లైనింగ్ పనులు పూర్తి చేయాలి

Thu,May 23, 2019 12:43 AM

మక్తల్, నమస్తే తెలంగాణ : దివంగత చిట్టెం నర్సిరెడ్డి (సంగంబండ) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే 47వ ప్యాకేజీ కెనాల్ పనులు యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ సమీపంలోని 46వ ప్యాకేజీ కెనాల్ లైనింగ్ పనులను ఎమ్మెల్యే చిట్టెం పరిశీలించి మాట్లాడారు. భీమా ఫేజ్-1లో అంతర్భాగం అయిన చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్‌కు కృష్ణానది నుంచి నీటిని తరలించే 46, 47వ ప్యాకేజీ కెనాళ్ల లైనింగ్ పనులకు రూ. 31.41కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 2 ప్యాకేజీల్లో 8.120 కి.మీల కెనాల్‌ను లైనింగ్ చేసేందుకు పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు పనులను యుద్దప్రతిపాదికన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్‌లో వర్షాలు ప్రారంభం కానుండటంతో లైనింగ్ పనులకు ఆటంకం ఏర్పడకుండా జూన్ మొదటి వారంలోనే పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరద వస్తే కృష్ణమ్మ నీటితో రిజర్వాయర్‌ను నింపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో మక్తల్ నియోజకవర్గంలోని భీమా పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కెనాల్ అనుసంధానంతో చెరువులను నింపి సాగుకు నీటిని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఎవరూ సాగునీటి కోసం ఇబ్బందులు ఏదుర్కోకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చిట్టెం సూచించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహగౌడ్, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సత్యారెడ్డి తదితరులు ఉన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles