నామినేషన్లు షురూ..

Mon,April 22, 2019 01:05 AM

-ఈనెల 24వరకు నామినేషన్ల స్వీకరణ
-నాలుగు మండలాల్లోని 4 జెడ్పీటీసీ, 54ఎంపీటీసీలకు ఎన్నికలు
-మండల కేంద్రాల్లోనే నామినేషన్లు ఆన్‌లైన్‌లోనూ అవకాశం
-25న పరిశీలన, 28న ఉపసంహరణ
-మే 6న ఎన్నికలు : 27న ఫలితాల లెక్కింపు
-అభ్యర్థుల ఖరారు చేస్తోన్న పార్టీలు ఏర్పాట్లు చేపట్టిన ఎన్నికల అధికారులు
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలోని గట్టు, కేటీదొడ్డి, గద్వాల ధరూర్ నాలుగు మండలాల్లోని 4 జెడ్పీటీసీ, 54 ఎంపీటీసీ స్థానాలకు గాను జరగబోయే ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. మండల కేంద్రాల్లోని ఎంపీడీవో ఛాంబర్లలో జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు, అదే ప్రాంతంలో ప్రత్యేకంగా క్లస్టర్ల వారీగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు ఉదయం 10:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు స్వీకరించనున్నారు. దీనికోసం రిటర్నింగ్ అధికారులను కూడా ఇప్పటికే నియమించడం జరిగింది. ఈసారి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్లు దరఖాస్తు చేసే అవకాశం కల్పించడం ప్రత్యేకత. అయితే ఆన్‌లైన్ కాపీని తీసుకొని మద్దతుదారులతో కలిసి మండల కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఈనెల 25న పరిశీలన, 27న ఫిర్యాదులను స్వీకరిస్తారు.

28వ తేదీన ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. మే 6వ తేదీన ఈ స్థానాల పోలింగ్ ఉండగా 27వ తేదీన ఫలితాల లెక్కింపు ఉంటుంది. ఆ రోజే అభ్యర్థుల తుదిజాబితా ఖరారు చేయడంతో పాటుగా స్వతంత్రులకూ గుర్తు కేటాయింపు ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులకూ ప్రచార వ్యయ పరిమితిని విధించారు. జెడ్పీటీసీలు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ఇక ఎంపీటీసీకి పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్‌గా రూ.1,250, జనరల్ అభ్యర్థులు రూ. 2,500చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500 ఉండగా జనరల్ అభ్యర్థులకు రూ.5వేలుగా నిర్ణయించడం జరిగింది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీలకు గులాబీ రంగు, జెడ్పీటీసీలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఓటర్లు తొలుత ఎంపీటీసీలకు ఓటు వేశాక జెడ్పీటీసీలకు వేయాల్సి ఉంటుంది.

పార్టీల్లో హడావిడి..
సర్పంచ్ పదవుల తర్వాత గ్రామస్థాయిలో జరగనున్న ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీ గుర్తులతో జరగనుండటంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సహా ఇతర పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ జోగుళాంబ గద్వాల ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి నిరంజన్‌రెడ్డిని నియమించింది. ఇప్పటికే నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల ఎన్నికల్లో గెలుపునకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం నియోజకవర్గాల్లో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి మం డల ముఖ్య నాయకుల సలహాలు తీసుకొంటూ అభ్యర్థుల ఖరారుపై చర్చిస్తున్నా రు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సంతోషం నింపుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌లో ఒక్కో స్థానానికి నలుగురైదుగురు ఆశావహులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులే దొరకని పరిస్థితులు ఉన్నాయి. దీంతో వెతికి మరీ అభ్యర్థులను బరిలో నిలిపి పరువు కాపాడుకునేందుకు ఆయా నియోకవర్గ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. తొలివిడత జరిగే పరిషత్ ఎన్నికలకు గాను సోమవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles