గొంతు తడిపేందుకు..తరలిన కృష్ణమ్మ

Fri,May 17, 2019 01:14 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి: తాగునీటి ఎద్దడి నుంచి ఉపశమనం లభించింది. ఎర్రటి ఎండలు తీవ్రమైన సందర్భంలో గ్రామాల్లో తాగునీటి సమస్యకు కారణంగా నిలిచింది. జూన్‌ మాసంలో రుతుపవనాల ప్రవేశం ఉంటుందని ఇటీవలే వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించిన క్రమంలో ప్రస్తుత నీటి ఎద్దడి నుండి ప్రజలను రక్షించేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న చొరవతో మేలు జరుగుతుంది. వారంరోజులుగా ఆల్మట్టి నుంచి తాగునీటి అవసరాల కోసం విడుదల చేయించిన నీరు నారాయణపూర్‌ డ్యాం ద్వారా జూరాలకు చేరుకున్న సంగతి విధితమే. అయితే,నేడు శుక్రవారం జూరాల ఎడమ కాలవకు నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించడంతో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకముందే తొలగిపోయింది.గతంలో ఎండాకాలం వస్తుందంటే పట్టణాలు..గ్రామాల్లో నీటి ఎద్దడి తాండవం చేసింది. పక్షం రోజులకు ఒకసారి కూడా నల్లాల నీరురాని పరిస్థితిని దశాబ్దాల తరబడి ఎదుర్కొన్న పరిస్థితులు లేకపోలేదు. వాగులు..వంకల నుంచి దాహం తీర్చుకున్న రోజులు తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. అయితే,సీఎం కేసీఆర్‌ ఈ పరిస్థితులను గుర్తించి మిషన్‌ భగీరథ పథకంను ఏర్పాటు చేయడం ద్వారా అధిక నీటిసమస్య తొలగిపోయింది. అయితే,కొన్ని చోట్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడంతో సమస్య సద్గుమణుగుతుంది. ఇప్పటి వరకు పెద్దగా నీటి సమస్య రాకున్నా...జూన్‌,జులై వరకు వర్షాలు అనుకూలించని పక్షంలో తాగునీటి ఇబ్బంది కలగకూడదన్న ముందు చూపుతో సీఎం కేసీఆర్‌ ఆల్మట్టి ద్వారా 2 టీఎంసీల నీటిని విడుదల చేయించిన సంగతి విధితమే.

నేడు జూరాల నుండి నీటి విడుదల..
గత వారం రోజుల క్రితం ఆల్మట్టి నుండి విడుదలైన నీరు నారాయణపూర్‌ డ్యాం ద్వారా ఇటీవల జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటున్నది. ఇక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2 టీఎంసీల నీటిని ఆల్మట్టి ద్వారా సీఎం కేసీఆర్‌ విడుదల చేయించారు. జూరాల ఎడమ కాలవ నుండి రామన్‌పాడ్‌కు ఈ నీటిని అందించడం ద్వారా ప్రధాన నీటి సమస్య తొలగిపోతుంది. రామన్‌పాడ్‌ ఆధారంగా వనపర్తితోపాటు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట ప్రాంతాలకు గతంలో నీటి పంపిణీ జరిగిన సంగతి విధితమే. అయితే, మహబూబ్‌నగర్‌, అచ్చంపేట ప్రాంతాలను రామన్‌పాడ్‌ పథకం నుంచి తప్పించి మిషన్‌ భగీరథకు లింకు చేశారు. ప్రస్తుతం రామన్‌పాడ్‌లో నీటి శాతం చాలా తక్కువగా ఉన్నది. మరో నెల రోజుల వరకు పెద్ద వర్షాలు వచ్చే అవకాశం లేనందునా నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే రామన్‌పాడ్‌కు నీటిని తరలించాల్సి వచ్చింది. నీటి తరలింపునకు జూరాల ప్రాజెక్టులో సరిపడా నీరు లేనందునా ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణాపూర్‌ డ్యాంల నుండి నీటి విడుదల చేయించాల్సి వచ్చింది. రెండు రోజులకు పైగా జూరాలకు చేరుతున్న నీటితో జూరాల ఎడమకాలవకు నీరందే పరిస్థితులు రావడంతో నేడు శుక్రవారం రామన్‌పాడ్‌కు నీటి విడుదల చేయాలని మిషన్‌ భగీరథ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

తప్పిన నీటి ముప్పు..
ప్రధానంగా రెండు జిల్లాలకు ఎండాకాలంలో నీటి ముప్పు తప్పింది. జూరాలకు ఆల్మట్టి నీరు చేరుకోవడం ద్వారా ఈ సమస్య నుండి పూర్తిగా గట్టెక్కినట్లే. గద్వాల జిల్లాతోపాటు వనపర్తి జిల్లాకు చెందిన మిషన్‌భగీరథ పథకాలు జూరాల ఆధారంగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు జూరాల ఎగువ నుంచి నీరు రావడంతో ఎండాకాలం నుంచి బయటపడ్డాయి. గద్వాల జిల్లా యావత్తు మొత్తం జూరాల ప్రాజెక్టు ఆధారంగానే మిషన్‌ భగీరథ కొనసాగుతున్నది. ఇక వనపర్తి జిల్లాలోని అధికభాగం రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌పై ఆధారపడింది. ఈ రిజర్వాయర్‌ నుంచి 5మండలాల్లోని 120 గ్రామాలు, వనపర్తి మున్సిపాలిటీకి ఇక్కడి నుండే నీటి సరఫరా జరుగుతుంది.

కొత్తకోట, పెబ్బేరు, మదనాపురం, గోపాల్‌పేట, వనపర్తి మండలాల గ్రామాలకు రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌ ద్వారా మిషన్‌ భగీరథ నీటి పంపిణీ జరుగుతుంది. ఈ పథకంలోని మోటర్లకు రిజర్వాయర్‌లో నీరు అందక పోవడంతో ప్రత్యేక కాలువను తవ్వి మోటర్లకు నీరందిస్తున్నారు. రోజు..రోజుకు నీరందని పరిస్థితుల నుంచి బయటపడాలంటే జూరాల నుండి నీటి విడుదల జరిగితే తప్పా శరణ్యం లేదు. ఎట్టకేలకు జూరాల ఎడమకాలువ ద్వారా నేడు రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌కు నీటి విడుదల చేయాలని నిర్ణయించడంతో సమస్యకు పరిష్కారం దొరికింది. ఆల్మట్టి, నారాయణాపూర్‌ డ్యాంల నుంచి జూరాల నీటి విడదల కావడంతో మిషన్‌ భగీరథ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జూరాల ప్రాజెక్టులో నీరుంటే..మిషన్‌ భగీరథ పథకాలకు నిర్విరామంగా నీరందుతుంది. గత వారం రోజుల క్రితం జూరాలలో నీరు అడుగంటడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అవసరాలకు మిషన్‌ భగీరథ పథకం ఓ వరంలా పని చేస్తుంది. ఉమ్మడి జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఆయా రిజర్వాయర్లలో నీటి నిలువలను చేశారు. అయితే,కొన్ని ప్రాంతాల్లోని రైతులు ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించడం వల్ల నీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను సహితం అధిగమించేందుకు కర్నాటక ప్రభుత్వంతో సీఎం కేసీఆర్‌ చర్చించి నీటి విడుదల చేయించడంతో ఇక్కడి మిషన్‌ భగీరథ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో ‘భగీరథ’..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో మిషన్‌ భగీరథ రెండు సెగ్మెంట్లుగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో 46 లక్షల 47 వేల 898 మంది జనాభాకు ఈ పథకం ద్వారా శుద్ధమైన తాగు నీటిని అందించేలా రూపకల్పన చేశారు. ప్రధానంగా పైపులైన్‌ పనులు, ఓహెచ్‌బీఆర్‌, జీఎల్‌బీఆర్‌, సంపుల నిర్మాణాలన్ని పూర్తి చేసి నీటిని అందిస్తున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో జూరాల, ఎల్లూరు రెండు సెగ్మెంట్లుగా మిషన్‌ భగీరథ పథకం పనిచేస్తుంది. జూరాల నుండి గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథలో తాగునీటిని అందించే ఏర్పాట్లు చేయగా, ఎల్లూరు రిజర్వాయర్‌ నుండి మిగిలిన 12 నియోజకవర్గాలు కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌, మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాలకు నీరందించేలా మిషన్‌ భగీరథను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో 7 రిజర్వాయర్ల ద్వారా అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే,మరో 20 రోజులు గడిస్తే ఎండాకాలం నీటి సమస్య నుండి బయటపడుతుంది. ఈ సందర్భంలో ఈ సీజన్‌ అవసరాల కోసం వివిధ రిజర్వాయర్లలో ఎంతనీటిని కేటాయించారు..ప్రస్తుతం వాటిలో ఎంత నీరు నిల్వ ఉంది అన్న వివరాలు ఇలా ఉన్నాయి.

నీటి విడుదల చేస్తాం
శుక్రవారం జూరాల ప్రాజెక్టు నుంచి రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌కు నీటి విడుదల చేస్తాం. ప్రస్తుతం రామన్‌పాడ్‌లో నీటి లభ్యత తక్కువగా ఉంది. నీటి ఎద్దడి నివారణ కోసం ముందస్తుగా రామన్‌పాడ్‌కు నీటిని తరలిస్తున్నాం. ఎగువన ఆల్మట్టి, నారాయణాపూర్‌ డ్యాంల నుంచి జూరాలకు నీరు చేరడంవల్ల నేడు నీటి విడుదల సాధ్యమవుతుంది. 0.1టీఎంసీల నీరు రామన్‌పాడ్‌కు చేరితే జూలై నెల వరకు నీటి ఇబ్బంది ఉండదు. రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌లో ఇన్‌టేక్‌ వెల్‌కు నీరు అందడం కష్టంగా మారింది. ఇప్పటికే ప్రత్యేక కాలువ తీసి మోటర్లకు నీటిని అందిస్తున్నాం. గద్వాల, వనపర్తి జిల్లాల వారీగా మిషన్‌ భగీరథ పథకం ద్వారా యధావిధిగా నీటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తాం.
- జగన్‌మోహన్‌, ఎస్‌ఈ, మిషన్‌ భగీరథ, వనపర్తి

97
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles