ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతం

Wed,May 15, 2019 01:19 AM

-స్ట్రాంగ్‌ రూములకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- 27న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు
-ప్రెస్‌మీట్‌లో కలెక్టర్‌
గద్వాల, నమస్తే తెలంగాణ/ అర్బన్‌ : జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలను మూడు విడుతల్లో 12 మండలాల్లో పకడ్బందీగా నిర్వహించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ నెల 6న మొదటి విడుత గద్వాల, ధరూర్‌, గట్టు, కేటీదొడ్డి, 10న రెండో విడుత మల్దకల్‌, అయిజ, వడ్డేపల్లి, రాజోళి, మంగళవారం మూడో విడుత అలంపూర్‌, మానవపాడు, ఉండవెళ్లి, ఇటిక్యాల మండలాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా నిర్వహించామన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శశాంక విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో మూడో విడుతలో అలంపూర్‌, మానవపాడు, ఉండవెళ్లి, ఇటిక్యాల మంలాల్లోని 40 ఎంపీటీసీలు, 4 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగ్గా మానవపాడు మండలంలో అత్యధికంగా 82.97 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా ఇటిక్యాల మండలంలో 74.06 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. అలంపూర్‌ మండలంలో 77.23 శాతం, ఉండవెళ్లి మండలంలో 78.97 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు. మూడో విడుతలో మొత్తం 77.81 శాతం ఓట్లు పోలైనట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

మూడో విడుతలో జరిగిన మానవపాడు మండలంలో ఎన్నికలు జరిగిన మద్దూరు, చెన్నిపాడు, ఉండవెళ్లి మండలంలో పుల్లూరు, అలంపూర్‌ మండలంలో గొందిమళ్లలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. మూడో విడుత ఎన్నికలకు 194 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి 1,372 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించామని, ఎన్నికలు జరిగిన అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను ఎర్రవల్లిలోని కొట్టం తులసిరెడ్డి బీ ఫార్మసీ కళాశాలకు కట్టుదిట్టమైన పోలీస్‌ భద్రత నడుమ తరలించి భద్రపర్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ నెల 27న గద్వాల నియోజకవర్గ మండలాల ప్రాదేశిక ఓట్ల లెక్కింపును గోనుపాడు సమీపంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో, అలంపూర్‌ నియోజకవర్గ మండలాల ప్రాదేశిక ఓట్ల లెక్కింపును ఎర్రవల్లిలోని కొట్టం తులసిరెడ్డి బీ ఫార్మసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌లు నిల్వ చేసిన స్ట్రాంగ్‌ రూంలకు జిల్లా పోలీస్‌ యంత్రాంగంచే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా పోలీస్‌ యంత్రాంగం, పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles