ఇక రిజిస్ట్ట్రేషన్లు.. నగదు రహితం..!

Tue,May 21, 2019 03:52 AM

-అందుబాటులో ‘తెలంగాణ వ్యాలెట్‌ యాప్‌'
అయిజ : అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్‌ నడుంబిగించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక ప్రభుత్వ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పారదర్శక పాలనను అందించేందుకు శ్రీకారం చుట్టారు. 2016 సంవత్సరంలో మున్సిపల్‌ శాఖలో ఇంటి యాజమాని పేరు మార్పు, ట్రేడ్‌ లైసెన్స్‌, ఇంటిపన్ను వసూలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేసి సులవైన పద్ధతుల్లో పత్రాలు పొందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అవినీతి రహిత పాలనే లక్ష్యంగా కాగితం రహిత, నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచి అవినీతికి ఆస్కారం లేకుండా చేసింది. ఇందులో భాగంగానే సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో రుసుముల స్వీకరణకు ‘తెలంగాణ వ్యాలెట్‌ యాప్‌'ను జూన్‌ 1 నుంచి ప్రారంభించనున్నది.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయాల్లో ప్రజలకు అత్యంత పారదర్శకంగా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వివిధ సేవలకు వసూలు చేసే అదనపు మొత్తం (అధిక వసూలు) లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన రుసుమును మాత్రమే తీసుకుని సేవలు అందించే విధంగా ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రజలకు విసృతమైన సేవలు సత్వరమే అందే అవకాశం ఉంది.

తెలంగాణ వ్యాలెట్‌ యాప్‌తో ప్రయోజనాలు..
బాండ్‌ పేపర్లను కొనుగోలు చేయుటకు నగదుకు బదులుగా తెలంగాణ వ్యాలెట్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ నగదు చెల్లించి, ఎస్‌ఎంఎస్‌ను సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ (ఎస్‌ఆర్‌వో) సిబ్బందికి చూపించి బాండ్‌ పేపర్లను పొందవచ్చు. బాండ్‌ పేపర్లను పొందాలంటే పేపర్ల రుసుముతోపాటు కార్యాలయ సిబ్బంది కొంత అధికంగా రుసుమును వసూలు చేసేవారు. ఉదాహరణకు రూ.20, రూ.50, రూ.100 బాండ్‌ పేపర్లకు రుసుము కంటే అదనంగా రూ.20 వసూలు చేసేవారు. దీన్ని తెలంగాణ వ్యాలెట్‌ యా ప్‌ ద్వారా అరికట్టవచ్చు. భూములకు సంబంధించి ఈసీలు పొందాలంటే ఈ యాప్‌ ద్వారా నగదు చెల్లించి ఈసీలను పొందవచ్చు. 30ఏళ్లలోపు ఈసీలు పొందాలంటే రూ.200, 30ఏళ్ల పైబడిన ఈసీలు పొందాలంటే రూ.500 చెల్లించాలి. వీటికి కార్యాలయం నుంచి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలే వచ్చిన నేపథ్యంలో ఈ యాప్‌ ద్వారా నగదును చెల్లిస్తే 30రోజులలోపు ఈసీలను పొందవచ్చు.

సర్టిఫైడ్‌ ధ్రువపత్రాలను పొందాలంటే..
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి సర్టిఫైడ్‌ పత్రాలను పొందాలంటే మ్యాన్‌వల్‌ అయితే రూ.200, కంప్యూటరైజ్‌డ్‌ పత్రాలను రూ.270 ఈయాప్‌ ద్వారా చెల్లిస్తే మూడు రోజుల్లో పత్రాలు పొందొచ్చు. 2001 ఏడాదికి కంటే ముందు మ్యాన్‌వల్‌ పత్రాలు అయితే మూడు రోజుల్లో, 2002 ఏడాది తర్వాత పత్రాలైతే ఒక రోజులోనే పొందవచ్చు. హిందూ వివాహ నమోదు పత్రం (మ్యారేజ్‌ సర్టిఫికెట్‌) రూ.200 చెల్లించాలి. ఈ తెలంగాణ వ్యాలెట్‌ యాప్‌ ద్వారా నగదు చెల్లించి రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. 2017 ఏప్రిల్‌ నుంచి ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకునే ప్రక్రియ అమలులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో చలానా చెల్లించడం ద్వారా కార్యాలయంలో నగదు మార్పిడిని, అవినీతి, అక్రమాలు, లంచాలను అరికట్టవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది విజయవంతంగా కొనసాగుతున్నది.

ఆదేశాలు రాగానే తెలంగాణ వ్యాలెట్‌ యాప్‌ అమలు..
నగదు రహిత రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ వ్యాలెట్‌ యాప్‌'ను తీసుకొస్తుంది. ఈ ప్రక్రియను జూన్‌ 1 నుంచి అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే తెలంగాణ వ్యాలెట్‌ యాప్‌తోనే అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లో అమలు చేస్తాం.
- రాజేశ్‌, సబ్‌ రిజిస్టార్‌, జోగుళాంబ గద్వాల

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles