వీఆర్‌ఓ నిర్లక్ష్యం 40 మందికి శాపం

Sun,May 19, 2019 12:25 AM

మక్తల్, నమస్తే తెలంగాణ : రెవెన్యూ అధికారుల తప్పిదం తో గ్రామంలో 40 మంది రైతులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని వనయికుంట గ్రామంలోని భూ రికార్డుల్లో జరిగిన తప్పులకు రెవెన్యూ అధికారులే కారణమని బాధిత రైతులు వాపోతున్నారు. గ్రామంలోని సర్వే నంబర్ 96, 98, 99, 100లో ఉన్న సమస్యను గ్రామ రైతుల చుట్టూ బిగించి చేతులు దులుపుకున్న ఘనత రెవెన్యూ అధికారులదే..

మక్తల్ మండలానికి కూతవేటు దూరంలో ఉన్న వనయికుంట గ్రామ రైతులకు సంబంధించిన భూములు మక్తల్ మండలం దాసర్‌దొడ్డి గ్రామ శివారులో ఉన్నాయి. 96, 98, 99, 100 సర్వే నంబర్లలోని భూమి రైతుల పాలిట ఆ సర్వే నంబర్లు శాపాలుగా మారాయి. భూ ప్రక్షాళనలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని అనుకున్న రైతాంగం ఉన్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలుగా చేసిన ఘనత రెవెన్యూ అధికారులదే.. అని రైతులు లబోదిబోమంటున్నారు. ఉన్నది ఉన్నట్లుగా అధికారులు సమగ్ర సర్వేలో నమోదు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవికావని, ఉన్న భూమిని ఎగ్గొట్టి 22 గుంటలు, 1 గుంట భూమిని రైతుల పేరిట నమోదు చేసి చేతులు దులుపుకోవడంతో భూమి ఎక్కడికెళ్లిందోననే సందిగ్ధంలో పడాల్సిన పరిస్థితి తలెత్తిందని వనాయికుంట రైతులు వాపోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు. కొత్త పుస్తకాల్లో ఉన్న భూమి రాకపోవడంతో తమ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. నెలల తరబడి వేచి చూసినప్పటికీ అధికారులల్లో ఏ మాత్రం చలనం రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ సర్వేయర్‌తో భూముల సర్వే
తమ భూమి పాసుపుస్తకంలో తక్కువగా నమోదయిందని, మిగితా భూమి ఎక్కడికెళ్లిందని వీఆర్‌వో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీఆర్‌వో సర్వేయర్ ద్వారా భూమిని కొలుచుకొని వచ్చినప్పుడే వాటిని సరిచేస్తామని రైతులకు ఆదేశాలు జారీ చేశారు.గ్రామంలోని రైతులు ప్రైవేట్ సర్వేయర్‌తో 1973-74 కాస్రాపాని ఆధారంగా సర్వే చేయించుకొని వచ్చినప్పటికీ అధికారులు మాత్రం అట్టి భూమిని సరిచేసి రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన వీఆర్‌వో రైతులు డబ్బులు ఇస్తేగాని సమస్యపై స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles