నూకల మాటున రేషన్ బియ్యం !

Thu,April 18, 2019 12:31 AM

- వ్యాన్ వెనుక వైపున రేషన్ బియ్యం..
- ముందు భాగంలో నూలక బియ్యం సరఫరా
- నయాదందాకు తెరలేపిన అక్రమార్కులు
- పెబ్బేరులోని ఏబీడీ మద్యం కంపెనీపై దాడులు
- 124 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

పెబ్బేరు రూరల్ : రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. అధికారుల కళ్లు కప్పేందుకు నూకల మాటున రేషన్ బియ్యం తరలి స్తున్నారు. ఈ విషయం పెబ్బేరు మండలం రంగాపురంలో మంగళవారం రాత్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారుల తనిఖీల్లో బయటపడింది. స్థానికంగా ఉన్న ఒక మద్యం తయారీ కంపెనీకి నూకల పేరు మీద తరలించిన డీసీఎం లోడును పరిశీలించగా ఈ వ్యవహారం బయటికి పొక్కింది. కంపెనీలో మద్యం తయారీకి నిత్యం బియ్యం అవసరమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో కొందరు చిరు వ్యాపారులు సేకరించిన రేషన్ బియ్యం కూడా కంపెనీకి వస్తున్నట్లు తెలిసింది. పలు ప్రాంతాల నుంచి రాత్రి వేళల్లో ఆటోలు, జీపులు, డీసీఎంలలో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణ లున్నాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు రంగాపురం వద్ద నున్న ఏబీడీ మద్యం తయారీ కంపెనీలో దాడులు నిర్వహించారు. వీరికి ఒక డీసీఎంలో 124 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. డీసీఎం వెనుకభాగం కొన్ని నూకల బస్తాలు ఉంచి లోపలి భాగం మొత్తం రేషన్ బియ్యం బస్తాలను పేర్చారు. వాహనంలో మొత్తం నూకల బస్తాలే ఉన్నాయని భ్రమింపజేసేందుకు అక్రమార్కులు ఈ దారిని ఎంచుకున్నట్లు అధికారులు నిర్ధారణకొచ్చారు. వెంటనే వారు వనపర్తి పౌర సరఫరాల శాఖాధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి డీసీఎంను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. ఈ డీసీఎం నాగర్ కర్నూలులోని మహాలక్ష్మీ రైస్‌మిల్లు నుంచి బయలు దేరిందన్నారు. డ్రైవరు వెంకటరెడ్డి వద్ద వనపర్తి స్వామి ట్రేడర్స్ పేరు మీద వేబిల్లు లభించిందని సహాయ పౌర సరఫరాల అధికారి రాజేందర్, డీటీ నంద కిషోర్ బుధవారం తెలిపారు. తాము కేసు నమోదు చేసి స్థానిక పోలీసులకు డీసీఎంను అప్పగించినట్లు వారు చెప్పారు. ఇటీవల ఎన్నికల విధుల దృష్ట్యా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించలేక పోయామని, ఇక నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని వారు వివరించారు.

మద్యం కంపెనీలో యూరియా బస్తాలు లభ్యం
రంగాపురం ఏబీడీ మద్యం తయారీ కంపెనీలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారుల తనిఖీలో 44 యూరియా బస్తాలు లభ్యమయ్యాయి. మద్యం తయారీకి బియ్యంతో పాటు యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులు కూడా వాడుతున్నట్లు అధికారులు అనుమాని స్తున్నారు. ఈ విషయం మొదటిసారి వెలుగులోకి రావడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. విషయం తెలిసిన మద్యం ప్రియులు సైతం విస్తు పోతున్నారు. నిజంగానే మద్యం తయారీలో యూరి యాను వాడుతున్నారా లేదా అనే విషయం విచారణలో బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles