ప్రతిష్ఠాత్మకంగా హరితహారం

Sat,May 25, 2019 01:41 AM

-సరిపడా మొక్కలు సిద్ధం చేసుకోండి
-పంచాయతీ కార్యదర్శులు బాధ్యతతో పనిచేయాలి
-పనిచేయని ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లపై చర్యలు
-స్వచ్ఛభారత్ మిషన్‌పై సమీక్షలో కలెక్టర్ శశాంక
గద్వాల, నమస్తే తెలంగాణ : జూలై రెండో వారం నుంచి ప్రారంభమయ్యే హరితహారానికి కావాల్సిన మొక్కలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు మందిరంలో తెలంగాణకు హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ మండలాలు, గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన నర్సరీలు, వాటిలో ప్రస్తుతం పెరుగుతున్న మొక్కల విషయమై మండల అభివృద్ధి అధికారులు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. మా జిల్లా, మా గ్రామం, మండలం లో చెట్లు పెంచాలి, రైతులు బాగుండాలి, భూగర్భజలాలు పెరగాలనే అంకిత భావంతో అధికారులు పని చేసినప్పుడే హరితహారానికి ఒక అర్థం ఉంటుందని కలెక్టర్ అన్నారు. గ్రామాలకు కావాల్సిన మొక్కల కన్నా ప్రస్తుతం నర్సరీలలో పెరుగుతున్న మొక్కలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని, ఇలా ఉంటే హరితహారం కార్యాక్రమం ఎలా విజయవంతం అవుతుందని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ మాసం నుంచి నర్సరీల నిర్వహణ మంచిగా చేపట్టాలని అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని, విధుల నిర్వాహణ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యమని, హరితహారం ప్రారంభమైతే మొక్కలు ఎక్కడి నుంచి తీసుక వస్తారని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నర్సరీలలో మట్టి సరిగా కలపక, సకాలంలో నీరు పోయక వాటిని పెంచాల్సిన స్థితిలో పెంచకపోవడంతో కొన్ని మండలాల్లో నర్సరీలలో నాటిన విత్తనాలు సగం కూడా మొక్కలు మొలకెత్తక పోవడంతో అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు తమ బాధ్యతగా భావించి వారానికి రెండు సార్లు నర్సరీలను పరిశీలించి, మొక్కలు పెంచేందుకు అక్కడ ఉన్న పరిణామాలు తెలుసుకుంటూ సరైనా దిశా నిర్ధేశం చేయాలన్నారు. ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్‌లు విధిగా నర్సరీల పెంపకంలో భాగస్వాములు కావాలన్నారు. పనిచేయని ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికైనా ఎంపీడీవోలు, ఏపీడీలు, డీఆర్‌డీఏ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులు చక్కదిద్దాలన్నారు. ఆయా గ్రామాలకు కావాల్సిన మొక్కలు ఎక్కడ నుంచి సమకూర్చుకోవాలో ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. మొక్కలు రాని వాటిలో తిరిగి విత్తనాలు వేసి మొలకలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, వారంలోగా ఫలితాలు కనిపించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా జూన్ రెండో తేదీ నాటికి గద్వాల, ఆలంపూర్ బహిరంగ మలమూత్రవిసర్జన రహిత మండలాలుగా ప్రకటించాలని, అందుకు మరుగు దొడ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటిక్యాల, వడ్డేపల్లి, మల్దకల్, మానవపాడు జూన్ మొదటి వారంలో, గట్టు, ధరూర్, జూన్ రెండో వారం వరకు ఓడీఎఫ్‌గా ప్రకటించుకునే విధంగా మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తి అయ్యేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో జ్యోతి, ఏపీడీలు నాగలింగాచారి, సుల్తాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles