మరో గెలుపు బాధ్యత

Wed,April 17, 2019 12:36 AM

-సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం
-ప్రాదేశిక ఎన్నికలకు ఇన్‌చార్జిలు
-పరిషత్ ఎన్నికలపై పకడ్బందీ వ్యూహం
- మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యదర్శులు కీలకం
-వనపర్తి, జోగుళాంబ గద్వాల ఇన్‌చార్జిగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు, మంత్రులు పరిషత్ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను భుజానికెత్తుకుంటున్నారు. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల పోరులో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేశారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రాబోతున్న పరిషత్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ వారికి మరో బాధ్యతను అప్పగించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగుతున్నందున అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పారు. అందుకు అనుసరించాల్సిన పక్కా వ్యూహాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులకు వివరించారు. ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించిన సంగతి విధితమే.

రెండు జిల్లాల ఇన్‌చార్టిగా మంత్రి సింగిరెడ్డి
వనపర్తితో పాటు జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగే పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఈ రెండు జిల్లాల్లోని అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే విధంగా మంత్రి ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే వివిధ ఎన్నికల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి చేస్తున్న వ్యూహం సునాయసంగా విజయానికి చేరువ చేస్తూ వస్తుంది. అదేబాటలో నేటి పరిషత్ సమరాన్ని కూడా నడిపించేందుకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ బాధ్యులందరి సమన్వయంతో పని చేసి పరిషత్ ఎన్నికల విజయాన్ని అందుకునేందుకు వ్యూహంతో వెలుతున్నారు. రెండు జిల్లాల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యుల నిర్వహణలో ప్రాదేశిక సమరాన్ని విజయవంతంగా నిర్వహించాలన్న లక్ష్యంతో మంత్రి నిరంజన్‌రెడ్డి ముందుకు వెళుతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు కీలకం
పరిషత్ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14 అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. ఏకమొత్తంగా ఎమ్మెల్యేలంతా ఉండటం గులాబీ దళంకు పరిషత్ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే, గతంలో ఒకే ఒక్క జిల్లా పరిషత్ ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఇప్పుడు మొత్తం ఐదు జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. వీటికి అనుగుణంగా జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్, జిల్లాలా వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఇక కేవలం అభ్యర్థులను మాత్రమే ఖరారు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సమావేశం అత్యంత ప్రాధాన్యతగా నిలుస్తుంది. వరుస విజయాలతో గ్రామ స్థాయిలో మరింత పటిష్టమైన టీఆర్‌ఎస్‌కు పరిషత్ పోరులో విజయం అందుకోవడం మరింత కలిసి వచ్చే అంశాంగా నిలుస్తుంది.

పరిషత్ ఎన్నికలపై పక్కా వ్యూహం
రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలైనా టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ స్థాయి వరకు టీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఈ వ్యూహానికి తగ్గట్టుగా ఎన్నికల ఫలితాలు సహితం గులాబీ దళం అందిపుచ్చు కుంటుంది. ఎన్నికల వ్యవహరంలో ముందు నుంచి ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇటు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయడం.. అటు వైపు వీటిని అమలు చేసే దిశగా కేటీఆర్ సమన్వయంతో వ్యవహరిస్తూ వెళ్లడంతో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయపరంపర కొనసాగిస్తున్నది. నేటి పరిషత్ ఎన్నికల్లోను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని సీఎం కేసీఆర్ పరిషత్ ఎన్నికలపై దిశా.. నిర్దేశం చేయడంతో పార్టీ యంత్రాంగమంత అప్రమత్తమయింది.

64
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles