భీమా.. ధీమా

Wed,July 3, 2019 03:31 AM

భీమా ఫేజ్-2తో పది మండలాల్లోని 44 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. గత ఏడాది 80 చెరువులు నింపడం ద్వారా వనపర్తి జిల్లాలో వ్యవసాయం పండుగైంది. కొత్తకోట మండలం శంకరసముద్రం,శ్రీరంగాపురం సమీపంలోని రంగసముద్రాలను రిజర్వాయర్లుగా మార్చారు. అంతకుముందు కేవలం వర్షాల ఆధారంగానే సేద్యం చేసిన కర్షకులు ఈ రిజర్వాయర్ల నీటితో పంటలు పండిస్తున్నారు. ఈ రెండు చెరువులను రిజర్వాయర్లుగా మార్చటంతో వీటి స్వరూపమే మారిపోవటంతోపాటు సాగు విస్తీర్ణం పెరిగింది.

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కరవు రక్కసిని పారదోలాలని కంకణం కట్టుకున్న పాలకుల కృషితో నేడు పొలాలన్నీ పచ్చబడు తున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌లోకి తీసుకొచ్చి పడావుపడ్డ పొలాలను పంటల రాసు లకు నెలవు చేస్తున్నారు. ఇందుకు జిల్లా పరిధిలో ఉన్న రెండు రిజర్వాయర్లు దర్ఫణం పడుతు న్నాయి. కొత్తకోట మండలం కానాయిపల్లి శంకర సముద్రం.. శ్రీరంగాపురం రంగ సముద్రం రిజర్వాయర్లు సాగునీటి పరంగా అత్యంత ప్రాధాన్యతగా నిలుస్తున్నాయి. వీటి పరిధిలోని మునకకు గురువుతున్న రెండు గ్రామాలు ఖాళీ అయితే.. ఇంకా పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరందించే అవకాశం ఉంది.
జిల్లా పరిధిలోని కొత్తకోట మండలం శంకర సముద్రం, శ్రీరంగాపురం సమీపంలోని రంగ సముద్రంలను బీమా ఫేస్-2లో రిజర్వాయర్లుగా మార్చారు. అంతకుముందు కేవలం వర్షాల ఆధారంగానే సేద్యానికి సాగునీటిని అందించిన ఈ సముద్రాలు రిజర్వాయర్లుగా ఏర్పడిన అనంతరం వీటి స్వరూపమే మారిపోయింది. ఏటికేటికి అనుకూల వర్షాలు రాకపోవడం.. చిన్న చెరువులు.. కుంటలు కూడా నిండని పరిస్థితులు తలెత్తడంతో నేడు పూర్తి చేసుకున్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుండటం ప్రాధాన్యతగా కనిపిస్తోంది. ఎప్పుడో తెలంగాణ రాక ముందు దశాబ్దకాలం క్రితం మొదలు పెట్టిన ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రన్నింగ్ ప్రాజెక్టులుగా పనులు పరుగులు ద్వారా నేడు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

రూ.51 కోట్లతో శంకర సముద్రం రిజర్వాయర్
రూ.51 కోట్ల అంచనాతో శంకర సముద్రం రిజర్వాయర్ నిర్మాణం అవుతోంది. గతంలో 0.300 టీఎంసీ కెపాసిటీతో ఉన్న ఈ సముద్రంను నేడు 1.818 టీఎంసీ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. దాదాపు రిజర్వాయర్‌లో నిర్మాణంలో పనులన్నీ కొలిక్కి రాగా, 600 మీటర్ల మేర బండింగ్ పనులు నిలిచి ఉన్నాయి. ఈ రిజర్వాయర్‌లో కానాయిపల్లి గ్రామం ముంపునకు గురువుతోంది. ఈ బండింగ్‌ను పూర్తి చేయడం ద్వారా గ్రామంలోకి నీరు చేరుతుంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా పునరావాస ఏర్పాట్లను గుర్తించిన స్థలంలో పూర్తి చేయిస్తుంది. గ్రామస్తులకు దాదాపు రూ.13 కోట్ల రూపాయలను కూడా అందించింది. ఇంకాను ఇండ్యూజ్‌వల్ బెనిఫిట్స్ ఇవ్వాలన్న డిమాండ్‌తో గ్రామాన్ని ఖాళీ చేయలేదు. ఇలా అన్ని పనులు పూర్తి చేసుకున్న రిజర్వాయర్ గ్రామం ఖాళీ చేయక పోవడం వల్ల నీటి నిల్వను పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం 0.900 టీఎంసీల నీటినే నిలువ ఉంచుతున్నారు.

34 వేల ఎకరాలకు నీళ్లు
శంకర సముద్రం రిజర్వాయర్ ద్వారా 34 వేల ఎకరాలకు సాగునీరందుతోంది. ఈ రిజర్వాయర్ నుంచి 57 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాల్సి ఉంది. అయితే కానాయిపల్లి గ్రామం ఖాళీ అయితే తప్ప ఇది సాధ్యం కాదు. బీమా ఫేస్-2లో అంతర్భాగమైన ఈ రిజర్వా యర్‌కు రామన్‌పాడ్ నుంచి లిఫ్ట్ చేయడం ద్వారా ఇక్కడికి నీరు చేరుతోంది. బీమా ప్రాజెక్టులోని 27వ ప్యాకేజీలో ఎడమ కాలువకు ఇక్కడి నుంచి సాగునీరు వెళుతోంది. ఎడమ కాలువ ద్వారా 49 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉండగా, ప్రస్తుతం 30 వేల ఎకరాలకు సాగునీరందు తోంది. అలాగే కుడి కాలువ 35 కిలోమీటర్ల మేర 8 వేల ఎకరాలకు సాగు నీరందాలి. రిజర్వా యర్‌లో నీటిని పూర్తి స్థాయిలో నిలువ చేయక పోవడంతో కుడి కాలువకు నీరు అందడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిల చొరవతో ప్రత్యేక మోటర్లను ఏర్పాటు చేసి 4 వేల ఎకరాలకు సాగునీరందిస్తూ వస్తున్నారు. పునరావాస పనులు పూర్తి చేయించి, కానాయిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరందించడం ద్వారా ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది.

రూ.45 కోట్లతో రంగ సముద్రం రిజర్వాయర్
రూ.45 కోట్లతో రంగ సముద్రం రిజర్వాయర్ నిర్మాణం అయింది. అయితే 0.300 టీఎంసీల నీటి కెపాసిటీ ఉన్న ఈ సముద్రం ప్రస్తుతం 1.895 టీఎంసీల కెపాసిటీతో ఏర్పాటయింది. దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకున్నప్పటికీ ఇక్కడ కూడా నాగరాల ముంపు గ్రామం ఖాళీ చేయలేదు. దీంతో రిజర్వాయర్‌లో కేవలం 1 టీఎంసీ మాత్రమే నిలువ చేస్తున్నారు. ఏనుకుంట రిజర్వాయర్ నుంచి 15వ ప్యాకేజీ కాలువ ద్వారా రంగ సముద్రానికి 30 కిలోమీటర్ల కాలువ మార్గం ఉంది. ఈ కాలువలో 350 క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉన్నా రంగ సముద్రంలోకి కేవలం 100 క్యూసెక్కులు మాత్రమే చేరుతుంది. మధ్యలో కాలువ పొడవునా సాగుబడులు చేసు కోవడంతో అనుకున్న మేర రంగ సముద్రానికి నీరు చేరడం లేదు. ఈ కాలువ సామర్థ్యం పెంచితే తప్ప రంగసముద్రానికి అనుకున్న మేర సాగునీరు చేరుతుంది. ఇదిలా ఉంటే ముంపు గ్రామానికి ప్రత్యేక స్థలం చూయించడం అక్కడ మౌలిక వసతులను సహితం సమకూర్చడం లాంటివి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంకాను ఇండ్యూజువల్ బెనిఫెట్స్ రావాలన్న డిమాండ్‌తో నాగరాల గ్రామం ఖాళీ చేయలేదు.

10 వేల ఎకరాలకు సాగునీరు
రంగ సముద్రం రిజర్వాయర్ కింద 21 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే పారుదల లేదని ఈ ఆయకట్టును 16 వేల 666 ఎకరాల ఆయకట్టుకు కుదించారు. ప్రస్తుతం 10 వేల ఎకరాలకు సాగునీరందుతోంది. ఈ రిజర్వాయర్ నుంచి బీమా ప్రాజెక్టులోని 16వ ప్యాకేజీ కాలువను ఏర్పాటు చేశారు. దాదాపు 70 కిలో మీటర్ల పొడవునా ఈ కాలువ ఏర్పాటు చేయాల్సి ఉండగా, మరో 15 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరందించాలంటే.. ఏనుకుంట రిజర్వాయర్ నుంచి రంగసముద్రం రిజర్వాయర్‌కు మరో ప్యార్‌లాల్ కెనాల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సాధ్యమవుతుందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న కాలువ ద్వారా 3 లేదా 4 నెలలు వరుసగా నీరొచ్చినా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలా మరొక ప్రత్యామ్నాయం ఏర్పాటైతే ఇక్కడి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరందుతుందని భావిస్తున్నారు.

10 మండలాల గ్రామాలకు అవకాశం
బీమా ప్రాజెక్టు ఫేస్-2 అంతర్భాగమైన శంకర సముద్రం, రంగ సముద్రం రిజర్వాయర్ల ద్వారా దాదాపు 10 మండలాల గ్రామాలకు సాగునీరు అందుతుంది. శంకర సముద్రం ద్వారా వనపర్తి, పెద్దమందడి, కొత్తకోట, అడ్డాకుల, పెబ్బేరు, శ్రీరంగాపురం, పాన్‌గల్, వీపనగండ్ల, మండలాలకు సాగునీరందుతుంది. అలాగే రంగ సముద్రం ద్వారా వీపనగండ్ల, చిన్నంబాయి, శ్రీరంగాపురం, పెంట్లవెళ్లి మండలాల గ్రామాలకు సాగునీరందుతుంది. ఎలాంటి సాగునీటి వసతి లేని గ్రామాలకు ఈ రిజర్వాయర్ల కాలువ ద్వారా పంటలు పండిస్తున్నారు. గత ఏడాది ఈ మండ లాల పరిధిలోని గ్రామాల్లో దాదాపు 80 చెరువులను నింపుకొని సాగుబడులు చేసుకున్నారు. కృష్ణా నదిలో నీటి పరవళ్లు ఉన్నంత వరకు ఇక్కడి బీమా ఫేస్-2లో సాగునీరు అందుతుంది. నదిలో నీటి పరవళ్లు తగ్గితే.. ఇక్కడ కూడా కాలువల్లో నీటి పారుదల తగ్గిపోతుంది. ఎక్కువగా చెరువులను నింపు కోవడం వల్ల సాగుబడులకు అవకాశం ఉంది.

అడ్డుకట్టే ఆధారం
శంకర సముద్రం రిజర్వాయర్‌లో ఓ అడ్డకట్ట నిర్మాణం చేసి రైతులకు గత నాలుగేళ్లుగా సాగు నీరందిస్తున్నారు. పంపింగ్ ద్వారా వచ్చే నీటిని ఈ అడ్డుకట్ట బండింగ్ ద్వారా నేరుగా 27వ ప్యాకేజీ కాలువకు నీటిని మళ్లించే వెసలుబాటు కలిగింది. ఈ ప్రత్యేక బండింగ్ నిర్మాణం వల్ల రిజర్వాయర్‌కు సంబంధం లేకుండానే దాదాపు ఎనిమిది మండలాలకు సాగునీరు అందుతుంది. ఈ అడ్డకట్టకు స్వెటర్స్ ఏర్పాటు చేసి అవసర మైనంత మేర రిజర్వాయర్‌లోకి నీటి విడుదల జరిగేలా నిర్మాణం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రిజర్వాయర్‌లో ఈ అడ్డుకట్ట నిర్మాణం చేపట్టి రైతులకు మేలు చేశారు. కానాయిపల్లి పునరావాసం సమస్య కొలిక్కి రాకపోవడంతో కొత్త ఆలోచనకు తెరలేపి మంత్రి సింగిరెడ్డి పుణ్యమా అంటూ ఎనిమిది మండలాల గ్రామాలకు సాగునీరు అందిస్తున్నారు. దాదాపు 2014 నుంచి రాసుల పంటలు పండించేందుకు ఈ అడ్డకట్ట ఆదరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles