట జెడ్పీలకు ఒక సూపరింటెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఇద్దరు అటెండర్లను కేటాయించారు. నాగర్ కర్నూలు జెడ్పీకి ఒక సూపరింటెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఓ టైపిస్టు, ముగ్గురు అటెండర్లు, ఒక డ్రైవర్‌ను కేటాయించారు. వనపర్తికి ఒక సూపరింటెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఇద్దరు అటెండర్లను కేటాయించారు.

రేపు కొలువుదీరనున్న పాలకవర్గాలు
కొత్తగా ఏర్పడిన ఐదు జిల్లా పరిషత్ పాలకవర్గాలు రేపు కొలువుదీరనున్నాయి. ప్రస్తుత పాలకవర్గం గడువు నేటితో తీరిపోనుంది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి ఇక మాజీలుగా మారనున్నారు. ప్రమాణ స్వీకారాలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles