బిరబిరా కృష్ణమ్మ!

Sat,May 11, 2019 12:38 AM

-జూరాల దిశగా నీలవేణి పరుగులు
-నారయణపుర డ్యాం నుంచి రెండు గేట్ల ద్వారా విడుదల
-కొనసాగుతున్న 10 వేల క్యూసెక్కుల ప్రవాహం
-ఆదివారం వరకు కొనసాగనున్న ఔట్‌ఫ్లో
-మంగళవారం వరకు జూరాలకు కృష్ణా జలాలు చేరుకునే అవకాశం
మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:కర్నాటకలోని నారాయణపుర బసవసాగర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. మండు వేసవిలో తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణానది జలాలు తరలి వస్తున్నాయి. పాలమూరు ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నాటక ముఖ్యమంత్రితో నడిపిన దౌత్యం ఫలించి బుధవారం రాత్రి నుంచి నారాయణపుర ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల ప్రారంభించారు. నారాయణపుర రిజర్వాయర్ నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఏం కేసీఆర్ అభ్యర్థించారు. నారాయణపుర ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి మొదట నారాయణపుర ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. అనంతరం నారాయణపుర బసవసాగర్ డ్యాంనుంచి జూరాలకు నీటి విడుదల ఆలస్యమైంది. నారాయణపుర ప్రాజెక్టు మినిమం డ్రా డౌన్ లెవల్ (ఎండీడీఎల్) కంటే ఎక్కువగా నీటి మట్టం చేరుకున్న తర్వాతే నీటి విడుదల ప్రారంభమైంది. నీటి సామర్థ్యం పెరిగిన తర్వాత బుధవారం రాత్రి జూరాల ప్రాజెక్టుకు 2110 క్యూసెక్కులతో నీటి విడుదల ప్రారంభమైంది. మరుసటి రోజు 8వేల క్యూసెక్కులకు పెంచారు. గురువారం మొత్తం దాదాపుగా అదేస్థాయిలో ప్రవాహం కొనసాగింది. క్రమంగా నీటి విడుదలను పెంచుతూ వచ్చారు. శుక్రవారం ఔట్‌ఫ్లో మరింతగా పెంచారు. రోజంతా 10వేల క్కూసెక్కుల నీటి విడుదల కొనసాగింది.

మంగళవారం నాటికి జూరాలకు..
నారాయణపుర బసవసాగర్ డ్యాం నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న ఔట్‌ఫ్లో 10వేల క్యూసెక్కుల ప్రవాహం ఇలాగే కొనసాగితే ఆదివారం సాయంత్రం నాటికి 2.5 టీఎంసీల నీటి విడుదల దాదాపుగా పూర్తవుతుందని జూరాల ప్రాజెక్టు ఈఈ శ్రీధర్ తెలిపారు. మంగళవారం నాటికి పై నుంచి కృష్ణా జలాలు వచ్చి చేరుతాయన్నారు. ఊహించిన దానికంటే కర్నాటక ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించారని జూరాల అధికారులు తెలిపారు.

మండు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్న వేళ కర్నాటక ప్రభుత్వం తెలంగాణ సీఎం అభ్యర్థనకు స్పందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయించేందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles