మిగిలింది పది రోజులే..!‚‚

Sun,April 21, 2019 12:49 AM

గద్వాల టౌన్ : మున్సిపాలిటీ పరిధిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ముందస్తు చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ వర్తించే విధంగా చర్యలు తీసుకుంది. అందుకు ఈ నెల 30 వరకు గడువు విధించింది. గడువు లోపు ఆస్తి పన్నులు చెల్లించే వారికే రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం విధించిన గడువు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకు గానూ ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి మున్సిపాలిటీలకు ఉత్తర్వులు అందాయి. కానీ మున్సిపాలిటీ అధికారులు అందుకు తగ్గ చర్యలు చేపట్టడంలో విఫలమ వుతున్నారు. దీంతో ప్రజల్లో అవగాహన కొరవడింది. ఇప్పటి వరకు కేవలం రూ.2.85 లక్షలు మాత్రమే వసూళ్లు అయ్యాయి. ప్రభుత్వం విధించిన గడువుకు ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలింది.

5 శాతం రాయితీ
ముందస్తు పన్ను చెల్లింపు ఇటు యజమానులకు, మున్సిపాలిటీకి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలలకు అంటే జూన్ 30 లోపు చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసుము ఉండదు. గడువు దాటితే రూ.100కు రూ.2 చొప్పున అపరాధ రుసుము విధిస్తారు. అలాగే రెండవ ఆరు నెలలకు అంటే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసుము ఉండదు. గడువు దాటితే మొదటి రూ.100కు రూ. 2లు అపరాధ రుసుము చెల్లించాల్సిందే. ఉదాహరణకు రూ.900లు ఇంటి పన్ను ఉంటే అపరాధ రుసుముతో కలిపి రూ.1250 అయ్యే అవకాశం ఉంది. తద్వారా యజమానులకు అపరాధ రుసుము అధిక భారంగా మారుతుంది. ముందస్తు చెల్లింపుతో రూ. 300లు ఆధా అయ్యే అవకాశం ఉంది. అందుకు గానూ మున్సిపాలిటీకి ముందస్తు ఆస్తి పన్నులు చెల్లించేవారికి ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ముందస్తు చెల్లించేవారికి 5 శాతం రాయితీని ప్రకటించింది. అయితే రెండు వాయిదాల్లో చెల్లించే పన్నును ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి మొత్తాన్ని చెల్లించిన వారికే మాత్రమే రాయితీ వర్తిస్తుంది.

అధికారులు విఫలం..
ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ పరంగా ఎలాంటి ప్రకటనలు గానీ, ప్రచారం కానీ నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనం. కేవలం అక్కడక్కడ రాయితీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. అయితే కొందరు యజమానులు మాత్రం స్వచ్ఛందంగా తరలి వచ్చి రాయితీని సద్వినియోగపరుచుకుంటున్నారు.

వసూళ్లు అయ్యింది రూ.2.85 లక్షలు
క్రమం తప్పకుండా పన్నులు చెల్లించే వారు రాయితీ పొందేందుకు అర్హులు. ఈ మేరకు 4396 కుటుంబాలు ఈ రాయితీ పొందేందుకు అర్హులుగా ఎంపికయ్యారు. వీరి ద్వారా రావాల్సిన ఆదాయం 1 కోటి 49 లక్షలు. కాగా ఇప్పటి వరకు రూ.2.85 లక్షల మేరా మాత్రమే ఆదాయం సమకూరింది. ఇంకా ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే గడువులోపు మున్సిపాలిటీకి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles